తెల్లారితే పెళ్లి.. అంతలోనే కనిపించకుండా పోయిన వరుడు.. పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి విస్తుపోయే నిజాలు!
ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఒక వధువు తన ప్రేమికుడితో కలిసి పెళ్లికి ఒక రోజు ముందు కాబోయే భర్తను హత్య చేయించింది. ఈ సంఘటన రాంపూర్ జిల్లాలో జరిగింది. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వధువు ప్రేమికుడితో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. వారు ఇచ్చిన సమాచారంతో వరుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం తర్వాత కుటుంబసభ్యులకు అప్పగించారు.

పెళ్లికి ఒక రోజు ముందే కాబోయే భర్తను ప్రియుడితో కలిసి వధువు హత్య చేయించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో వెలుగు చూసింది. రాంపూర్ జిల్లాకు చెందిన 35 ఏళ్ల నిహాల్, వివాహాలు, పార్టీలకు క్యాటరింగ్ చేస్తూ జీవనం సాగించేవాడు. అయితే ఇతనికి భోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధనుపుర గ్రామానికి చెందిన గుల్ఫాషా అనే మహిళతో నాలుగు నెలల క్రితం వివాహం నిశ్చయించబడింది. కాగా వీరిద్దరికి జూన్ 15న వివాహం జరగాల్సి ఉంది. కానీ ఇంతలోనే దారుణం జరిగిపోయింది. నిహాన్‌తో పెళ్లి ఇష్టంలేని గుల్ఫాషా తన ప్రియుడితో కలిసి జూన్ 14న కాబోయే భర్తను హత్య చేయించింది. ఈ దారుణ హత్య కుటుంబ సభ్యులతో పాటు స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జూన్ 14న నిహాల్ కు ఒక వ్యక్తి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి తనను తాను వధువు బంధువుగా పరిచయం చేసుకున్నాడు. పెళ్లికి కొత్తబట్టల కోసం కొలతలు తీసుకోవాలని అతను నిహాల్‌ను బయటకు రావాలని పిలిచాడు. దీంతో నిహాల్ ఇంటి నుండి బయటకు రాగా అప్పటికే అక్కడ బైక్‌పై వెయిట్ చేస్తున్న ఫోన్ చేసిన వ్యక్తితో పాటు మరో వ్యక్తి నిహాల్‌ను అక్కడి నుంచి తీసుకొని వెళ్లిపోయారు. అయితే సాయంత్రం అయినా నిహాల్ ఇంటికి తిరిగి రాకపోవడంతో కంగారు పడిన కుటుంబసభ్యులు అతని కోసం వెతకడం ప్రారంభించారు. ఎంత వెతికినా నిహాల్ కనిపించక పోవడంతో స్థానికంగా ఉన్న గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే వధువు గుల్ఫాషా ప్రేమ విషయం ముందే తెలిసిన వీరు నిహాల్ మిస్సింగ్‌లో వధువుతో పాటు అమె ప్రేమికు ప్రమేయం కూడా ఉన్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా అనుమానితులను గుర్తించారు. నిహాల్‌ను బైక్‌పై ఎక్కించుకు వెళ్లిన వధువు ప్రేమికుడు సద్దాంతో పాటు అతని స్నేహితుడు ఫర్మాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వారిని పీఎస్‌కు తరలించి విచారించగా నిహాల్‌ను హత్య చేసినట్లు అంగీకరించారు. నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా, అజీమ్‌నగర్ సమీపంలోని రతన్‌పురా అడవిలోని మొక్కజొన్న పొలంలో నిహాల్ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. నిహాల్ సోదరుడు నయాబ్ షా దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు గుల్ఫాషా, సద్దాం, ఫర్మాన్, అనీస్ అనే మరో వ్యక్తిపై అధికారికంగా కేసు నమోదు చేశారు.
నిందితులపై కిడ్నాప్, హత్య అభియోగాలు మోపినట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ అతుల్ శ్రీవాస్తవ తెలిపారు. నిహాల్‌ను గొంతు కోసి చంపి, మృతదేహాన్ని పొలంలో దాచిపెట్టారని ఆయన ధృవీకరించారు. అతని మొబైల్ ఫోన్ కూడా ధ్వంసం చేసినట్టు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులు గుల్ఫాషా, అనీస్‌లను గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. గుల్ఫా 32 ఏళ్ల పొరుగువాడైన సద్దాంతో ఒక సంవత్సరం పాటు ప్రేమలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. గుల్ఫా పెళ్లి చేసుకోవడంపై సద్దాం ఆగ్రహం వ్యక్తం చేశాడని.. పెళ్లి చేయవద్దని ఆమె కుటుంబ సభ్యులతో సద్దాం గొడవ కూడా పడ్డాడని పోలీసుల దర్యాప్తులో తెలిసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




