Hyderabad: సికింద్రాబాద్ టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది దుర్మరణం
హైదరాబాద్ మహానగరంలో ఉన్న ఓ టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సికింద్రాబాద్ పరిధిలోని బోయగూడలో ఉన్న టింబర్ డిపోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Fire Accident in Secundrabad: హైదరాబాద్(Hyderabad) మహానగరంలో ఉన్న ఓ టింబర్ డిపో(Timber Depot)లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సికింద్రాబాద్ పరిధిలోని బోయగూడలో ఉన్న టింబర్ డిపోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున జరిగిన ఘటనలో 11 మంది సజీవ దహనం అయ్యారు. టింబర్ డిపోలో చెక్కలు మంటలు అంటుకుని తగలబడటంతో కార్మికులు అదుపుచేయలేకపోయారు. క్రమంగా అవి అక్కడే ఉన్న దుంగలు, కట్టెలకు మొత్తానికి విస్తరించినట్లు పోలీసులు తెలిపారు.సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. భారీగా మంటలు వ్యాపించడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో మంటలను అదుపుచేయడాని ఫైర్ సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. 8 ఫైర్ ఇంజిన్ల సిబ్బంది గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పోలీసులు తెలిపారు.
జనావాసాలకు సమీపంలో మంటలు ఒక్కసారిగా తీవ్రంగా వ్యాపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. చుట్టుపక్కల ప్రజలు భయంతో పరుగులు తీశారు. కాగా.. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.