కరోనా భ‌యంతో వేసిన కంచెతో వ్యక్తి మృతి..

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. ప్ర‌జ‌లేవ‌రూ ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రాకుండా పోలీసులు, అధికారయంత్రాంగం క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే విద్యుత్ శాఖ ఉద్యోగిగా విధులు...

కరోనా భ‌యంతో వేసిన కంచెతో వ్యక్తి మృతి..
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 26, 2020 | 12:23 PM

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. ప్ర‌జ‌లేవ‌రూ ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రాకుండా పోలీసులు, అధికారయంత్రాంగం క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లోని అన్ని గ్రామాలు, ప‌ట్ట‌ణాల్లోనూ స‌రిహ‌ద్దుల వ‌ద్ద భ‌ద్ర‌తాను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక ప్రాంతం వారు మ‌రో ప్రాంతానికి వెళ్ల‌కుండా, రాకుండా స్థానికులు సైతం గ‌ట్టి నిఘా ఏర్పాటు చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల ముళ్ల కంపలు, మరికొన్ని చోట్ల బండరాళ్లు ఉంచి అన్ని దారులను మూసివేశారు. కొన్ని గ్రామాల్లో అయితే, ఆ ఊరి యువత కాపలా ఉంటున్నారు. అక్కడక్కడా సర్పంచిలు సైతం అప్రమత్తంగా ఉండి ఊరి పొలిమేరల్లో ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, తమ ఊరికి బయటివారు రావొద్దని ఓ గ్రామ సరిహద్దుల్లో కంచెలా వేసిన పైపులు ఓ వ్య‌క్తి ప్రాణం తీశాయి.  వివ‌రాల్లోకి వెళితే….

వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవర్ పల్లి మండలం ధర్మారం గ్రామంలో ఈ విషాద ఘ‌ట‌న‌ చోటు చేసుకుంది. ధర్మారం గ్రామానికి చెందిన రమేశ్ అనే వ్యక్తి అదే ప్రాంతంలో విద్యుత్ శాఖ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. లైన్ మెన్ అయిన ర‌మేష్ లాక్ డౌన్ సందర్భంలోనూ అత్యవసర సేవల్లో భాగంగా విధుల్లో ఉండాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో తమ ప్రాంతంలో కరెంటు పోయిందని, పక్క గ్రామానికి చెందిన వారు లైన్ మెన్ రమేశ్‌కు ఫోన్ చేశారు. దీంతో పక్క ఊరు జిల్గుకు వెళ్లి పని పూర్తి చేసి, స్వగ్రామం ధర్మారానికి బైక్‌పై తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

లైన్‌మేన్ ర‌మేష్ వ‌స్తున్న మార్గంలో ఇతర గ్రామాల ప్రజలు తమ సరిహద్దుల్లో పైపులను కంచెలుగా వాడారు. రోడ్డుపై అడ్డుగా వాటిని వేసి ఉండడంతో బైక్‌పై వెళ్తున్న రమేశ్… పైపులు తగిలి కింద‌ప‌డిపోయాడు. తీవ్రంగా గాయ‌ప‌డ్డ అత‌న్ని స్థానికులు గ‌మ‌నించి హుటాహుటినా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కాగా చికిత్స పొందుతూ ర‌మేష్ మృతిచెందాడు. దీంతో అత‌డి కుటుంబీకులు క‌న్నీరు మున్నీరుగా విల‌పిస్తున్నారు. విధి నిర్వ‌హ‌ణ‌లో భాగంగా ప్ర‌మాదంలో మృతిచెందిన ర‌మేష్ గ్రామంలోనూ విషాదఛాయ‌లు అలుముకున్నాయి.