జింకులో కావాలా.. బంకులో కావాలా.. దుబాయ్‌లో ఉద్యోగాలంటూ ఎర.. సీన్ కట్ చేస్తే.!
అబుదాబిలో ఉద్యోగాలన్నారు. నెలకు లక్షల్లో జీతమని ఆశజూపి నిరుద్యోగ యువతకు వలేశారు. లక్షలు కాజేసి బోర్డు తిప్పేసి నిలువున ముంచారు. తాము కేటుగాళ్ల చేతిలో మోసపోయామని తెలుసుకున్న బాధితులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘరానా మోసం జిల్లాలో సంచలనంగా మారింది. విజయనగరం జిల్లా కేంద్రంలోని వైజాగ్ రోడ్లో లైఫ్ లైన్ ట్రావెల్ ఏజెన్సీ పేరిట కార్యాలయాన్ని ప్రారంభించారు నిర్వాహకులు.
అబుదాబిలో ఉద్యోగాలన్నారు. నెలకు లక్షల్లో జీతమని ఆశజూపి నిరుద్యోగ యువతకు వలేశారు. లక్షలు కాజేసి బోర్డు తిప్పేసి నిలువున ముంచారు. తాము కేటుగాళ్ల చేతిలో మోసపోయామని తెలుసుకున్న బాధితులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘరానా మోసం జిల్లాలో సంచలనంగా మారింది. విజయనగరం జిల్లా కేంద్రంలోని వైజాగ్ రోడ్లో లైఫ్ లైన్ ట్రావెల్ ఏజెన్సీ పేరిట కార్యాలయాన్ని ప్రారంభించారు నిర్వాహకులు. నిరుద్యోగ యువతకు గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు ఇస్తామని ప్రకటనలు గుప్పించారు. ప్రధానంగా ఆంధ్రా ఒడిస్సా బోర్డర్‌లోనే పలు అమాయక గిరిజన గ్రామాల యువతను టార్గెట్ చేశారు. ఆ గ్రామాల్లో ఉన్న వెల్డర్స్, ఎలక్ట్రిషయన్స్తో పాటు ఇతర స్కిల్డ్ లేబర్‌ను కలిసి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించారు. నెలకు రెండు లక్షల జీతమని, ఐదేళ్లకు ఒకసారి జీతం రెట్టింపు అవుతుందని ఆశ జూపారు. వారి మాయమాటలు నమ్మిన సుమారు 123 మంది యువకులు విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేశారు. తరువాత విదేశాలకు వెళ్లడానికి కొంత ప్రక్రియ ఉంటుందని అందుకోసం అడ్రస్ ప్రూఫ్‌లతో పాటు ఒక్కొక్కరికి 65 వేలు ఖర్చువుతుందని, ఆ డబ్బు ఇస్తే ప్రక్రియ పూర్తి చేస్తామని నమ్మించారు నిర్వాహకులు.
వారి మాటలు నమ్మిన యువకులు నిర్వాహకులు అడిగినట్లు అడ్రస్ ప్రూఫ్‌లతో పాటు 65 వేల నగదు అందజేశారు. ఆ తరువాత ఈ నెల 5 న అందరూ విజయనగరంలోనే తమ కార్యాలయం వద్దకు లగేజ్‌తో రావాలని, అలా వస్తే అక్కడినుండి విశాఖకు తీసుకెళ్లి అందరిని ఒకేసారి విమానంలో అబుదాబికి తీసుకెళ్తామని చెప్పారు. వారు చెప్పినట్లే ఐదవ తేదీన మొత్తం 123 మంది యువకులు విజయనగరం కార్యాలయానికి చేరుకున్నారు. తీరా వచ్చి చూసేసరికి ఏజెన్సీ బోర్డ్ తీసేసి కనిపించింది. కార్యాలయానికి తాళాలు కూడా వేసి ఉన్నాయి. నిర్వాహకులకు ఫోన్ చేస్తే ఫోన్స్ స్విచ్చాఫ్ చేసి ఉన్నాయి దీంతో కేటుగాళ్ల చేతిలో తాము మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు బాధితులు. అనంతరం జిల్లా ఎస్పీ దీపికను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని తెలియజేసి కన్నీటి పర్యంతమయ్యారు. నిర్వాహకులను పట్టుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. ఇటీవల ఉద్యోగాలు పేరిట నిరుద్యోగ యువతను పలువురు మోసగాళ్లు నమ్మించి మోసం చేస్తున్నారని, అలా ఎవరూ మోసపోవద్దని సూచించారు. ఉద్యోగాలు ఇస్తామని ఎవరైనా డబ్బులు కట్టమని చెప్తే అలాంటి వారిని తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..