కంటైనర్ లారీ ఆపి పోలీసుల తనిఖీలు.. లోపలున్న మూటల్ని ఓపెన్ చేయగా కళ్లు జిగేల్..
ఎప్పటిలానే పోలీసులు ఆ రోజు కూడా సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అటుగా వెళ్తున్న ఓ కంటైనర్ లారీ, పైలెట్ వెహికిల్‌తో వచ్చి అక్కడ ఆగింది. లోపల చెక్ చేయగా.. పాత ఫర్నీచర్ కనిపించింది.. కొంచెం పరీక్షించి చూడగా.. ఏదో మెరుస్తూ కనిపించింది..
రాజమండ్రి నుంచి చెన్నైకి పెద్ద మొత్తంలో గంజాయిని తరలిస్తున్న మినీ లారీని బాపట్లలో సెబ్ అధికారులు పట్టుకున్నారు. అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. బాపట్ల శివారు సూర్యలంక కింద వంతెన వద్ద పైలెట్ వాహనంతో పాటు వెళ్తున్న కంటైనర్ లారీని బాపట్ల, చీరాల సెబ్ పోలీసులు ఆపి తనిఖీ చేశారు. వాహనం లోపల పెద్ద మొత్తంలో గంజాయి బస్తాలు ఉన్నట్టు గుర్తించారు. ఇక ఆ వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి గూడపాటి వేణుబాబుతో పాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకుండా పాత ఫర్నీచర్ వెనుక గంజాయిని దాచిపెట్టారని అన్నారు సెబ్ డిఎస్పీ నరసింహారావు. మొత్తం 457 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న సెబ్ అధికారులు.. దాని విలువ సుమారు రూ. 25 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా, నిందితులపై కేసు నమోదు చేసి.. లోతైన దర్యాప్తు చేస్తున్నారు. దీనికి వెనుక ఉన్న ముఠాను త్వరలోనే పట్టుకుంటామన్నారు.