Machilipatnam: మచిలీపట్నం నుంచి 3 ఎన్నికల్లో ముగ్గురు కొత్త ముఖాలు.. ఈసారి ఎవరో తెలుసా..?

మచిలీపట్నం కొత్త ముఖాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. గతంలో కూడా అనేక మంది నేతలు ఇక్కడ పోటీ చేసే సమయానికి కొత్త ముఖాలే. తాజాగా మచిలీపట్నం పార్లమెంటు వైసీపీ అభ్యర్థుని ప్రకటించింది. లోక్ సభ అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖర్ ను బరిలో దింపబోతున్నట్లు మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు.

Machilipatnam: మచిలీపట్నం నుంచి 3 ఎన్నికల్లో ముగ్గురు కొత్త ముఖాలు.. ఈసారి ఎవరో తెలుసా..?
YSR Congress Party
Follow us
S Haseena

| Edited By: Balaraju Goud

Updated on: Mar 09, 2024 | 11:29 AM

మచిలీపట్నం కొత్త ముఖాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. గతంలో కూడా అనేక మంది నేతలు ఇక్కడ పోటీ చేసే సమయానికి కొత్త ముఖాలే. తాజాగా మచిలీపట్నం పార్లమెంటు వైసీపీ అభ్యర్థుని ప్రకటించింది. లోక్ సభ అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖర్ ను బరిలో దింపబోతున్నట్లు మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. వైసీపీ వ్యూహం మార్చుతూ ప్రకటించిన ఎంపీ అభ్యర్థి కూడా కొత్త ముఖం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా మాజీ దేవాదాయ శాఖ మంత్రి సింహాద్రి సత్యనారాయణ కుమారుడు, ప్రముఖ కేన్సర్‌ వైద్యుడు సింహాద్రి చంద్రశేఖర్‌ పేరును ప్రకటించారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రశేఖర్‌ రాకతో మచిలీపట్నం పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలపై సానుకూల ప్రభావం పడుతుందన్నారు నాని. ప్రత్యక్ష రాజకీయాల్లో ఇప్పటిదాకా లేని తనను మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంపై సింహాద్రి చంద్రశేఖర్‌ సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

ఆరంభం నుంచి ఎన్నికల్లో అభ్యర్థులఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మచిలీపట్నం ఎంపీ విషయం అంతే ధీటుగా పావులు కదిపారు. మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థులుగా గత మూడు ఎన్నికల్లోనూ ముగ్గురు కొత్త ముఖాల్ని బరిలోకి దింపారు జగన్‌. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఉన్న బిసి సామాజిక వర్గానికి చెందిన కొనకళ్ళ నారాయణపై మాజీ మంత్రిగా పని చేసిన పార్థసారథిని బీసీ అభ్యర్థిగా మచిలీపట్నం బరిలో నిలిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో సామాజిక సమీకరణాల నడుమ గుంటూరు జిల్లాకు చెందిన వల్లభనేని బాలశౌరిని అభ్యర్థిగా నిలిపి విజయం సాధించారు. తాజాగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఇప్పటిదాకా ఏ అనుభవం లేని చంద్రశేఖర్‌ను బరిలోకి దింపుతున్నారు.

కొత్త అభ్యర్థి అయితే సక్సెస్‌ అవుతారన్న ఫార్ములాను మరోసారి రిపీట్ చేయాలని భావిస్తూనే, 2024 ఎన్నికల కోసం చంద్రశేఖర్‌ను బరిలోకి దించింది వైసీపీ. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నెలకొన్న సామాజిక సమీకరణాల ఆధారంగా జగన్‌ అభ్యర్థుల మార్పులు చేర్పులు చేయడంతో పార్థ సారథి తెలుగుదేశం పార్టీలో, బాల శౌరి జనసేన పార్టీలో చేరారు. పొత్తులో భాగంగా మచిలీపట్నం జనసేన అభ్యర్థిగా బాలశౌరి వైసీపీకి చెందిన సింహాద్రి చంద్రశేఖర్‌తో తలపడబోతున్నారు. ఇలా మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం కొత్త అభ్యర్థులకు రాజకీయ జన్మ స్థలంగా మారింది.

మచిలీపట్నం అభ్యర్థిగా ఉన్నత విద్యా వంతుడు, సౌమ్యుడు ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేని డాక్టర్ సింహాద్రి చంద్ర శేఖర్‌ను అభ్యర్థిగా ప్రకటించారు మాజీ మంత్రి పేర్ని నాని. సాధారణంగా ఎన్నికల్లో అభ్యర్థుల మార్పు సహజమే. అయినా మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థిగా మూడు పర్యాయాలు ముగ్గురు కొత్త మొఖాలను అభ్యర్థులుగా బరిలో నిలిపింది వైసీపీ. మూడు సార్లు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 2014 పార్థ సారథి , 2019 బాల శౌరి, 2024 లో చంద్ర శేఖర్‌ను ప్రకటించింది.

ఇదిలావుంటే, 2014 సార్వత్రిక ఎన్నికల్లో సామాజిక సమీకరణాలను అంచనా వేసుకుని కొలుసు పార్థసారధి బరిలోకి దింపిన వైసీపీ, తెలుగుదేశం అభ్యర్థి కొనకళ్ళ నారాయణ చేతిలో స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యారు. అయితే అనంతరం జరిగిన పరిణామాల నడుమున పార్థసారధిని అక్కడి నుంచి తప్పించి పెనమలూరు అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో నిలిపింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరిని మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిపి విజయం సాధించింది.

అయితే మచిలీపట్నం లోక్‌సభ పరిధిలో ఏడు నియోజకవర్గాల్లోని సామాజిక సమీకరణాలను ఆధారంగా అభ్యర్థుల మార్పులు చేర్పులు చేశారు వైసీపీ అధినేత జగన్. అయితే అటు పార్థ సారథి, ఇటు బాల శౌరి ఇద్దరు చెరో పార్టీలో చేరి వైసీపీకి గుడ్ బై చెప్పారు. బాలశౌరి ఉమ్మడి పొత్తులో మచిలీపట్నం అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు అభ్యర్థిత్వం ఖరారు అయ్యింది. ఈ నేపద్యంలో బాలశౌరికి పోటీగా సింహాద్రి చంద్రశేఖర్‌ను వైసీపీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో మచిలీపట్నం వేదికగా వైసీపీ అధిష్టానం వేస్తున్న తాజా సామాజిక సమీకరణాల లెక్కలు తెరపైకి వస్తున్నాయి.

మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖర్ పేరు ఖరారు చేసేందుకు భారీ వ్యూహరచన చేసింది వైసీపీ. అస్సలు రాజకీయాలతో పరిచయం లేకపోయినా స్వతహాగా వైసీపీతో ఎటువంటి అనుబంధం లేకపోయినా కొత్త ప్రయోగం చేసింది. సింహాద్రి చంద్రశేఖర్‌తో మరోసారి మచిలీపట్నం వేదికగా ప్రయోగించబోతోంది. అందుకు ప్రధాన కారణం సింహాద్రి చంద్రశేఖర్ కుటుంబ నేపథ్యం. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఆయన చేసిన సేవలను వినియోగించుకోవాలని భావిస్తోంది వైసీపీ. అందులో భాగంగానే మచిలీపట్నం అభ్యర్థిగా సింహద్రి చంద్ర శేఖర్‌ను ప్రకటించింది.

35 ఏళ్ల పాటు వైద్యుడిగా మచిలీపట్నం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో సేవలు అందించిన ఆయన, ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు అందరికీ సుపరిచితమే. ఆయన బరిలోకి దిగితే పార్టీకి లాభం చేకూరుస్తోందని వైసీపీ భావిస్తోంది. నిన్న మొన్నటి వరకు వంగవీటి రాధ, మండలి బుద్ధ ప్రసాద్ లేదంటే మరో కొత్తవారిని పార్టీలోకి ఆహ్వానించి ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తారని అంతా భావించారు. కొత్త లెక్కలు తెరపైకి వచ్చినా వాటికి చెక్ పెడుతూ అనూహ్యంగా సింహాద్రి చంద్రశేఖర్ ను ప్రకటించింది వైసీపీ.

అయితే అందుకు ప్రధాన కారణం సింహాద్రి చంద్రశేఖర్ తండ్రి సింహాద్రి సత్యనారాయణ మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేయడంతో పాటు దివిసీమ కృష్ణా డెల్టా పవిత్ర ప్రాంతాల్లో గుర్తింపు పొందారు. ప్రజా నాయకుడు కావడంతో ఆయన కుమారుడైన సింహాద్రి చంద్రశేఖర్ ను ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నియమించింది. మొదట సింహాద్రి చంద్రశేఖర్‌ను అవనిగడ్డ సమన్వయకర్తగా నియమించింది. ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డి కృష్ణాజిల్లా పర్యటనలో నేతల తోటి చర్చించి ఆయన ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. మొదట ఆయన నియామకానికి సంబంధించి సుదీర్ఘంగా చర్చించిన మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో నెలకొన్న తాజా రాజకీయ సమీకరణాల నడుమున అభ్యర్థి ఆయనే అని స్పష్టం చేసింది వైసీపీ. మొత్తానికి మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కొత్త ముఖాలు పరిచయం ఎన్నికల్లో పోటీపై కొత్త లెక్కలు సిద్ధం చేస్తుంది. చూడాలి వైసీపీ చేస్తున్న ప్రయోగం ఏ మేరకు ఫలితాన్ని ఇస్తుందో..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…