Shilpa Chaudhary: కిట్టీ పార్టీల పుట్టి కదులుతోంది.. తవ్వేకొద్ది వెలుగులోకి శిల్పా మోసాల పుట్ట.. కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్
కిట్టీ పార్టీల కుట్టి శిల్పా చౌదరి కుప్పగంతులు తవ్వినా కొద్ది వెలుగు చూస్తూనే ఉన్నాయి. బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు.
Shilpa Chaudhary Couple Cheating Case: కిట్టీ పార్టీల కుట్టి శిల్పా చౌదరి కుప్పగంతులు తవ్వినా కొద్ది వెలుగు చూస్తూనే ఉన్నాయి. బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. అధిక వడ్డీలు ఇస్తామంటూ పెద్ద మొత్తంలో వసూలు చేసి జైల్లో ఊచలు లెక్కబెడుతోంది. చాలామంది ప్రముఖుల్ని మోసం చేసిన శిల్ప.. దాదాపు రూ.200 కోట్ల దాకా కుచ్చు టోపీ పెట్టినట్లు చెబుతున్నారు. అయితే, శిల్ప చౌదరి కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. పలువురిని మోసం చేసి దాదాపు రూ.90 కోట్ల వరకు వసూలు చేసింది. ఆ డబ్బులతో గండిపేటలో లగ్జరీ విల్లాను కొనుగోలు చేసింది. వసూలు చేసిన సగం డబ్బుల్ని ఇంటి కోసమే ఖర్చు చేసినట్లు పోలీసుల విచారణలో తెరపైకి వచ్చింది. అధికవడ్డీ ఇస్తానని చెప్పి.. ప్రముఖుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు చెబుతున్నారు పోలీసులు. పార్టీలిచ్చి సెలబ్రెటీలను ఆకర్షించినట్లు తెలుస్తోంది. ప్రముఖులంతా పోలీస్ స్టేషన్ కు క్యూ కడుతున్నారు.
ఇప్పటి వరకు నార్సింగి పీఎస్‌లో నమోదైన కేసులో అరెస్ట్ అయిన శిల్పా చౌదరీ దంపతులు జైల్లో ఉన్నారు. అయితే వారిపై తాజాగా మరో కేసు నమోదైంది. రూ.2కోట్ల 50 లక్షల తీసుకుని మోసం చేసిందని ప్రియా అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమ పిల్లల వివాహం కోసం దాచుకున్న డబ్బును అధిక వడ్డీ ఆశతో శిల్పకు ఇచ్చామని బాధిత మహిళ మొరపెట్టుకుంటోంది. గత రెండు ఏళ్ల నుంచి వడ్డీ కట్టలేదని.. డబ్బులు కూడా తిరిగి ఇవ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొంది. కాగా, ఇప్పటివరకు నార్సింగిలో నాలుగు, జూబ్లిహీల్స్, బంజారాహిల్స్, మాదాపూర్ పీఎస్ లో మొత్తం 8 కేసులు నమోదు చేశారు పోలీసులు. పోలీసుల విచారణలో శిల్పా బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు.
ఇదిలా ఉంటే ఒక్క నార్సింగి పరిధిలోనే సుమారు రూ.10 కోట్ల మోసానికి పాల్పడిందని పోలీసులు భావిస్తున్నారు. ట్విన్ సిటీలో ఈమె బాధితులు ఉన్నారని.. మొత్తం రూ.70కోట్లకు పైగా మోసం చేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. సినీ ప్రముఖుల నుంచి ఇండస్ర్టీయలిస్ట్‌ల వరకు ఎవరినీ వదిలి పెట్టలేదు శిల్పా చౌదరి. హంగూ.. ఆర్భాటం ప్రదర్శిస్తూ పలువురు సెలబ్రెటీలను బుట్టలో వేసుకొని కోట్లలో బురిడీ కొట్టించారూ కిలాడీ దంపతులు. రియల్ ఎస్టేట్‌లో లాభాలిస్తామంటూ ప్రముఖుల నుంచి భారీగా వసూలు చేశారు. అలా కొంత కాలం పాటు దండిగా దండుకొని హై లెవల్‌లో సంపాదించుకున్నారు. ఇంకేముందు అప్పులిచ్చిన వారు డబ్బులు అడగడం మొదలు పెట్టడంతో.. బౌన్సర్లను నియమించుకుంది. ఎవరైనా డబ్బులు అడిగేందుకు ఇంటికి వస్తే.. బెదిరించడం మొదలు పెట్టింది. దీంతో ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వీరి ఈ మాయనాటకం వెలుగుచూసింది.
ప్రాథమికంగా రూ.90కోట్లపైగా శిల్పా దంపతులు వసూళ్లకు పాల్పడినట్టు తెలుస్తోంది. మరింత లోతుగా విచారిస్తే వసూళ్ల పర్వం అంతకుమించి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే.. తమ హంగూ ఆర్భాటాలతో సిటీలో వ్యాపారవర్గాలకు చెందిన సుమారు 20 మంది మహిళలతో శిల్పాచౌదరి తరచూ కిట్టీ పార్టీలు ఏర్పాటు చేసేది. ఆమె ఉచ్చులో చిక్కిన మహిళలకు లాభాల ఆశచూపి భారీగా డబ్బు వసూలు చేసింది.అధిక వడ్డీ ఆశ చూపి..లాభాలు వస్తే వాటాలు ఇస్తామని, నష్టాలు వస్తే తీసుకున్న డబ్బుకు వడ్డీ కలిపి ఇస్తానంటూ నమ్మడమే బాధితుల పాలిట శాపంగా మారింది.
ఇదిలావుంటే, ఆమె వల్ల కోట్ల రూపాయల్లో మోసపోయిన బాధితులు ఫిర్యాదుచేయడానికి మరి కొందరు ముందుకు రావడంలేదు. ఐటీ కట్టకుండా దాచుకున్న డబ్బు ఆమెకు ఇచ్చినట్టు తెలుస్తోంది. వారి ఆస్తులపై ప్రభుత్వ ఏజెన్సీల నిఘా పెరిగే అవకాశం ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నట్టు సమాచారం. మరోవైపు, పోలీసులు మాత్రం లోతుగా విచారణ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే శిల్పా చౌదరి, ఆమె భర్త శ్రీనివాస్ చౌదరి నుంచి మూడు మొబైల్ ఫోన్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో సెల్‌ఫోన్‌లు తెరిచి అందులోని సమాచారంతో దర్యాప్తు చేయనున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు, కటకటాలు లెక్కిస్తున్న శిల్పా చౌదరి దంపతులను 7 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని నార్సింగి పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోటీ ఐదు లక్షల రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వలేదని దివ్య అనే మహిళ ఫిర్యాదు చేయగా.. శనివారం నార్సింగి పోలీసులు శిల్పా చౌదరిని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే. ఆమె మోసాలకు సంబంధించిన పూర్తివివరాలు సేకరించేందుకు పోలీసులు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఇవాళ ఈ పిటిషన్‌పై వాదనలు జరిగిన తర్వాత విచారణపై స్పష్టత వస్తుందని పోలీసు అధికారులు పేర్కొన్నారు.