AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: బంగారు అభరణాల కోసం భారీ స్కెచ్.. పోలీసుల ఎంట్రీతో ఖేల్ ఖతం.. ఇంతకీ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే!

కలకలం రేపిన రెండు కేజీల బంగారు ఆభరణాల బ్యాగు చోరీ కేసును హైదరాబాద్ పోలీసులు చేదించారు. ముంబై నగల వ్యాపారి వద్ద పని చేసే గులాబ్ మాలి, ప్రవీణ్ కుమార్‌లు చోరీ చేసినట్లు తేల్చారు.

Hyderabad: బంగారు అభరణాల కోసం భారీ స్కెచ్.. పోలీసుల ఎంట్రీతో ఖేల్ ఖతం.. ఇంతకీ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే!
Hyderabad Police
Balaraju Goud
|

Updated on: Sep 04, 2021 | 8:44 AM

Share

Gold Theft Case: కలకలం రేపిన రెండు కేజీల బంగారు ఆభరణాల బ్యాగు చోరీ కేసును హైదరాబాద్ పోలీసులు చేదించారు. ముంబై నగల వ్యాపారి వద్ద పని చేసే గులాబ్ మాలి, ప్రవీణ్ కుమార్‌లు చోరీ చేసినట్లు తేల్చారు. నిందితుల నుంచి కోటి రూపాయల విలువ చేసే రెండు కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

పంజాగుట్ట పీఎస్‌ పరిధిలో బంగారు ఆభరణాల చోరీ కేసును రెండు రోజుల్లోనే హైదరాబాద్‌ పోలీసులు గుట్టురట్టు చేశారు. ముంబై చెందిన నగలవ్యాపారి నుంచి రెండు కిలోల బంగారు నగలు దోచేసింది ఆయన కింద పనిచేసే ఉద్యోగే అని దర్యాప్తులో నిగ్గు తేల్చారు. ఈమేరకు బషీర్‌బాగ్‌లోని హైదరాబాద్‌ పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ వివరాలను వెల్లడించారు. చోరీకి పాల్పడ్డ ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.కోటి విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

ముంబైకి చెందిన రనూజ జ్యువెలర్స్‌ యజమాని శ్రవణ్‌ కుమార్‌.. హైదరాబాద్‌తో పాటు దేశంలోని పలు నగరాలకు బంగారు ఆభరణాలను సరఫరా చేస్తుంటారు. శ్రవణ్‌ వద్ద ఉద్యోగులుగా పనిచేసే ముకేష్‌, గులాబ్‌ మాలి ఇద్దరూ గత నెల 23న 3,336 గ్రాముల బంగారు ఆభరణాలను హైదరాబాద్‌లోని పలు షాపులకు డెలివరీ ఇచ్చేందుకు ముంబైలో బస్సెక్కారు. గోల్డ్‌ ట్రేడింగ్‌ , విలాసాలకు అలవాటు పడిన గులాబ్‌ మాలి అనే ఉద్యోగి.. అతని స్నేహితుడు ప్రవీణ్‌ కుమార్‌తో కలిసి బంగారాన్ని పక్కదారి పట్టించేందుకు పథకం వేశాడు.

పథకం ప్రకారం తన స్నేహితుడు ప్రవీణ్ కుమార్‌ను ముంబైలో బస్సెక్కించి, 2 కిలోలకు పైగా బంగారం ఉన్న ప్యాకెట్‌ను ప్రవీణ్‌కు ఇచ్చి పుణేలో దించేశాడు. హైదరాబాద్‌లోని అమీర్ పేటకు చేరుకున్న తర్వాత తాను నిద్రలో ఉన్నప్పుడు బంగారం చోరీకి గురైందని యజమాని, తోటి ఉద్యోగి ముకేష్‌తో నమ్మబలికాడు. ఇద్దరూ కలిసి సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. జీరో ఎఫ్ ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు కేసును పంజాగుట్ట పీఎస్ కు బదిలీచేశారు. పంజాగుట్ట ఏసీపీ గణేష్ బాదితులను లోతుగా విచారించగా వారిలో చోరీకి పాల్పడ్డ గులాబ్ మాలి తన తప్పును ఒప్పుకున్నాడు. తన స్నేహితుడు ప్రవీణ్ కుమార్ తో కలిసి ఈ చోరీకి పాల్పడ్డట్లు వెల్లడించాడు. చోరీకి గురైన బంగారం రాజస్థాన్ లోని ప్రవీణ్ ఇంట్లో దాచిపెట్టినట్లు సమాచారం అందించాడు.

దీంతో పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు. ఏసీపీ గణేష్ తన టీంతో కలిసి రాజస్థాన్ లోని ప్రవీణ్ ఇంటికి వెళ్లి చోరీకి గురైన 2,052.980 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన 69.150 గ్రాముల బంగారాన్ని నిందితుడు ప్రవీణ్ ఓ బ్యాంకులో కుదువ పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఆడబ్బును విలాసాలకు ఖర్చు చేశాడని పోలీసులు నిగ్గుతేల్చారు. పదేళ్లుగా యజమాని శ్రవణ్ కుమార్ దగ్గర నమ్మకంగా పనిచేసిన ఉద్యోగి గులాబ్ మాలీనే ఈ చోరీకి పథక రచన చేశాడని.. వ్యసనాలకు బానిసై ఈ దురాగతానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరినీ అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టారు. వేగంగా కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేసిన పంజాగుట్ట పోలీసులను సీపీ అంజనీకుమార్ ఈ సందర్భంగా అభినందించారు.

Read Also…  Traffic Police: అందులో నిజం లేదు.. ఆ వార్తను ఫార్వర్డ్‌ చేసిన వారిపై కఠిన చర్యలు. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ వార్నింగ్‌.