Cricket Betting: ఈ ఐపీఎల్‌లో బంతి బంతికి బెట్టింగ్.. కేటుగాళ్ల నయా ప్లాన్.. ఆట కట్టించిన పోలీసులు
ఓ వైపు దేశం మొత్తం కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతుంటే... బెట్టింగ్ రాయుళ్లు మాత్రం రెచ్చిపోతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. కొత్త ఎత్తుగడలు వేస్తూ.....
ఓ వైపు దేశం మొత్తం కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతుంటే… బెట్టింగ్ రాయుళ్లు మాత్రం రెచ్చిపోతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. కొత్త ఎత్తుగడలు వేస్తూ పోలీసులకు చిక్కకుండా బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను ఎల్‌బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు గుట్టురట్టు చేశారు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌పై మొదటి నుంచి నిఘా పెట్టిన ఎస్‌వోటీ పోలీసులు.. తీగలాగితో డొంకంతా కదిలింది. ఆన్‌లైన్‌లో కాకుండా కొత్తపద్ధతిలో ఓ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తోంది ముఠా. ఓ చిన్న క్లూ ఆధారంగా ఎస్‌వోటీ పోలీసులు దాడి చేసి బంటు రాజేష్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద నుండి సుమారు 30 లక్షల 55 వేల నగదు, ఐదు మొబైల్స్, 11 బ్యాంక్‌ల డెబిట్ కార్డ్స్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల నుంచి కొంత మంది ఆర్గనైజర్స్ క్రికెట్ బెట్టింగ్ కోసం ఒక యాప్‌ను తయారు చేశారు. ఆన్‌లైన్‌లో అయితే పోలీసులకు చిక్కుతామనే ఉద్దేశ్యంతో.. యాప్‌లోనే ఆఫ్‌లైన్‌లో బెట్టింగ్ నిర్వహించేవారు. అంతేకాదు ప్రభుత్వ బ్యాంకులు కాకుండా.. ప్రైవేట్ బ్యాంకుల్లో అకౌంట్ల ద్వారా లావాదేవీలు నిర్వహించేవారని పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ నిందితుడు బంటు రాజేష్ తెలంగాణ రాష్ట్రానికి ఆర్గనైజర్‌గా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.
అయితే, ఇక్కడ వీరంతా ఎంతో తెలివిగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహించేవారు. క్రికెట్ బెట్టింగ్ చెయ్యాలంటే ముందుగా వెయ్యి రూపాయలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అందులోనే పేరు, ఫోన్ నంబర్, అకౌంట్ వివరాలు నమోదు చేయాలి. ఇందులో రిజిస్ట్రేషన్ కాకుంటే బెట్టింగ్ నిర్వహించే ఛాన్స్ ఉండదని రాచకొండ సీపీ మహేష్ భగవత్ వివరించారు.
ఐపీఎల్ బెట్టింగ్‌లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని రాచకొండ పోలీసులు హెచ్చరించారు. బెట్టింగ్ రాయుళ్లు ఎన్ని ఎత్తుగడలు వేసినా…పోలీసుల నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు. ప్రధాన నిందితుడి బంటు రాజేష్ ఇచ్చే సమాచారంతో పోలీసులు ఈ కేసులో మరింత ముందుకెళ్లే ఛాన్స్ ఉంది. దీని వెనుక ఇంకెవరైనా బడాబాబులు ఉన్నారా…? అనే యాంగిల్‌లోనూ దర్యాప్తు చేస్తామన్నారు పోలీసులు.
Also Read: Telangana Corona: కొంపముంచిన చిడతల రామాయణం… ఒకే గ్రామంలో 100 మందికి పాజిటివ్..