AP Crime News: కొబ్బరికాయల లోడేలే అనుకున్నారు.. ఫార్మల్‌గా చెక్ చేశారు.. పోలీసుల మైండ్ బ్లాంక్
తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలులో ఓ కీలాడీ స్మగ్లింగ్ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ముఠా వ్యవహరించిన తీరు పోలీసులను...
తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలులో ఓ కీలాడీ స్మగ్లింగ్ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ముఠా వ్యవహరించిన తీరు పోలీసులను విస్మయానికి గురిచేసింది. కొబ్బరికాయల లోడు మాటున ఈ ముఠా గంజాయిని స్మగ్లింగ్ చేయడం కలకలం రేపింది. సూమారు రూ.28లక్షల విలువచేసే 1450 కిలోల గంజాయిని పోలీసులు తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కొబ్బరికాయల లోడులో గంజాయిని దాచి విశాఖ జిల్లా ఏజెన్సీ నుంచి మహారాష్ట్ర తరలిస్తుండగా గొల్లప్రోలు పోలీసులు పట్టుకున్నట్లు కాకినాడ డీఎస్పీ భీమారావు తెలిపారు. ఈ స్థాయిలో గంజాయి పట్టుబడటం పోలీసులను షాక్‌కు గురిచేసింది.
చింతపండు మాటున
విశాఖ జిల్లాలో ఇలాంటి సీనే రిపీట్ అయ్యింది. చింతపండు నిల్వలతో కలిపి తరలిస్తున్న 2100 కేజీల గంజాయిని నర్సీపట్నం రూరల్ పోలీసులు గబ్బాడ వంతెన వద్ద మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ధారకొండలో రూ.46 లక్షలకు కొనుగోలు చేశారని ఎస్సై రమేష్ వెల్లడించారు. కర్ణాటకకు చెందిన గౌసుద్దీన్, మహారాష్ట్రకు చెందిన మిర్జా రసీజ్‌బేగ్‌ను అదుపులోకి తీసుకురి వారి నుంచి రూ.6,300 నగదు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. డ్రైవర్ విజ్ఞానంద్, ధారకొండకు చెందిన మాణిక్, ఒడిశాకు చెందిన మహదేవ్ కార్తికేయకు ఈ కేసుతో సంబంధం ఉందని తేలడంతో వారిని నిందితుల లిస్ట్‌లో చేర్చామన్నారు.
మాడుగుల రూరల్‌లోనూ…
ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు తరలిస్తున్న 20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రామారావు తెలిపారు. ఎం.కోటపాడు వద్ద వాహన తనిఖీల్లో పది కేజీలు, రూ.20 వేల నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. మరోచోట 10 కేజీల గంజాయితో ఇద్దరు నిందితులు పట్టుబడ్డారన్నారు. కాగా ఎన్ని తనిఖీలు నిర్వహిస్తున్నా, కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నా.. గంజాయి అక్రమ రవాణా ఆగకపోవడం ఆందోళన కలిగిస్తుంది.
Also Read: గోడ రంధ్రంలో ఇరుక్కున్న నాగుపాము.. వైద్యం చేసి కాపాడిన స్నేక్ క్యాచర్.. ఎక్కడంటే.!