AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాజా భజంత్రీలతో పెళ్లి మండపానికి చేరుకున్న ఐదుగురు పెళ్లి కొడుకులు.. తాళం వేసి జంప్ అయిన వధువు..!

పెళ్లి చేసుకుంటానని చెప్పి ఐదుగురు వరులకు టోకరా ఇచ్చి పారిపోయింది నవ వధువు. ఈ ఉదంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ జిల్లాలో వెలుగుచూసింది.

బాజా భజంత్రీలతో పెళ్లి మండపానికి చేరుకున్న ఐదుగురు పెళ్లి కొడుకులు.. తాళం వేసి జంప్ అయిన వధువు..!
Grooms Duped By Runaway Bride
Balaraju Goud
| Edited By: Sanjay Kasula|

Updated on: Mar 29, 2021 | 4:38 PM

Share

పెళ్లి చేసుకుంటానని చెప్పి ఐదుగురు వరులకు టోకరా ఇచ్చి పారిపోయింది నవ వధువు. ఈ ఉదంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ జిల్లాలో వెలుగుచూసింది. హర్దా జిల్లాకు చెందిన ఓ యువకుడికి ఇన్నాళ్లకు ఓ సంబంధం కుదిరింది. దీంతో వరుడు పెళ్లి ముహూర్తం రోజు తన బంధుమిత్రులతో కలిసి వివాహ వేదిక వద్దకు చేరుకున్నాడు. ఆనందంలో పెళ్లి మండపానికి వెళ్లిన పెళ్లి కుమారుడు, వారి కుటుంబభ్యులకు షాక్‌ తగిలింది. కోలాహలంగా ఉండాల్సిన పెళ్లి మండపాలు తాళం వేసి ఉండటం చూసి వారు నోరెళ్లబెట్టారు.

ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఓకే రోజు ఐదుగురు పెళ్లి కుమారులకు ఇదే పరిస్థితి ఎదురైంది. మధ్యప్రదేశ్‌లోని హార్దా జిల్లాకు చెందిన ఓ యువకుడికి ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. ఓ ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం ఆయన వివాహం జరగాల్సి ఉంది. అయితే కుటుంబసభ్యులతో ముహూర్త సమయానికి పంక్షన్‌హాల్‌కు వెళ్లేసరికి ఎవరు కనిపించలేదు. పైగా ఆ ఫంక్షన్ హాల్‌కు తాళం వేసి ఉండటాన్ని బంధు మిత్రులు గమనించారు. దీంతో వధువుకు ఫోన్‌ చేస్తే స్విచ్చాఫ్‌ వచ్చింది. ఆమె కుటుంబసభ్యులను ఆరా తీసిన ప్రయోజనం లేకపోయింది.

దీంతో వారిపై ఫిర్యాదు చేసేందుకు వరుడు, ఆయన బంధువులు కోలార్‌ రోడ్‌ పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. అయితే, అక్కడ మరో నలుగురు పెళ్లి కుమారులు ఉండటం చూసి విస్మయానికి గురయ్యారు. వారు కూడా అతడిలాగే మోసపోయి ఫిర్యాదు చేసేందుకు వచ్చినవారు కావడం గమనార్హం.ఈ ఘటనకు సంబంధించి.. సీఎస్పీ భూపేంద్రసింగ్‌ మాట్లాడుతూ ముగ్గురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. సెల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా వారిని గుర్తించి అరెస్టు చేశామని, సెక్షన్‌ 420 కింద కేసులు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

‘యువకులకు పెళ్లి సంబంధం కుదరడం కష్టంగా ఉండే జిల్లాలను ఈ ముఠా ఎంచుకుంటుందని జిల్లా సీఎస్పీ భూపేంద్రసింగ్ తెలిపారు. అక్కడ పెళ్లి సంబంధాలు కుదిర్చేవారికి వారి ఫోన్ నంబర్లు ఇస్తారు. వారి వద్ద నుంచి యువకుల ఫోన్‌ నంబర్లు కూడా తీసుకుంటారు. యువతిని చూపిస్తామని యువకులకు ఫోన్‌ చేసి భోపాల్‌కు రప్పించుకుంటారు. అక్కడే ఓ యువతిని పరిచయం చేసి ఆమె నచ్చితే వరుడి వద్ద నుంచి రూ.20 వేలు తీసుకుంటారు’ అని సీఎస్పీ వెల్లడించారు. కాగా ఘటనకు సంబందించి వధువుతోపాటు మరో ఇద్దరు వ్యక్తులున్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Read Also…  చనిపోయినట్లుగా ‘ముంగూస్’ చిలిపి డ్రామాలు.. వైరల్ వీడియో.. చివరికి అదిరిపోయే ట్విస్ట్ .!