‘గ్యాంగ్’ మూవీ తరహా దోపిడీ. ఇన్నోవా కారు.. చేతిలో ఐడీ కార్డు.. లేడీ సహా ఐదుగురు ఫేక్ ఐటీ ఆఫీసర్స్. కట్ చేస్తే..!
జనంపై మూవీ ప్రభావం ఏమోగానీ.. అందులోని చోరీ దృశ్యాల ఎఫెక్ట్ మాత్రం కిలాడీగాళ్ల మీద భాగానే పనిచేస్తోంది. మొన్న కంటైనర్ దోపిడీ.. తాజాగా ఐటీ అధికారులంటూ చోరీ చేసిన
‘Gang’ movie type robbery in Tamilnadu: జనంపై మూవీ ప్రభావం ఏమోగానీ.. అందులోని చోరీ దృశ్యాల ఎఫెక్ట్ మాత్రం కిలాడీగాళ్ల మీద భాగానే పనిచేస్తోంది. మొన్న కంటైనర్ దోపిడీ.. తాజాగా ఐటీ అధికారులంటూ చోరీ చేసిన ఘటనలు అచ్చం సినీ స్టైల్లోనే జరుగుతున్నాయి. దోపిడీ దొంగలు, కేటుగాళ్లు.. సేమ్ అలాంటి సీన్‌లనే అనుకరిస్తున్నారు. అచ్చం సినీ ఫక్కీలో తమిళనాడులోని రాణిపేట జిల్లా ఆర్కాడులో గ్యాంగ్ సినిమా తరహాలో దోపిడీ జరిగింది. ఆర్కాడుకు చెందిన ఫైనాన్స్ వ్యాపారి కణ్ణన్‌కు ఇటీవల వ్యాపారంలో భారీగా లాభాలు వచ్చాయి. దాంతో స్థానికంగా ఆయనకి పలుకుబడి పెరిగింది. పలుచోట్ల భూములు కొనుగోలు చేశారు.
ఈ క్రమంలో కణ్ణన్ ఇంటిపై కేటుగాళ్లు కన్నేశారు. ఐటీ అధికారులమంటూ వచ్చి సోదాలు నిర్వహించారు. ఇంట్లో ఉన్న వారందరీ సెల్‌ఫోన్లు లాగేసుకున్నారు. ఎవ్వరూ బయటకు వెళ్లకూడదని ఆదేశించారు. ఇంట్లో దాచిన నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వెళ్తూ.. వెళ్తూ.. వెల్లూరులోని ఐటీ ఆఫీసుకి విచారణకి రావాలని నోటీసులు జారీ చేశారు.
వెల్లూరు ఐటీశాఖకి వెళ్లిన ఫైనాన్స్ వ్యాపారి కణ్ణన్‌కి అక్కడి అధికారులు దిమ్మతిరిగే షాకిచ్చారు. తాము ఈ మధ్య ఎలాంటి ఐటీ సోదాలు జరపలేదని చెప్పడంతో సదరు వ్యాపారి అవాక్కయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సిసిటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఐటీ అధికారుల ముసుగులో దోపిడీ జరిగినట్లు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు.
ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిన పోలీసులు కేటుగాళ్లను అదుపులోకి తీసుకుని విచారించారు. వెల్లూరుకి చెందిన భరత్, కలైరసన్, చెన్నై ఎగ్మోర్‌లో ఉన్న ఐటీ ఆఫీసులో క్లర్క్‌గా పనిచేసే రామకృష్ణన్ సహాయంతో ఈ దోపిడీ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. గ్యాంగ్ మూవీని అనుకరించి ఐటీ అధికారులమంటూ ఈ చోరీకి పాల్పడ్డట్లు తెలిపారు. ఫైనాన్స్ వ్యాపారి కణ్ణన్ ఇంట్లో 10 లక్షల నగదు, 40 తులాల బంగారం దోపిడీ చేసినట్లు చెప్పారు.
ఈ దోపిడీలో మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో ఓ మహిళ కూడా ఉంది. ఐతే ఈ తరహా కేసులు ఇదే మొదటిసారి చేశారా…? లేక గతంలో కూడా ఎమైనా ఫేక్ ఐటీ రైడ్స్ జరిగాయా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.