Waiter Murder for Chicken: చికెన్ ముక్కలు లేవన్నందుకు వెయిటర్ హత్య.. నలుగురి అరెస్ట్.. నిందితుల్లో ఇద్దరు మైనర్లు
హోటల్‌లో చికెన్ లేదన్నందుకు కక్ష పెంచుకుని వెయిటర్‌ను హతమార్చిన నలుగురిని సరూర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Murder for Refusing Chicken Curry: హోటల్‌లో చికెన్ లేదన్నందుకు కక్ష పెంచుకుని వెయిటర్‌ను హతమార్చిన నలుగురిని సరూర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించి సరూర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ సీతారం వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాలోని మొర్కందివాడి గ్రామానికి చెందిన పాలంపల్లి మహేశ్(20), అతడి సోదరుడు పాలంపల్లి విజయ్(24), ఇద్దరూ కలిసి కొంతకాలంగా కొత్తపేట పండ్ల మార్కెట్‌లో హమాలీ పనులు చేస్తున్నారు. అదే రాష్ర్టానికి చెందిన మరో ఇద్దరు బాల నేరస్తులు కొత్తపేట పండ్ల మార్కెట్‌లోని శ్రీకృష్ణ పండ్ల కంపెనీ వద్ద వారికి పరిచయం అయ్యారు.
ఈ నెల 2న రాత్రి 7.30 గంటలకు నలుగురు కలిసి కొత్తపేటలోని శ్రీదుర్గా భవానీ హోటల్‌కు వెళ్లి.. భోజనంతోపాటు చికెన్ ఆర్డర్ చేశారు. అయితే, హోటల్‌లో సర్వెంట్‌గా పనిచేస్తున్న కర్ణాటక రాష్ట్రం లచ్చిరామ్ తండాకు చెందిన బాలాజీ రాథోడ్ తమ వద్ద చికెన్ లేదని, బోటి ఉన్నదని చెప్పాడు. దీంతో మహేశ్ కిచెన్‌లోకి వెళ్లి చూడగా చికెన్ కనిపించింది. దీంతో నలుగురు యువకులు సర్వెంట్ బాలాజీకి మధ్య గొడవ జరుగుతుండగా హోటల్ యజమాని కల్సె సుధాకర్ జోక్యం చేసుకుని సర్దిచెప్పి పంపించాడు.
ఇదిలావుంటే, అదేరోజు రాత్రి 8గంటలకు పథకం ప్రకారం.. నలుగురు యువకులు కలిసి హోటల్ వద్దకు వచ్చి బాలాజీపై దాడికి పాల్పడ్డారు. అంతలోనే మహేశ్ రాయితో బాలాజీ తలపై మోదగా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నిందితులు అక్కడినుంచి పరారయ్యారు. స్థానికులు గాయపడిన బాలాజీని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈ నెల 16న బీదర్‌లోని ఓ ఆసుపత్రిలో మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.