Private Hospitals: కొనసాగుతున్న ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ.. కరోనాతో చనిపోయిన వ్యక్తికి రూ.18 లక్షల బిల్లు..!

కరోనా రోగుల పాలిట ప్రైవేటు ఆసుపత్రులు జలగల్లా మారాయి. ప్రభుత్వం అధిక ఫీజులు వసూలు చేయడానికి వీల్లేదని హెచ్చరించినప్పటికి ...వాళ్లు పంథా మార్చుకోవడం లేదు.

Private Hospitals: కొనసాగుతున్న ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ.. కరోనాతో చనిపోయిన వ్యక్తికి రూ.18 లక్షల బిల్లు..!
Follow us
Balaraju Goud

| Edited By: Team Veegam

Updated on: May 31, 2021 | 9:56 PM

Private Hospitals Exorbitant for Covid Treatment: కరోనా రోగుల పాలిట ప్రైవేటు ఆసుపత్రులు జలగల్లా మారాయి. ప్రభుత్వం అధిక ఫీజులు వసూలు చేయడానికి వీల్లేదని హెచ్చరించినప్పటికి …వాళ్లు పంథా మార్చుకోవడం లేదు. ముఖ్యంగా ట్రీట్‌మెంట్‌కి పర్మిషన్ ఇచ్చిన ఆసుపత్రులైతే ఇష్టారాజ్యంగా దోచుకోవడంతో తెలుగు రాష్ట్రాల్లో పలు హాస్పిటల్స్‌పై చర్యలు తీసుకున్నారు.

కరోనా రోగుల పట్ల కఠినంగా వ్యవహరించకూడదని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రైవేటు ఆసుపత్రులకు గట్టిగా చెబుతున్నా…వాళ్లు మాత్రం పెడ చెవిన పెడుతున్నారు. రోగి బంధువుల ఫిర్యాదుతో అలాంటి ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసినప్పటికి మార్పు రాకపోవడంతో వాటిని డీ నోటిఫైడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు అధికారులు. తూర్పుగోదావరి జిల్లాలో కోవిడ్ చికిత్సకు అనుమతించిన 16 ప్రైవేట్ ఆసుపత్రులను డీ నోటిఫైడ్ చేస్తూ జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేసారు. జిల్లా ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కోఆర్డినేటర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా వీటిల్లో కోవిడ్ చికిత్సకు అనుమతి రద్దు చేశారు.

నిజామాబాద్ జిల్లాలోనూ నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై వైద్యశాఖ అధికారుల కొరడా ఝళిపించారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులతో చర్యలకు దిగారు. జిల్లాలోని 6 ప్రైవేట్ హాస్పిటల్స్‌కి నోటీసులు జారీ చేశారు. ఇందులో రాజేష్ కోవిడ్ సెంటర్, ఇండస్ హాస్పిటల్, శశాంక్ హాస్పిటల్, వేదాన్ష్ హాస్పిటల్, శ్రీ లైఫ్ గాయత్రి, అన్షుల్ హాస్పిటల్‌లకు నోటీసులు జారీ చేశారు వైద్యశాఖ అధికారులు.

అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేట్ ఆసుపత్రు ఆగడాలు ఏమాత్రం తగ్గడంలేదు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నా.. యథాతథంగా కొనసాగుతోంది ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ. లైసెన్సులు రద్దు చేసినా, నోటీసులు అందించిన ప్రైవేట్ హాస్పిటల్స్ తీరు మారడం లేదు. తాజాగా మోతీనగర్ సన్ రీడ్జ్ ఆస్పత్రి యాజమాన్యం కోవిడ్ చికిత్స కోసం వెళ్లిన ఓ బాధితుడికి అక్షరాల రూ.18 లక్షలు బిల్లు వేసింది.

శ్రీనివాస్ అనే వ్యక్తికి 15 రోజుల క్రితం కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆసుపత్రిలో మెరుగైన చికిత్స కోసం మోతీనగర్‌లోని సన్ రీడ్జ్ ఆస్పత్రిలో చేరారు. శ్రీనివాస్‌ను చేర్చుకున్న ఆసుపత్రి సిబ్బంది అన్ని పరీక్షలు నిర్వహించారు. చికిత్స అందిస్తున్నామని ఆరోగ్యం నిలకడగానే ఉంది, వైద్యానికి సహకరిస్తున్నాడు అంటూ ఆసుపత్రి సిబ్బంది కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఇలా 15 రోజులుగా రోజుకు లక్ష రూపాయల చొప్పున దాదాపు రూ.18 లక్షల వరకు కట్టించుకున్నారు.

ఇదిలావుంటే. ఈ రోజు ఉదయాన్నే ఆరోగ్యం గురించి ఆరా తీయగా చనిపోయడంటూ చావు కబురు చల్లగా చెప్పిన యాజమాన్యం.. మిగతా 15 లక్షలు కడితేనే డెడ్ బాడీ ఇస్తాం అంటూ చెప్పడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. చనిపోయిన వ్యక్తిపై బేరాలు ఆడవద్దని కుటుంబసభ్యులు ఎంత వేడుకున్నా ప్రయోజనం లేకపోయింది. శ్రీనివాస్ మృతదేహన్ని ఇచ్చేందుకు నిరాకరించారు. ఇక చేసేదీలేక కుటుంసభ్యులు ఎస్ఆర్.నగర్ పోలీసులను ఆశ్రయించారు. మోతీనగర్ సన్ రీడ్జ్ ఆస్పత్రి తీరుపై మృతుడి సోదరి లక్ష్మీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సన్ రీడ్జ్ ఆస్పత్రి నిర్లక్ష్యపు వైద్యంతోనే తన సోదరుడు చనిపోయడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో ఇదే ఆస్పత్రిలో మరో ఇద్దరు బంధువులు చనిపోయారంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆస్పత్రిపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలంటూ ఆమె కోరారు.

Read Also… Black Fungus: బ్లాక్ ఫంగస్ సోకిందేమోనన్న భయంతో.. వృద్ధుడు బలవన్మరణం.. పుట్టినరోజు నాడే..