Fake Police: నకిలీ ఖాకీ లీలలు.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు..
ఫేక్‌గాళ్లు రోజుకో అవతారమెత్తుతున్నారు. మోసాలకు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని, నకిలీ ఐడీ కార్డులు క్రియేట్ చేసి అమాయకులను మోసం చేస్తున్నారు.
Tamil Nadu Fake Police Arrested: ఫేక్‌గాళ్లు రోజుకో అవతారమెత్తుతున్నారు. మోసాలకు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని, నకిలీ ఐడీ కార్డులు క్రియేట్ చేసి అమాయకులను మోసం చేస్తున్నారు. తాజాగా మరో ఫేక్ పోలీస్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఏకంగా పోలీసు కమీషనర్ అవతారమెత్తిన దండిగా డబ్బులు లాడం మొదలు పెట్టాడు. మార్గం ఏదైనా మోసం చేయడమే వారి టార్గెట్. రద్దీ తక్కువగా ఉండే రోడ్లను చూస్తారు. అదును చూసి వారి ఫేక్ ప్రతిభ చూపిస్తారు. అందినకాడికి దోచేస్తారు. ఇది ఆ ఫేక్ పోలీసుల స్టైల్. పోలీసుల తనిఖీలో అయ్యగారి భాగోతం బయటపడింది.
ఆయనో నకిలీ పోలీస్ కమిషనర్. ఐడీ కార్డు, సైరన్‌తో కూడిన పోలీస్ వాహనం, యూనిఫాం అన్నీ నకిలీవే. అసలు పోలీసులతో సమానంగా చలామణి అవడమే కాకుండా అడ్డగోలుగా సంపాదించాడు. చివరకు వాహనాల తనిఖీలో పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసుల కథనం.. చెన్నైకి చెందిన విజయన్ (42)కు లారీ వ్యాపారంలో నష్టాలు రావడంతో ఇంటిపట్టునే ఉండిపోయాడు. దీంతో అతని భార్య ఏ పనిచేయకుండా ఉంటే ఎలా అని నిలదీస్తూ ఉండడంతో గెటప్ మార్చాడు. గ్రూప్–1 పాసై, డీఎస్పీ అయ్యానని, ఇటీవలే పోలీస్ కమిషనర్‌గా ప్రమోషన్ కూడా పొందినట్లు నమ్మబలికాడు.
ఆ తర్వాత స్నేహితురాలి సహకారంతో జీప్ కొనుగోలు చేసి సైరన్‌తో కూడిన పోలీస్ వాహనంగా మార్చాడు. కేసుల విచారణకు వెళ్తున్నట్లు భార్యకు చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాడు. పోలీస్ అధికారి అవతారమెత్తాక పలువురి వద్ద డబ్బులు గుంజాడు. చివరకు పోలీస్ కమిషనర్ గెటప్‌లో వెళ్తుండగా తమిళనాడు రాష్ట్రంలోని దిండుగల్లు జిల్లా లక్ష్మీపురం టోల్‌గేట్ వద్ద అతని బండారం బట్టబయలైంది. వాహనాల తనిఖీలో ఇతను పోలీసులకు పట్టుబడ్డాడు. అతని నుంచి వాహనం, నకిలీ ఐడీ కార్డు, యూనిఫాం, తుపాకీ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ప్రాథమిక దర్యాప్తులో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమిళనాడుతోపాటు ఆంధ్రప్రదేశ్, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని రాజకీయ ప్రముఖులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో దిగిన ఫొటోలు బయటపడ్డాయి.ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సన్నిహితంగా ఉన్న ఫొటో సైతం బయటపడింది. అయితే, తాను ఒక ప్రైవేట్ న్యూస్ చానల్‌లో విలేకరిగా పనిచేసేటపుడు వారితో ఫొటోలకు దిగినట్లు నిందితుడు విచారణలో పేర్కొన్నాడు. మరోవైపు, ఈ కేసు విచారణ సమయంలో పలువురు ప్రముఖుల ఫోన్ ద్వారా ఒత్తిళ్లకు గురిచేసినట్లు పోలీసులు చెప్పడం గమనార్హం. ప్రముఖుల పేర్లను, ఫొటోలను విజయన్ వాడుకున్నాడా? ఇతడిని అడ్డుపెట్టుకుని ప్రముఖులు సొమ్ము చేసుకున్నారా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.