గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ఐటీఐ విద్యార్థి సూసైడ్!
ఇంట్లో ఒంటరిగా ఉన్న 17 ఏళ్ల బాలుడు దారుణానికి పాల్పడ్డాడు. గర్ల్ ఫ్రెండ్‌కు వీడియో కాల్ చేసి.. లైవ్‌లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాసేపటి తర్వాత ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు అక్కడి దృశ్యం చూసి ఒక్కసారిగా షాకయ్యారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో..

మేడిపల్లి, ఫిబ్రవరి 9: తల్లిదండ్రులు పని మీద బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలుడు దారుణానికి పాల్పడ్డాడు. గర్ల్ ఫ్రెండ్‌కు వీడియో కాల్ చేసి.. లైవ్‌లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాసేపటి తర్వాత ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు అక్కడి దృశ్యం చూసి ఒక్కసారిగా షాకయ్యారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకెళ్తే..
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బోడుప్పల్‌లోని అయ్యప్ప దేవాలయం సమీపంలో ఓ ప్రయివేట్ ఉద్యోగి కుటుంబంతోపాటు కాపురం ఉన్నాడు. అతని కుమారుడు గంగాధరి అభినవ్ (17) స్థానికంగా ఉన్న ఓ కాలేజీలో ఐటీఐ చదువుతున్నాడు. ప్రస్తుతం అభినవ్ మేడిపల్లిలోని మహేంద్ర కార్ షోరూంలో ప్రాక్టికల్ ట్రైనింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అభినవ్ తల్లిదండ్రులు ఫిబ్రవరి 5న రాత్రి షాపింగ్ కోసమని బయటకు వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న అభినవ్ తోటి క్లాస్‌మేట్ అయిన ప్రియురాలికి వీడియో కాల్ చేశాడు. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆమెకు తెలిపాడు. అనంతరం వీడియో కాల్ మాట్లాడుతూనే చున్నీతో అభినవ్ ఉరి వేసుకోవడం ఆమె గమనించి.. వెంటనే అభినవ్ స్నేహితులకు సమాచారం అందించింది.
స్నేహితులు వెంటనే బాలుడి ఇంటికి చేరుకుని తలుపులు పగలగొట్టి లోనికి ప్రవేశించారు. అప్పటికే అభినవ్ ఉరి వేసుకుని కొన ఊపిరితో ఉన్నాడు. అతన్ని సమీపంలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అభినవ్ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు మేడిపల్లి పోలీసులు ఆదివారం రాత్రి కేసు వివరాలు మీడియాకు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




