Liquor Bottles: అక్కడి శ్మశానంలో కుప్పలు తెప్పలుగా మద్యం బాటిల్స్.. ఎక్కడి నుంచి వచ్చాయంటే..?
Liquor Bottles: బిహార్‌లో సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తాం. మద్యం అనే మాటే వినపడకుండా చేస్తామని సీఎం నితీశ్‌కుమార్ చెప్పారు. కానీ పరిస్థితులు
Liquor Bottles: బిహార్‌లో సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తాం. మద్యం అనే మాటే వినపడకుండా చేస్తామని సీఎం నితీశ్‌కుమార్ చెప్పారు. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. బీహార్‌లోని చాలా ప్రాంతాల్లో మద్యం ఏరులై పారుతోంది. పోలీసుల కళ్లుగప్పి ఏకంగా శ్మశానంలోనే మద్యం బాటిల్స్ దాచారు అక్రమార్కులు. మద్యంపై పూర్తి నిషేధం ఉన్న వేళ దర్భంగా సమీపంలోని ఓ శ్మశానవాటికలో కుప్పలుతెప్పలుగా మద్యం సీసాలు బయటపడటం కలకలం సృష్టిస్తోంది. వీటిని లిక్కర్మాఫియానే ఇక్కడ దాచిందని అనుమానిస్తు్న్నారు స్థానిక ప్రజలు. దీంతో మద్యం సరఫరాలకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు.
గంగాసాగర్ చెరువుకు సమీపంలో ఉన్న శ్మశానవాటికలో గత కొంతకాలంగా అక్రమ మద్యం కార్యకలాపాలు సాగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. దీంతో విసుగెత్తిపోయిన అక్కడి ప్రజలు లిక్కర్ మాఫియాకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. అయితే కొంతమంది వ్యక్తులు స్థానికులపై రాళ్లు రువ్వి అక్కడి నుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లారు. శ్మశానవాటికలో కుప్పలు తెప్పలుగా ఉన్న మద్యం బాటిళ్లను చూశారు. నేపాలీ బ్రాండ్ మద్యం సీసాలుగా గుర్తించారు. భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. లిక్కర్ మాఫియాకు కచ్చితంగా చెక్‌పెడతామని చెప్పారు. ఈ సంఘటన వల్ల బీహార్‌లో మద్యం సరఫరాపై విమర్శలు గుప్పిస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. అధికార పార్టీ అండతోనే మద్యం మాఫియా పెట్రేగిపోతోందని ఆరోపిస్తున్నాయి. గతంలో బీహార్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో అసెంబ్లీ ప్రాంగణంలో మద్యం సీసాలు లభించిన సంగతి తెలిసిందే. అప్పట్లో అది సంచలనంగా మారింది.