రోడ్డు ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్‌కు తీవ్ర గాయాలు.. చికిత్స నిమిత్తం అపోలోకి తరలింపు..

హైదరాబాద్‌లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ వద్ద స్పోర్ట్స్ బైకుపై నుంచి కిందపడ్డ సాయి ధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు.

రోడ్డు ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్‌కు తీవ్ర గాయాలు.. చికిత్స నిమిత్తం అపోలోకి తరలింపు..
Sai Dharam Tej
Follow us
Balaraju Goud

| Edited By: Ravi Kiran

Updated on: Sep 10, 2021 | 11:17 PM

మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గుర‌య్యాడు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి వద్ద స్పోర్ట్స్ బైక్‌పై నుంచి అదుపుత‌ప్పి సాయి ధ‌ర‌మ్ తేజ్ కింద‌ప‌డిపోయాడు. ఈ ప్రమాదంలో సాయిధ‌ర‌మ్ తేజ్‌కు తీవ్ర గాయాల‌య్యాయి. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన సాయిధరమ్ తేజ్‌ను పోలీసులు మాదాపూర్‌లోని మెడికవర్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కేబుల్ బ్రిడ్జ్ నుండి ఐకియా వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.  ఓవర్ స్పీడ్ వల్ల ప్రమాదం జరిగిందని మాదాపూర్ సీఐ రవీంద్ర ప్రసాద్ వెల్లడించారు.

బైక్‌ను నియంత్రించలేక అదుపుతప్పి కిందపడిపోయినట్లు మాదాపూర్‌ సీఐ తెలిపారు. అంతర్గతంగా ఏమైనా గాయాలు అయ్యాయా?అన్న అనుమానంతో సాయిధరమ్‌ తేజ్‌కు వైద్యులు స్కాన్‌ చేస్తున్నారని, ప్రమాద వార్తను కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లు సీఐ వివరించారు.

మరోవైపు సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. ప్రస్తుతం కోలుకుంటున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఫ్యాన్స్ భయపడాల్సిన అవసరం లేదని నిర్మాత శ్రీనివాస కుమార్ ట్వీట్ చేశారు. కాగా, చికిత్స అనంతరం సాయి ధరమ్ తేజ్ స్పృహలోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని ఆస్పత్రి వర్గాలు తెలియజేసినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే ప్రమాద సమయంలో సాయి ధరమ్ తేజ్ హెల్మెట్ వేసుకుని ఉండటంతో పెను ముప్పు తప్పినట్లు డాక్టర్లు భావిస్తున్నారు. మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం సాయి ధరమ్ తేజ్ ను అపోలో ఆసుపత్రికి తరలిస్తున్నారు. కాగా, చిరంజీవి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, త్రివిక్రమ్, అల్లు అరవింద్, సందీప్ కిషన్ ఆసుపత్రికి చేరుకొని సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అటు ఓవర్ స్పీడ్ కారణంగా సాయి ధరమ్ తేజ్ నడిపిన బైక్‌కు గతంలోనూ ఓ చలాన్ పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.