కూరగాయల వ్యాపారికి కరోనా పాజిటివ్.. మార్కెట్ మూసివేత
తెలంగాణలో కోవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. లాక్‌డౌన్ ఆంక్షలను సడలించడంతో రాష్ట్రవ్యాప్తంగా గతంలో కంటే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా యాదాద్రి-భువనగిరి జిల్లాలోని..
తెలంగాణలో కోవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. లాక్‌డౌన్ ఆంక్షలను సడలించడంతో రాష్ట్రవ్యాప్తంగా గతంలో కంటే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. లాక్‌డౌన్ అమల్లో ఉన్న సమయంలో రాష్ట్రంలో రోజుకు 50 లోపు కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం రోజుకు 200కు పైగా కేసులు నమోదవుతున్నాయి. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడంతో జనం బయటకు వస్తుండటమే కేసుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఇన్నాళ్లపాటు ఇంట్లోనే ఉండటంతో పనులు, బంధువులను పరామర్శించడం, పెళ్లిళ్లు.. ఇలా రకరకాల కారణాలతో జనం ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. ఈ క్రమంలోనే కరోనా బారిన పడుతున్నారు.
గత కొద్ది రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువగా వైరస్ పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. రెండు వారాల క్రితం వరకు ఒక్క కేసు కూడాలేని యాదాద్రి భువనగిరి జిల్లాలో మళ్లీ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా యాదాద్రి-భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మున్సిపాలిటి కేంద్రంలో ఓ కూరగాయల వ్యాపారికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మున్సిపాలిటీ ఛైర్మన్ రెడ్డి రాజు.. మార్కెట్ యజమానులకు థర్మల్ టెస్ట్ చేసి.. మార్కెట్ మూసివేయించారు. అతనితో కాంటాక్ట్ అయిన వ్యక్తులను గుర్తించి, పరీక్షలు నిర్వహించే పనిలో పడ్డారు అధికారులు. కూరగాయల వ్యాపారికి కరోనా రావడంతో స్థానికంగా అలజడి రేగింది.