వైర‌స్ విస్త‌రిస్తోంది..మ‌రింత అప్రమత్తంగా ఉండాలి : కేసీఆర్

వైర‌స్ విస్త‌రిస్తోంది..మ‌రింత అప్రమత్తంగా ఉండాలి : కేసీఆర్

దేశంలోనూ, రాష్ట్రంలోనూ కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతున్నందున ప్రజలు మరింత జాగ్రత్తగా, అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు.,...

Jyothi Gadda

|

Apr 13, 2020 | 11:52 AM

దేశంలోనూ, రాష్ట్రంలోనూ కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతున్నందున ప్రజలు మరింత జాగ్రత్తగా, అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా, తెలంగాణలో పరిణామాలు గమనిస్తుంటే కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదని స్పష్టం అవుతున్నద‌న్నారు.

ఆదివారం కూడా  రాష్ట్రంలో  పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు.  రాష్ట్రంలో  కొత్తగా 28  పాజిటివ్ కేసులు వచ్చాయనీ, ఇద్దరు మరణించారని చెప్పారు. పక్కనే ఉన్న మహారాష్ట్రంలో పరిస్థితి భయంకరంగా ఉందనీ,  దేశ వ్యాప్తంగా కూడా పాజిటివ్ కేసులు , మరణాలు పెరిగాయన్నారు. కరోనా విజృంభన నేపథ్యంలోనే లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయం తీసుకున్నామని చెప్పిన ఆయన, పరిస్థితి తీవ్రతను ప్రజలు అర్థం చేసుకుని వీలైనంత వరకు ఇళ్లకే పరిమితం కావాలని కోరారు. బయటకు వెళ్లాల్సి వస్తే తప్పక సామాజిక దూరం పాటించాలన్నారు.

కరోనా వైరస్ సోకిన వ్యక్తులున్న ప్రాంతాలను గుర్తించి, ప్రభుత్వం అక్కడ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు సీఎం కేసీఆర్‌. ప్రజలు  సహకరించాలనీ, కరోనా వ్యాప్తి నివారణ అన్నది కేవలం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల మాత్రమే సాధ్యం కాదనీ, ఆ నిర్ణయాలను ప్రజలు తు.చ. తప్పకుండా పాటించడం వల్ల మాత్రమే సాధ్యమవుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతున్నదనే వాస్తవం గ్రహించి, ప్రజలు ఇంతకుముందు కంటే కూడా మరింత జాగ్రత్తగా ఉండాల‌ని కోరారు. అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలన్న ముఖ్యమంత్రి,  ఎవరికి లక్షణాలు కన్పించినా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.

వైర‌స్ పాజిటివ్ వచ్చిన వారు ఎవరెవరిని కలిశారు? ఎక్కడ తిరిగారు? అనే వివరాలు సేకరించి, వారికీ పరీక్షలు నిర్వహించాలన్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద తనిఖీలు ఎక్కువ చేయాలని ఆదేశించారు.  మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారిని గుర్తించి, పరీక్షలు చేసే పని ముమ్మరంగా జరుగుతున్నదని చెప్పిన ఆయన ఇంకా ఎవరైనా తెలిసో తెలియకో పరీక్షలు చేయించుకోకుంటే వారే స్వయంగా వచ్చి పరీక్షలు చేయించుకోవాలని కోరారు.  కరోనా వ్యాప్తి నివారణకు చేపడుతున్న చర్యలు, వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, లాక్ డౌన్ అమలవుతున్న తీరు, పేదలకు అందుతున్నసాయం, పంటల కొనుగోళ్లు జరుగుతున్న విధానాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu