కరోనా కట్టడికి భారీగా ఇంటింటి సర్వే
జూన్ 1 నుంచి ప్రారంభమైన అన్‌లాక్-1.0లో మహమ్మారి విజృంభణ మరింత ఎక్కువయినట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలో దేశంలో కొన్ని రాష్ట్రాల్లో తిరిగి లాక్‌డౌన్ విధిస్తుండగా..మరికొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల నిర్ధారణ కోసం ఇంటింటి సర్వేలు చేపట్టనున్నట్లు ప్రకటించాయి.
భారత్‌లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం క్రమంగా సడలిస్తూ ఆర్ధిక కార్యకలాపాల పునఃప్రారంభానికి అవకాశం కల్పించింది. అయితే, లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా జూన్ 1 నుంచి ప్రారంభమైన అన్‌లాక్-1.0లో మహమ్మారి విజృంభణ మరింత ఎక్కువయినట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలో దేశంలో కొన్ని రాష్ట్రాల్లో తిరిగి లాక్‌డౌన్ విధిస్తుండగా..మరికొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల నిర్ధారణ కోసం ఇంటింటి సర్వేలు చేపట్టనున్నట్లు ప్రకటించాయి.
వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న క్రమంలో ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలు కీలక నిర్ణయం ప్రకటించాయి. కోవిడ్ కేసుల నిర్ధారణ కోసం ఇంటింటి సర్వే చేపట్టనున్నట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ఒడిశాలో 45 రోజుల పాటు డోర్ టూ డోర్ సర్వే చేపట్టనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. జూన్ 16వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు ప్రతి ఇంటికి.. ఆశా, ఏఎన్ఎం వర్కర్లు వెళ్లి సమాచారం సేకరించనున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ సర్వే చేపడతారు. కోవిడ్-19 లక్షణాలు ఉన్న వారి డేటాను సేకరించనున్నట్లు ఒడిశా నేషనల్ హెల్త్ మిషన్ డైరక్టర్ శాలినీ పండిట్ వెల్లడించారు.
జార్ఖండ్ రాష్ట్రంలో ఇటీవల ఒక్కసారిగా కరోనా కేసుల సంఖ్య పెరిగింది. పలు రాష్ట్రాల నుంచి వలస కార్మికులు తిరిగి వచ్చిన నేపథ్యంలో వైరస్ తీవ్రత పెరిగినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో కరోనా సోకిన వారిని గుర్తించేందుకు ఈ నెల 18 నుంచి భారీగా ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వారం రోజుల పాటు ఈ సర్వే చేపట్టనున్నట్లు వెల్లడించారు.