New Covid Variant: HIV రోగి నుంచి కొత్త వేరియంట్.. ప్రమాదకరంగా వైరల్ లోడ్.. పూర్తి వివరాలు
న్యూ...వేరియంట్.. ప్రపంచాన్నే వణికిస్తోంది. మరో కోవిడ్ ముప్పు తప్పదనే నిపుణుల హెచ్చరికతో పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయి. డెల్టా కంటే వేగంగా కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతుందనే వార్తలు కలవరపెడుతున్నాయి. అటు WHO అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది.
సౌతాఫ్రికాలో బయటపడ్డ కొత్త వేరియంట్ B.1.1.529 టెన్షన్ పుట్టిస్తోంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న HIV రోగి నుంచి ఈ వేరియంట్ ఉత్పన్నమైనట్లు లండన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వేరియంట్‌తో మరో కోవిడ్ ముప్పు తప్పదని ప్రపంచదేశాలు టెన్షన్ పడుతున్నాయి. ఇందులో అధిక మ్యుటేషన్ల కారణంగా డెల్టాకంటే వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందనే వార్తలతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను కలవరపెడుతోంది. న్యూ వేరియంట్‌లో మొత్తం 50 మ్యుటేషన్లు ఉండగా…ఒక్క స్పైక్ ప్రొటీన్‌లోనే 30కి పైగా ఉత్పరివర్తనాలు ఉన్నట్లు నిపుణులు తెలిపారు.
సౌతాఫ్రికాలో కొత్త వేరియంట్‌కు సంబంధించి వందకి పైగా కేసులు బయటపడ్డాయి. కొత్తగా కోవిడ్ బారినపడినవారిలో ఇదే వేరియంట్ రకాన్ని గుర్తించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈ వేరియంట్ ఇన్ఫెక్షన్లు, పాజిటివిటీ రేటు కూడా పెరుగుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ వైరస్ ఇతర దేశాలకు కూడా వ్యాప్తి చెందడట ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే బోట్స్‌వానాలో నాలుగు కేసులు గుర్తించారు. అటు హాంకాంగ్‌లో రెండు కేసులు బయటపడ్డాయి. వైరస్ సోకినవారంతా ఇప్పటికే రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారని అధికారులు చెప్పారు.
కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ వేరియంట్ సోకిన వారిలో వైరల్ లోడ్ చాలా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. సౌతాఫ్రికాలో పాజిటివిటీ రేటు ఒక్క వారంలోనే 1 శాతం నుంచి 30 శాతానికి పెరిగిందని వెల్లడించారు. ఈ వేరియంట్ అధికంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ప్రపంచ దేశాలు అలెర్ట్ అయ్యాయి. విదేశీయుల రాకపై ఆంక్షలు విధించాయి. ఇప్పటికే యూకే, ఇజ్రాయెల్ వంటి దేశాలు…దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా సహా మరో నాలుగు ఆఫ్రికా దేశాల నుంచి విమానాల రాకపోకలను నిలిపివేశాయి. ఆస్ట్రేలియా కూడా ప్రయాణికులపై మళ్లీ కఠిన క్వారంటైన్ నిబంధనలు అమలు చేసే పనిలో పడింది. ఇటు భారత్ కూడా వేరియంట్‌పై రాష్ట్రాలను హెచ్చరించింది.
కొత్త వేరియంట్‌పై WHO అత్యవసర సమావేశం నిర్వహించింది. టీకా వేయించుకున్నప్పటికీ..మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ సూచించారు. టీకా వేయించుకన్న వారికి పూర్తి రక్షణ ఉంటుందనే తప్పుడు భావన ప్రజల్లో నెలకొని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
Also Read: Viral Video: ఈ వీడియో మీ మనసులను తాకుతుంది.. చిట్టి తల్లి మనసు ఎంత పెద్దదో