సంచలన నిర్ణయం.. జనవరి 1 నుంచి వ్యాక్సిన్ వేసుకోని వ్యక్తులు అక్కడ తిరగడం నిషేధం..
Haryana Govt: హర్యానా రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ వేయించుకోని వ్యక్తులు బహిరంగ ప్రదేశాలలో తిరగడాన్ని నిషేధించింది.
Haryana Govt: హర్యానా రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ వేయించుకోని వ్యక్తులు బహిరంగ ప్రదేశాలలో తిరగడాన్ని నిషేధించింది. భారతదేశంలో పెరుగుతున్న ఓమిక్రాన్ కేసుల మధ్య హర్యానా ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేసింది. రెండు డోసుల టీకాలు వేసుకున్న వ్యక్తులు మాత్రమే రాష్ట్రంలోని బహిరంగ ప్రదేశాలైన మాల్స్, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రాంతాలను సందర్శించడానికి అనుమతి ఉంటుంది. ఈ కొత్త నిబంధన జనవరి 1, 2022 నుంచి అమలులోకి వస్తుంది.
రాష్ట్ర అసెంబ్లీలో ఒక ప్రశ్నకు సమాధానంగా హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ ఇలా ప్రకటించారు. “పూర్తిగా టీకాలు వేసుకోని వ్యక్తులకు జనవరి 1 నుంచి కళ్యాణ మండపం, హోటల్, బ్యాంక్, ఏదైనా మాల్, బస్సు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి బహిరంగ ప్రదేశాలకు అనుమతి ఉండదు. ఈ కొత్త నిర్ణయం COVID-19కి వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటాన్ని బలోపేతం చేస్తుంది” అన్నారు. హర్యానాలో COVID-19 టీకా డ్రైవ్ ప్రస్తుతం పూర్తి స్థాయిలో కొనసాగుతోంది. గురుగ్రామ్ పరిపాలన COVID-19 టీకా రెండు డోస్‌లలో 100 శాతం కవరేజీని సాధించింది. హర్యానాలో మొదటి పూర్తి వ్యాక్సినేటెడ్ జిల్లాగా అవతరించింది.
Omicron వేరియంట్ భారతదేశంలోని 12 రాష్ట్రాల్లో కనుగొన్నారు. మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం భారతదేశంలో మొత్తం ఓమిక్రాన్ కేసుల సంఖ్య 200 దాటింది. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ COVID-19 డెల్టా వేరియంట్ కంటే Omicron వేరియంట్ చాలా వేగంగా వ్యాపిస్తుందని ప్రకటించింది. దాని కేసులు ప్రపంచవ్యాప్తంగా 1.5 నుంచి 3 రోజుల వ్యవధిలో రెట్టింపు అవుతున్నాయని తెలిపింది. కొత్త COVID-19 వేరియంట్ ఇప్పుడు 89 దేశాలలో విస్తరిస్తోందని WHO తెలిపింది.