Covid-19 Among Children: పిల్లలు జాగ్రత్త..! థర్డ్‌ వేవ్‌పై అప్పుడే మొదలైన దడ.. మూడో దశ ముప్పు నేపథ్యంలో చిల్డ్రన్‌ కేరింగ్‌పై ఆందోళన..!

థర్డ్‌ వేవ్‌లో చిన్నారులకు ముప్పు. లక్షలాదిమంది కిడ్స్‌పై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం..అప్రమత్తంగా ఉండాలంటూ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Covid-19 Among Children: పిల్లలు జాగ్రత్త..! థర్డ్‌ వేవ్‌పై అప్పుడే మొదలైన దడ.. మూడో దశ ముప్పు నేపథ్యంలో చిల్డ్రన్‌ కేరింగ్‌పై ఆందోళన..!
Covid vaccine
Follow us

|

Updated on: Jun 08, 2021 | 1:44 PM

థర్డ్‌ వేవ్‌లో చిన్నారులకు ముప్పు. లక్షలాదిమంది కిడ్స్‌పై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం..అప్రమత్తంగా ఉండాలంటూ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొదటి దశలో వైరస్​ వృద్ధులను టార్గెట్​ చేయగా, రెండవ దశలో ఎక్కువగా యువత కరోనా బారినపడ్డారు. ఇక మూడో దశలో 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలపై వైరస్​ ప్రభావం ఉండనుందని నిపుణులు అంచానా వేస్తున్నారు. రాబోయే థర్డ్​ వేవ్​ పిల్లలపైనే ఎందుకు దాడి చేయనుంది? పిల్లలు నిజంగానే కరోనా సంక్రమణ ప్రమాదంలో ఉన్నారా? దీనిలో వాస్తవమెంత? ఇటువంటి ప్రశ్నలకు నిపుణులు భిన్నమైన సమాధానాలు చెబుతున్నారు.

వృద్ధాప్యం రోగనిరోధక శక్తితో సంబంధం కలిగి ఉంటుంది. వయసు పెరిగేకొద్ది రోగనిరోధక శక్తి క్రమంగా క్షీణిస్తుంది. తద్వారా, వైరస్ సులభంగా​ శరీరంలోకి ప్రవేశిస్తుంది. అదే పిల్లల విషయానికి వస్తే.. వారిలో బలమైన రోగనిరోధక శక్తి ఉంటుంది. ఫలితంగా వారికి వైరస్ సోకే ప్రమాదం తక్కువగా ఉంటుందని కొందరు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

అయినప్పటికీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇటు ఏపీ సర్కార్‌.. నిపుణులతో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ వేసింది. ఈ కమిటీ 16 పేజీలతో ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందించింది. మూడోదశలో 18 లక్షల కేసులు వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటోంది టాస్క్‌ఫోర్స్‌ కమిటీ. 25శాతం మంది ఎఫెక్టైనా రెడీగా ఉన్నట్లు వెల్లడించారు. వారిలో 90శాతం పైగా మైల్డ్‌, హోమ్‌ ఐసోలేషన్‌ కేసులు మాత్రమే ఉంటాయని అభిప్రాయపడింది.

ఏపీలో మూడో దశ కరోనాపై అంచనాలు. సుమారు 36వేల మంది చిన్నారులు ఆస్పత్రుల్లో చేరే అవకాశముంది . కేవలం 8శాతం అంటే 36వేల మందికే బెడస్‌ అవసరముంటుందని పేర్కొంది నిపుణుల కమిటీ. కేవలం 2శాతం మందికి అంటే 2వేల మందికి మాత్రమే ఐసీయూ అవసరం అవుతుందని అంచనా వేసింది. రాష్ట్రంలో అత్యంత క్లిష్ట పరిస్థితులేర్పడితే చిన్నారులకు 2750 బెడ్స్‌, వెయ్యి ఐసీయూ బెడ్స్‌ అవసరం ఉంటుందని అంచనా వేసింది.

రెండేళ్లలోపు పిల్లలకు మాస్కులు వాడకూడదని పేర్కొంది టాస్క్‌ఫోర్స్‌. ఇక, కరోనా ఫస్ట్‌, సెకండ్‌వేవ్‌లో పిల్లలకు కరోనా సోకలేదనడం సరికాదని పేర్కొంది. 18ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వడంతో వారు కరోనా బారిన పడే ప్రమాదం తక్కువని..అందుకే చిన్నారుల్లో కేసులు కొంత పెరిగే అవకాశముందన్నారు. ఇక, పుట్టుకతో ఆరోగ్య సమస్యలు ఉన్న పిల్లల విషయంలో కొంత సవాలేనని ప్రకటించింది టాస్క్‌ఫోర్స్‌. చిన్నారుల విషయంలో మరింత అప్రమత్తత అవసరమన్నారు. వ్యాక్సిన్‌ అందించకపోవడం, స్కూల్స్‌ ఓపెన్‌ చేయడం వల్ల పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగే అవకాశముందని నిపుణులు కమిటీ సూచిస్తోంది. ఒబెసిటీ, ఆస్తమా, దీర్ఘకాలిక కిడ్నీ, ఊపిరితిత్తులు లాంటి 14 అంశాల్లో ఉన్న పిల్లలు హై రిసక్‌ పరిధిలో ఉన్నట్లు పేర్కొంది. 37రకాల మెడిసిన్స్‌ థర్డ్‌వేవ్‌ను ఎదుర్కోవడానికి అవసరమవుతాయని పేర్కొన్నారు నిపుణులు. థర్డ్‌వేవ్‌ సమయాన్ని ఇప్పుడే అంచనా వేయడం సాధ్యం కాదన్నారు.

ఇదిలావుంటే, చిన్నారులు వైరస్ బారినపడడం కన్నవాళ్లను కంగారెత్తిస్తోంది. గతేడాది పిల్లలకి కరోనా సోకినప్పటికీ వారిలో లక్షణాలు లేకపోవడంతో అందుకు సంబంధించిన వార్తలు పెద్దగా బయటకి రాలేదు. కరోనా వారికి ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు పోయిందో తెలిసే అవకాశం లేకుండాపోయింది. గతేడాది చిన్నపిల్లల్లో 1 శాతం మందికి కరోనా సోకితే.. ఈసారి 1.2 శాతం మందికి సోకింది. శాతాల్లో చూస్తే తక్కువగానే కనిపించినా సంఖ్యా పరంగా ఇది చాలా ఎక్కువంటున్నారు వైద్య నిపుణులు.

కరోనా సెకండ్‌ వేవ్‌లో పిల్లలకి కరోనా సోకడానికి డబుల్‌ మ్యూటెంట్‌ కారణమని తెలుస్తోంది. ఈ వైరస్‌కి త్వరగా వ్యాప్తి చెందే లక్షణంతో పాటు రోగనిరోధక వ్యవస్థను నిర్వీర్యం చేసే సామర్థ్యం ఉంది. దీంతో పిల్లలకు ఈ వైరస్‌ చాలా ఈజీగా సోకుతోంది. కరోనా తగ్గిన తర్వాత రెండు నుంచి నాలుగు వారాల్లో వచ్చే మల్టీ సిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్ వ్యాధితో పిల్లలు వస్తున్నట్టు పీడియాట్రిషన్ డాక్టర్లు చెబుతున్నారు. అలాగే కోవిడ్ సోకిన పిల్లలో 40-50 శాతం మంది గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నట్టు గుర్తిస్తున్నారు.

పిల్లల్లో ఇప్పటివరకు పెద్ద కంపెనీలేవీ వ్యాక్సిన్‌ ప్రయోగాలు ఇంకా జరపలేదు. కొద్దిరోజుల క్రితం అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజం ఫైజర్‌ తమ వ్యాక్సిన్‌ 12 నుంచి 15 ఏళ్ల వయసు వారిపై బాగా పని చేస్తుందని వెల్లడించింది. హైదరాబాద్‌కి చెందిన భారత్‌ బయోటెక్‌ 5 నుంచి 18 ఏళ్ల మధ్య వారిపై ప్రయోగాలు జరపడానికి అనుమతి కోరినప్పటికీ తగినంత డేటా సమర్పించకపోవడంతో కేంద్రం అనుమతి నిరాకరించింది.

మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌లో చిన్నారులపై కరోనా పంజాతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. నీలోఫర్‌ ఆస్పత్రిని నోడల్ కేంద్రంగా మార్చింది. జంట నగరాల పరిధిలో 2వేల బెడ్ల కోసం ఏర్పాట్లు చేసింది. లక్షణాలు లేకుండానే వైరస్ వ్యాపిస్తుండటం కంగారెత్తిస్తోంది. ప్రతీ ఒక్కరూ కచ్చితంగా మాస్క్‌లు, శానిటైజర్లను వినియోగించాలన్నారు వైద్య ఆరోగ్య శాఖాధికారులు.

పిల్లల్లో కరోనా లక్షణాలుః

జ్వరం, దగ్గు, అలసట, ఊపిరిలో ఇబ్బంది, ముక్కుదిబ్బడ, గొంతులో మంట, కండరాల నొప్పులు, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, కడుపులో నొప్పి

తీసుకోవల్సిన జాగ్రత్తలుః

జ్వరం: పారాసిటమాల్‌ 10-15 ఎంజీ/కేజీ/డోసు (ప్రతి 4-6 గంటలకు ఒకసారి ఇవ్వొచ్చు) గొంతులో మంట, దగ్గు: గోరువెచ్చని నీటిని పుకిలించడం ఆహారంగా ఏమిస్తే మంచిది: నీరు, పండ్ల రసాలతో పాటు పోషకాలతో కూడిన ఆహారం ఇవ్వడం మంచిది.

తేలికపాటి/లక్షణాలు లేని వారికి చికిత్స ఎలా అంటే?

కరోనా సోకిన పిల్లల లక్షణాలను బట్టి తేలికపాటి, మధ్యస్థాయి, తీవ్రమైన అని మూడు విభాగాలుగా విభజించారు. జ్వరం, జలుబు వంటి స్వల్ప లక్షణాలు ఉండి ఇతర ఆరోగ్య సమస్యలేమీ లేని పిల్లలకు లేదా లక్షణాలు లేని పిల్లలకు ఇంట్లోనే చికిత్స అందించొచ్చు. ఆయాసం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, తరుచుగా విరేచనాలు, వాంతులు, కడుపునొప్పితో పాటు ఊపిరితిత్తులు, గుండెకు సంబంధించిన సమస్యలున్న చిన్నారుల్లో వైరస్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి తరలించాలి.

ఆసుపత్రికి ఎప్పుడు వెళ్లాలిః

కొందరు పిల్లల్లో కరోనా.. మల్టీసిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ సమస్యకు దారి తీస్తోంది. కాబట్టి పిల్లలు ఆందోళనతో గందరగోళంగా ప్రవర్తించినా వైద్యులను సంప్రదించడం మంచిది. మామూలు జలుబు, జ్వరం ఉంటే పిల్లలు ఒకట్రెండు రోజుల్లో కోలుకుంటారు. రోజుల తరబడి అవే లక్షణాలుంటే మాత్రం ఆసుపత్రికి తీసుకెళ్లాలని నిపుణులు చెబుతున్నారు.

Read Also….  AP Jagananna Thodu Scheme: ఏపీలో చిరు వ్యాపారుల ఖాతాల్లో రూ.10 వేలు.. జగనన్న తోడు లబ్ధిదారులకు నగదు జమ చేసిన సీఎం జగన్‌