TS Cabinet Meeting Highlights: లాక్‌డౌన్‌పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పది రోజులు పొడిగింపు

Shaik Madar Saheb

| Edited By: Subhash Goud

Updated on: Jun 08, 2021 | 10:10 PM

KCR Cabinet Meeting Lockdown Highlights: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ప్రగతి భ‌వ‌న్‌లో జ‌రిగే ఈ స‌మావేశానికి మంత్రులు..

TS Cabinet Meeting Highlights: లాక్‌డౌన్‌పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పది రోజులు పొడిగింపు

KCR Cabinet Meeting Lockdown Highlights: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ప్రగతి భ‌వ‌న్‌లో జ‌రిగే ఈ స‌మావేశానికి మంత్రులు, పలువురు అధికారులు హాజ‌రు అయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా లాక్‌డౌన్‌ను మరో పది రోజుల పాటు పొడిగించింది. అలాగే సడలింపుల విషయాలో కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సడలింపు ఇస్తూ, 5 నుంచి 6 గంటల వరకు ఉద్యోగులు, ఇతరులు తమ తమ ఇళ్లకు చేరుకునేందుకు వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం.  అలాగే సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇక కరోనావైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు అదేవిధంగా.. లాక్‌డౌన్‌ను మరింత సడలించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది. జనం రాకపోకలకు సమయాన్ని మరింత పెంచింది.

https://www.youtube.com/watch?v=X4p6WsGvDZ8

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 08 Jun 2021 10:07 PM (IST)

    వరంగల్‌లో ఎయిమ్స్‌ తరహాలో ఆస్పత్రి

    వరంగల్‌లో ఖాళీ చేస్తున్న జైలు ప్రదేశంలో, దేశంలోనే అత్యుత్తమంగా వైద్యసేవలందిస్తున్న ఎయిమ్స్ తరహాలో దవఖానాను ఏర్పాటు చేసి అన్ని రకాల స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ సేవలందించాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని దవాఖానాల్లో ఎండీ హాస్పటల్ అడ్మిస్ట్రేషన్ కోర్సు అభ్యసించిన అర్హులైన వారిని నియమించుకుని హాస్పటల్ అడ్మినిస్ట్రేషన్ కోసం వినియోగించాలని తెలిపింది.

  • 08 Jun 2021 09:59 PM (IST)

    బ్లడ్‌ బ్యాంకుల ఆధునీకరణకు ప్రత్యేక చర్యలు

    అన్ని దవాఖానాల్లో అవసరాలను అందుకునే విధంగా బ్లడ్‌ బ్యాంకుల ఆధునీకరించి అవసరమైన మేరకు నూతన బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేయాలని, వైద్యానికి సంబంధించి ఆర్థోపెడిక్, న్యూరాలజీ తదితర ప్రత్యేక విభాగాలలో, మెరుగైన వైద్య సేవలకోసం కావలసిన మౌలిక వసతులను కల్పించి, అవసరమైన మేరకు సిబ్బందిని నియమించాలని కేబినెట్ వైద్యశాఖను ఆదేశించింది.

  • 08 Jun 2021 09:58 PM (IST)

    డయాలసిస్‌ యంత్రాల ఏర్పాటు

    ఎలర్జీ జబ్బుల పరీక్షలు, చికిత్స కోసం ప్రత్యేక కేంద్రాలను హైదరాబాద్‌, వరంగల్‌, సిద్దిపేట లో ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అయితే పెరుగుతున్న రోగుల రద్దీ రీత్యా ప్రస్థుతం రాష్ట్రంలోని డయాలసిస్ కేంద్రాలలో మరిన్ని డయాలసిస్ యంత్రాలను పెంచడంతో పాటు నూతనంగా మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

  • 08 Jun 2021 09:56 PM (IST)

    అన్ని జిల్లాల్లో డయాగ్నోస్టిక్స్‌ కేంద్రాల ఏర్పాట్లు

    తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ను ములుగు సిరిసిల్ల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని, రేపటినుంచి ప్రారంభించబోతున్న డయాగ్నోస్టిక్స్ కేంద్రాలతో పాటుగా మిగతా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. అన్ని జిల్లాల్లోని డయాగ్నస్టిక్ కేంద్రాల్లో ఈసీజీ డిజిటల్ ఎక్స్ రే, అల్ట్రాసౌండ్, టుడీ ఈకో తోపాటుగా మహిళల కాన్సర్ స్క్రీనింగ్ కోసం ‘మామో గ్రామ్’ యంత్రాలను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

  • 08 Jun 2021 09:54 PM (IST)

    ఆస్పత్రుల్లో వసతి కేంద్రాలు

    తెలంగాణ రాష్ట్రంలోని అన్ని స్థాయి దవాఖానాల్లో రోగుల సహాయార్ధం వచ్చేవారి కోసం వసతి కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలిపింది. ఈ మేరకు తక్షణమే చర్యలు చేపట్టాలని వైద్యశాఖను ఆదేశించింది.

  • 08 Jun 2021 09:52 PM (IST)

    కొత్త దరఖానాల నిర్మాణానికి కేబినెట్‌ ఆమోదం

    సత్తుపల్లి, మధిర పట్టణాల్లో కొత్తగా 100 పడకల దవాఖానలను నిర్మించాలని, ప్రస్తుతం ఉన్న దవాఖాన్లను మాతా శిశు సంరక్షణ కేంద్రాలుగా వినియోగించుకోవాలని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. సూర్యాపేటలో ప్రస్తుతం ఉన్న 50 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని 200 పడకలకు పెంచాలని కేబినెట్ నిర్ణయించింది.

  • 08 Jun 2021 09:39 PM (IST)

    మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మాణంపై..

    హైదరాబాద్లోని ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రి ఆవరణలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు.

  • 08 Jun 2021 09:38 PM (IST)

    ప్రభుత్వ దవాఖాన స్థితిగతులపై సబ్‌ కమిటీ

    ప్రభుత్వ దవాఖానల స్థితిగతులు, మెరుగైన సౌకర్యాలు, సిబ్బంది, ఇతర మౌలిక సౌకర్యాలను సమీక్షించేందుకు సబ్ కమిటీని నియమించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ వైద్య ఆరోగ్య సబ్ కేబినెట్ కమిటీలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు అధ్యక్షులుగా, మంత్రులు జి.జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, పి. సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ సభ్యులుగా ఉంటారు.

  • 08 Jun 2021 09:13 PM (IST)

    లాక్‌డౌన్‌ మరింత కఠినం

    తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ పొడిగించిన విషయం తెలిసిందే. అయితే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు సడలింపు ఇవ్వగా, సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కఠినంగా లాక్‌డౌన్‌ అమలు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

  • 08 Jun 2021 09:10 PM (IST)

    సడలింపు ఇచ్చినా జాగ్రత్తగా ఉండాలి- ప్రభుత్వం

    తెలంగాణ లాక్‌డౌన్‌పై సడలింపులు ఇచ్చినా.. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ప్రతి ఒక్కరు మాస్క్‌లు, భౌతిక దూరం తప్పనిసరి అని తెలిపింది.

  • 08 Jun 2021 09:07 PM (IST)

    లాక్‌డౌన్‌ సడలింపులతో పాటు ఇతర అంశాలపై చర్చ

    కేబినెట్‌ లాక్‌డౌన్‌పై నిర్ణయాలతో పాటు రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వర్షాకాలం పంటలు సాగు, సాగునీటి అంశాలపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. వీటితో పాటు ఇంకా అనేక అంశాలపై చర్చ జరిగింది.

  • 08 Jun 2021 08:55 PM (IST)

    వరి ధాన్యం దిగుబడిపై కేబినెట్‌ హర్షం

    గత ఏడాది వానాకాలం, యాసంగి కలిపి 1,06,03,927 ఎకరాల్లో కేవలం వరి పంట సాగు చేయడం ద్వారా సుమారు 3 కోట్ల టన్నుల వరిధాన్యం దిగుబడి రావడం పట్ల కేబినెట్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ కృషిలో భాగం పంచుకున్న వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని, అధికారులు, సిబ్బందిని మంత్రివర్గం అభినందించింది.

  • 08 Jun 2021 08:53 PM (IST)

    వ్యవసాయ సాగుపై కేబినెట్‌లో చర్చ

    వ్యవసాయ సాగుపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. వానాకాలం సాగుపై వ్యవసాయశాఖ సంసిద్ధత మీద పూర్తిస్థాయి సమీక్ష జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం సహా అనేక సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో వ్యవసాయ సాగు భారీగా పెరగడంపై క్యాబినెట్ హర్షం వ్యక్తం చేసింది.

  • 08 Jun 2021 08:51 PM (IST)

    అక్కడ మాత్రం లాక్‌డౌన్‌ సడలింపు లేదు

    రాష్ట్రంలో కరోనా పూర్తిగా అదుపులోకి రాని సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాల గూడ, నియోజక వర్గాల పరిధిలో మాత్రం లాక్ డౌన్ ఇప్పుడు కొనసాగుతున్న విధంగానే లాక్‌డౌన్‌ కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది.

  • 08 Jun 2021 08:49 PM (IST)

    రేషన్‌ కార్డులపై కేబినెట్‌ కీలక నిర్ణయం

    తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని, పెండింగులో ఉన్న 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డులను మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 15 రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని క్యాబినెట్ సంబంధిత అధికారులను ఆదేశించింది.

  • 08 Jun 2021 08:42 PM (IST)

    గమ్యస్థానాలకు చేరుకునేందుకు మరో గంట వెసులుబాటు

    తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌పై సంచలన నిర్ణయం తీసుకుంది. పది రోజుల పాటు పొడిగిస్తూ, భారీ సడలింపు ఇచ్చింది. ఉదయం 6 నుంచి 5 గంటల వరకు లాక్‌డౌన్‌ సడలింపు ఇవ్వగా, 5 నుంచి 6 గంటల వరకు అంటే గంట పాటు తమ తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం.

  • 08 Jun 2021 08:33 PM (IST)

    తెలంగాణలో లాక్‌డౌన్‌ పొడిగింపు

    తెలంగాణలో 10 రోజుల పాటు లాక్‌డౌన్‌ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించింది. ఇక సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ కొనసాగనుంది.

  • 08 Jun 2021 08:19 PM (IST)

    ఉద్యోగుల ఫిట్‌మెంట్‌పై చర్చ

    తెలంగాణ కేబినెట్‌ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఉద్యోగుల ఫిట్‌మెంట్‌, ఇతర అంశాలపై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయనుంది. అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు భూముల అమ్మకానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వనుంది కేబినెట్‌.

  • 08 Jun 2021 08:16 PM (IST)

    కేబినెట్‌ ముందుకు పీఆర్సీ అంశం

    తెలంగాణ కేబినెట్‌ సమావేశం కొనసాగుతోంది. కేబినెట్‌ ముందుకు వచ్చిన పీఆర్సీ అంశంపై చర్చ కొనసాగుతోంది. ఉద్యోగుల వేతన సవరణ నివేదికను కేబినెట్‌ ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. పీఆర్సీకి సంబంధించి నేడు అధికారిక ప్రకటన, ఉత్తర్వులు జారీ చేయనుంది ప్రభుత్వం.

  • 08 Jun 2021 08:12 PM (IST)

    కొనసాగుతున్న మంత్రివర్గం సమావేశం

    తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఇంకా కొనసాగుతూనే ఉంది. పలు కీలక అంశాలపై చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా లాక్‌డౌన్‌ పొడగింపు అంశంపై అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లాక్‌డౌన్‌ విషయంలో సీఎం కేసీఆర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

  • 08 Jun 2021 07:06 PM (IST)

    కేబినెట్‌లో కీలక అంశాలపై చర్చ

    తెలంగాణ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కొనసాగుతున్న ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా లాక్‌డౌన్ పొడిగింపా..? సడలింపా..? అనే విషయంపై చర్చిస్తోంది మంత్రివర్గం.

  • 08 Jun 2021 05:43 PM (IST)

    మరి కొద్దిసేపట్లో లాక్‌డౌన్‌పై క్లారిటీ

    తెలంగాణ కేబినెట్‌ భేటీ కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించే అవకాశం ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు లాక్‌డౌన్‌ సడలించి రాత్రి సమయాల్లోనే కర్ఫ్యూ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మరికొద్దిసేపట్లో లాక్‌డౌన్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

  • 08 Jun 2021 05:05 PM (IST)

    మొదటి సంవత్సరం ఫలితాల ఆధారంగా సెకండియర్‌ ఫలితాలు

    మొదటి సంవత్సరం ఫలితాల ఆధారంగా ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. అలాగే పీఆర్సీ అమలుకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది.

  • 08 Jun 2021 05:03 PM (IST)

    లాక్‌డౌన్‌ సడలింపులు

    తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ భేటీ కొనసాగుతోంది. సాయంత్రం 6 లేదా 7 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు నైట్‌ కర్ప్యూ విధించే అవకాశం ఉంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ సడలింపు ఇచ్చే అవకాశాలున్నాయి.

  • 08 Jun 2021 04:53 PM (IST)

    ఉద్యోగుల వేతన సవరణ అమలుపై చర్చ

    తెలంగాణ కేబినెట్‌ సమావేశం కొనసాగుతోంది. ఉద్యోగుల వేతన సవరణ అమలు, లాక్‌డౌన్‌ పొడిగింపు, సడలింపులు, ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షల నిర్వహణ, విద్యా సంబంధిత అంశాలపై చర్చ కొనసాగుతోంది.

  • 08 Jun 2021 04:27 PM (IST)

    థర్డ్‌వేవ్‌ ను ఎదుర్కొవడంపై కేబినెట్‌ చర్చ

    ప్రగతిభవన్‌లో తెలంగాణ కేబినెట్‌ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో థర్డ్‌వేవ్‌ ను ఎదుర్కొవడంపై చర్చ కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ పొడిగింపా..? సడలింపా..? అనే విషయం కొద్దిసేపట్లో తేలనుంది.

  • 08 Jun 2021 03:56 PM (IST)

    కేబినెట్‌లో లాక్‌డౌన్‌ పొడిగింపుపై చర్చ

    తెలంగాణలో లాక్‌డౌన్‌ ముగియనుండటంతో కరోనా పరిస్థితులపై రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయ్యింది. లాక్‌డౌన్‌ విషయంలో తదుపరి నిర్ణయం తీసుకునేందుకు మంత్రివర్గం చర్చిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ భేటీలో.. జిల్లాల వారీగా పరిస్థితులను సమీక్షించి, లాక్ డౌన్, మినహాయింపులపై నిర్ణయం తీసుకోనుంది. కొవిడ్ మూడో వేవ్ హెచ్చరికల నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ సన్నద్ధత, ఏర్పాట్లపై చర్చించనున్నారు.

  • 08 Jun 2021 03:07 PM (IST)

    థర్డ్‌వేవ్‌ కరోనాపై చర్చ

    తెలంగాణ రాష్ట్రమంత్రివర్గం సమావేశం కొనసాగుతోంది. కరోనా పరిస్థితులే ప్రధాన అజెండాగా కేబినెట్‌ భేటీ కొనసాగుతోంది. లాక్‌డౌన్, కోవిడ్‌ థర్డ్‌వేవ్‌పై తీసుకునే చర్యలపై చర్చ కొనసాగుతోంది.

  • 08 Jun 2021 02:51 PM (IST)

    లాక్‌డౌన్‌ సడలింపు ఇచ్చే అవకాశం

    తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ సమావేశం కొనసాగుతోంది. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధికారులు, పింఛనర్ల వేతన సవరణ అంశాలపై మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ముఖ్యంగా సాయంత్రం ఆరు గంటల వరకు లాక్‌డౌన్‌ సడలింపు, పూర్తి స్థాయిలో ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ, రాత్రిపూట కర్ఫ్యూ విధించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

  • 08 Jun 2021 02:29 PM (IST)

    లాక్‌డౌన్‌ పొడిగింపుపై కేబినెట్‌ భేటీ

    తెలంగాణ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ కొనసాగింపు, థర్డ్‌వేవ్‌ కరోనాపై తీసుకునే చర్యలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే సాగునీటి ప్రాజెక్టు, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగుల వేతన సవరణపై చర్చించనున్నారు.

  • 08 Jun 2021 02:20 PM (IST)

    ప్రారంభమైన తెలంగాణ మంత్రివర్గ సమావేశం

    ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. ప్రగతి భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు హాజరయ్యారు. రాష్ట్ర ఉద్యోగుల వేతన సవరణ ఫైల్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

  • 08 Jun 2021 02:12 PM (IST)

    ఆర్థిక వ్యవస్థపై చర్చ..

    లాక్‌డౌన్‌ వల్ల కరోనా నియంత్రణ ఎంతవరకసాధ్యమైంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఏ మేరకు ప్రభావితమైందనే అంశాలపై చర్చించి లాక్‌డౌన్ పెంపుపై నిర్ణయం తీసుకోనున్నారు.

  • 08 Jun 2021 02:07 PM (IST)

    ఖరీఫ్‌పై దృష్టి.. 

    ఖరీఫ్ సీజన్ వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంపై దృష్టిసారించింది. రైతు బంధు, సాగునీరు, నీటిపారుదల, పురుగు మందులు, ఎరువులు, విత్తనాల సరఫరా, నకిలీ విత్తనాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.
  • 08 Jun 2021 02:03 PM (IST)

    వేతన సవరణకు ఆమోదం తెలిపేనా.. !

    రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ ఫైల్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. లాక్‌డౌన్ అంశంతోపాటు.. ఉద్యోగుల వేతన సవరణపై చర్చించనున్నట్టు సమాచారం. ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి పూర్తి వివరాలతో నోట్‌ను ఇప్పటికే రాష్ట్ర ఆర్థికశాఖ రూపొందించినట్టు తెలుస్తోంది. దీనిని మంత్రివర్గం ముందుంచనున్నారు.

  • 08 Jun 2021 02:00 PM (IST)

    ఆంక్షలా.. అన్‌లాకా..?

    ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆంక్షలను మరింత సడలించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు పేర్కొంటున్నారు. మధ్యాహ్నం 1 వరకు ఉన్న అనుమతి వేళలను సాయంత్రం 5 గంటల వరకు పెంచి, ఇళ్లకు తిరిగి వెళ్లడానికి మరో గంట అనుమతి ఇచ్చే అవకాశముందని పేర్కొటున్నారు. లేకపోతే.. పూర్తిగా అన్ లాక్ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం..

  • 08 Jun 2021 01:58 PM (IST)

    రేపటితో ముగుస్తున్న లాక్‌డౌన్..

    రాష్ట్రంలో మూడో విడత లాక్‌డౌన్‌ రేపటితో ముగుస్తుండటంతో తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో మరి కాసేపట్లో ప్రభుత్వం ప్రకటించనుంది.

Published On - Jun 08,2021 10:07 PM

Follow us