తెలంగాణ కేబినెట్ భారీ నిర్ణయాలు.. జిల్లా కేంద్రాల్లో వైద్య సేవలను పెంచుతూ కీలక ప్రకటన

Telangana Cabinet: పలు కీలక నిర్ణయాలను తీసుకుంది తెలంగాణ కేబినెట్. సత్తుపల్లి, మధిర పట్టణాల్లో కొత్తగా 100 పడకల దవాఖానలను నిర్మించాలని నిర్ణయించింది. ప్రస్థుతం ఉన్న...

తెలంగాణ కేబినెట్ భారీ నిర్ణయాలు.. జిల్లా కేంద్రాల్లో వైద్య సేవలను పెంచుతూ కీలక ప్రకటన
Cm Kcr Review On Land Digital Survey
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 08, 2021 | 10:41 PM

వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలను తీసుకుంది తెలంగాణ కేబినెట్. సత్తుపల్లి, మధిర పట్టణాల్లో కొత్తగా 100 పడకల దవాఖానలను నిర్మించాలని నిర్ణయించింది. ప్రస్థుతం ఉన్న దవాఖాన్లను మాతా శిశు సంరక్షణ కేంద్రాలుగా వినియోగించుకోవాలని సూచించింది. సూర్యాపేటలో ప్రస్థుతం ఉన్న 50 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని 200 పడకలకు పెంచుతున్నట్లుగా తెలిపింది. రాష్ట్రంలోని అన్ని స్థాయిల్లోని దవాఖానాల్లో రోగుల సహాయార్ధం వచ్చేవారికోసం వసతి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు తక్షణమే చర్యలు చేపట్టాలని వైద్యశాఖను ఆదేశించింది.

తెలంగాణ హెల్త్ ప్రొఫైల్‌ను ములుగు సిరిసిల్ల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. బుధవారం నుంచి ప్రారంభించబోతున్న 19 డయాగ్నోస్టిక్స్ కేంద్రాలతో పాటుగా మిగతా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అన్ని జిల్లాల్లోని డయాగ్నస్టిక్ కేంద్రాల్లో ఈసీజీ డిజిటల్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్, టుడీ ఈకో తోపాటుగా మహిళల కాన్సర్ స్క్రీనింగ్ కోసం ‘మామో గ్రామ్’ యంత్రాలను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

ఎలర్జీ జబ్బుల పరీక్షలు ట్రీట్ మెంట్ కోసంగా ప్రత్యేక కేంద్రాలను హైద్రాబాద్ వరంగల్లు సిద్దిపేట లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పెరుగుతున్న రోగుల రద్దీ రీత్యా ప్రస్థుతం రాష్ట్రంలోని డయాలసిస్ కేంద్రాలలో మరిన్ని డయాలసిస్ యంత్రాలను పెంచడంతో పాటు నూతనంగా మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.

కేన్సర్ రోగులకు జిల్లా కేంద్రాల్లోనే కీమో థెరపీ రేడియో థెరపీ కొరకు అవసరమైన మౌలిక వసతులతో జిల్లా కేన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని దవాఖానాల్లో అవసరాలను అందుకునే విధంగా బ్లడ్ బ్యాంకుల ఆధునీకరించి అవసరమైన మేరకు నూతన బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. వైద్యానికి సంబంధించి ఆర్థోపెడిక్, న్యూరాలజీ తదితర ప్రత్యేక విభాగాలలో, మెరుగైన వైద్య సేవలకోసం కావలసిన మౌలిక వసతులను కల్పించి, అవసరమైన మేరకు సిబ్బందిని నియమించాలని కేబినెట్ వైద్యశాఖను ఆదేశించింది.

వరంగల్ జిల్లాలో ఖాళీ చేస్తున్న జైలు ప్రదేశంలో, దేశంలోనే అత్యుత్తమంగా వైద్యసేవలందిస్తున్న ఎయిమ్స్ తరహాలో దవఖానాను ఏర్పాటు చేసి అన్ని రకాల స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ సేవలందించాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని దవాఖానాల్లో ఎండీ హాస్పటల్ అడ్మిస్ట్రేషన్ కోర్సు అభ్యసించిన అర్హులైన వారిని నియమించుకుని హాస్పటల్ అడ్మినిస్ట్రేషన్ కోసం వినియోగించాలని కేబినెట్ నిర్ణయించింది. వైద్య సేవల్లో భాగం పంచుకునే నర్సింగ్, మిడ్ వైఫరీ కోర్సులను, లాబ్ టెక్నీషియన్ రేడియాలజీ టెక్నిషియన్ డయాలసిస్ టెక్నిషియన్ వంటి ప్రత్యేక నైపుణ్య కోర్సులను అవసరమైనంత మేరకు ప్రభుత్వ దవాఖానాల్లో వైద్యకళాశాలల్లో అందుబాటులోకి తేవాలని కేబినెట్ వైద్యశాఖను ఆదేశించింది.

రెండో కరోనా వేవ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మరో థర్డ్ వేవ్ రానున్నదనే వార్తల నేపథ్యంలో పూర్తిస్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టాలని అవసరమైన మౌలిక వసతులను సిబ్బందిని ఔషదాలను సమకూర్చుకోవాలని కేబినెట్ ఆదేశించింది.

ఇవి కూడా చదవండి : vaccination: ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ ధరలు ఇలా..! రేటును నిర్ణయించిన కేంద్రం.. ఏ టీకా ధర ఎంతంటే..!