అక్క‌డ మ‌రో 12 మంది పోలీసుల‌కు క‌రోనా పాజిటివ్‌

వైద్య సిబ్బంది, డాక్ట‌ర్లు, పోలీసులు కూడా పెద్ద సంఖ్య‌లో వైర‌స్ బారిన ప‌డుతున్నారు. తాజాగా జేజే మార్గ్ పోలీస్ స్టేష‌న్‌కు చెందిన 12 మంది పోలీసుల‌కు క‌రోనా సోకింది.

  • Jyothi Gadda
  • Publish Date - 1:41 pm, Tue, 5 May 20
అక్క‌డ మ‌రో 12 మంది పోలీసుల‌కు క‌రోనా పాజిటివ్‌

క‌రోనా మ‌హ‌మ్మారి మ‌హారాష్ట్ర‌ను అత‌లాకుత‌లం చేస్తోంది. దేశంలో న‌మోద‌వుతున్న క‌రోనా కేసుల్లో అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లోనే వెలుగుచూస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు మహారాష్ట్రలో 14,541 కరోనా కేసులు, 796 మరణాలు నమోదు కాగా.. ముంబై నగరంలోనే 9 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 361 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఒక్కరోజే దేశ ఆర్థిక రాజధానిలో 150 కొత్త కేసులు నమోదయ్యాయి. వైద్య సిబ్బంది, డాక్ట‌ర్లు, పోలీసులు కూడా పెద్ద సంఖ్య‌లో వైర‌స్ బారిన ప‌డుతున్నారు. తాజాగా జేజే మార్గ్ పోలీస్ స్టేష‌న్‌కు చెందిన 12 మంది పోలీసుల‌కు క‌రోనా సోకింది.

మ‌హారాష్ట్ర‌లో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. వైర‌స్ బారి నుంచి ప్ర‌జ‌ల్ని కాపాడుతున్న ర‌క్ష‌ణ క‌వ‌చాలుగా ప‌నిచేస్తున్న పోలీసుల‌ను వైర‌స్ ప‌ట్టిపీడిస్తోంది. రాష్ట్రంలో ఆదివారం ఒక్క‌రోజే పైథోని పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ఆరుగురికి, నాగ్‌పాడాకు చెందిన ముగ్గురు, మ‌హిమ్ పోలిస్ స్టేష‌న్‌లోని ఇద్ద‌రు పోలీసులు కోవిడ్ భారిన ప‌డిన‌ట్లు సంబంధిత అధికారులు వెల్ల‌డించారు.

కాగా, ఇప్పుడు జెజె మార్గ్ పోలిస్ స్టేష‌న్‌కు చెందిన 12 మంది పోలీసులకు క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయ్యింది. వీరిలో ఆరుగురు స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్లు ఉన్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. అయితే వీరిలో 8 మందిలో క‌రోనా ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ‌లేద‌ని, ప‌రీక్ష‌ల్లో పాజిటివ్ అని నిర్ధార‌ణ అయిన‌ట్లు తెలిపారు. దీంతో వీరి కుటుంబ‌ స‌భ్యులు స‌హా, 40 మందిని సెల్ఫ్ క్వారంటైన్‌కు పంపిన‌ట్లు అసిస్టెంట్ పోలీస్ క‌మిష‌న‌ర్ అవినాష్ ధ‌ర్మాధికారి తెలిపారు.