AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19: మళ్లీ వ్యాప్తి చెందుతోన్న కరోనా వైరస్‌.. ఢిల్లీ, ముంబాయిల్లో డేంజర్‌ బెల్స్‌..!

కరోనా ఫోర్త్‌ వేవ్‌ వస్తుందా? రాదా? అన్న విషయాన్ని గట్టిగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. జులైలో ప్రమాదం పొంచి ఉందని ఇప్పటికే కొందరు హెచ్చరించారు.

Covid-19: మళ్లీ వ్యాప్తి చెందుతోన్న కరోనా వైరస్‌.. ఢిల్లీ, ముంబాయిల్లో డేంజర్‌ బెల్స్‌..!
Covid 19
Balu
| Edited By: Balaraju Goud|

Updated on: Apr 20, 2022 | 11:59 AM

Share

Covid-19: కరోనా(Coronavirus) ఫోర్త్‌ వేవ్‌ వస్తుందా? రాదా? అన్న విషయాన్ని గట్టిగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. జులైలో ప్రమాదం పొంచి ఉందని ఇప్పటికే కొందరు హెచ్చరించారు. ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. నాలుగో తరంగాన్ని అడ్డుకునేందుకు కోవిడ్‌ నిబంధనలను మళ్లీ అమలు చేయాలనే ఆలోచనతో ఉన్నాయి. వచ్చే నెలలో కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగవచ్చని, అంత మాత్రానా ఫోర్త్‌ వేవ్‌ కచ్చితంగా వస్తుందని చెప్పలేమని అంటున్నారు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రాజారావు. అయితే కరోనా వైరస్‌ పీడ మాత్రం ఇంకా పూర్తిగా తొలగిపోలేదంటున్నారు. ఇప్పుడు ఉన్న డెల్టా, ఒమిక్రాన్‌, ఎక్స్‌ఈలు సబ్‌ వేరియంట్లే కాబట్టి వీటి ప్రభావం తక్కువగా ఉంటుందని చెబుతూనే కరోనా కొత్త వేరియంట్లతో మాత్రం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

సుమారు రెండేళ్ల కిందట చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ఇంత బీభత్సాన్ని సృష్టిస్తుందని అనుకోలేదు. చైనాకే పరిమితం అవుతుందని అనుకున్నారు కానీ ఆ వైరస్‌ ప్రపంచమంతటా వ్యాపించింది. ఇంచుమించు 62 లక్షల మంది ఉసురు తీసుకుంది. ఎంతోమందిని అనారోగ్యానికి గురి చేసింది. కరోనా నుంచి ఎలాగోలా కోలుకున్నవారిని కూడా ముప్పుతిప్పులు పెడుతోంది. మన దేశంలో కూడా ఎంతో మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. చాలా దేశాలు ఆర్ధికంగా కుదేలయ్యాయి. మనలో రోగ నిరోధక శక్తి పెంచేందుకు వాక్సిన్లను రూపొందించారే తప్ప కరోనాను అంతం చేసే మందులింకా మనుగడలోకి రాలేదు. అందుకే కరోనా మనల్ని వదలడం లేదు. ఎప్పటికప్పుడు కొత్త రూపాలను సంతరించుకుంటూ మనల్ని బాధపెడుతూనే ఉంది. మొన్నామధ్య డెల్టా రూపంలో విరుచుకుపడిన కరోనా ఆ తర్వాత ఒమిక్రాన్‌గా విరుచుకుపడింది. ఇప్పుడు దాని సబ్‌ వేరియంట్లైన బీఏ1, బీఏ2, ఎక్స్‌ఈలు వ్యాప్తి చెందుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో తమ ప్రతాపాన్ని చూపుతున్నాయి. బీఏ.2 చైనాలో ఇప్పుడు స్వైర విహారం చేస్తున్నది. దీన్ని కట్టడి చేసేందుకు చైనా ప్రభుత్వం కఠిన ఆంక్షలను విధించింది. మరోసారి లాక్‌డౌన్‌ తప్పలేదక్కడ. జనజీవితం అస్తవ్యస్తమయ్యింది., షాంఘై నగరంలో అయితే ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. క్వారంటైన్‌ కేంద్రాలు నరకానికి నకళ్లుగా మారాయి. ఆకలితో ప్రజలు అలమటిస్తున్నారు. ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి.

ఇప్పుడు మన దేశంలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. మొన్నటి వరకు కరోనా పూర్తిగా కట్టడిలోకి వచ్చిందనుకున్నాం. ఇక ఏం ఫర్వాలేదని సంబరపడ్డాం. కాని కేసులు క్రమక్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో అయితే కరోనా వైరస్‌ భయాందోళనలను రేపుతోంది. మళ్లీ జనం మొహంలో మాస్కులు వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌, హర్యానాలో మాస్కులు పెట్టుకోవడం కంపల్సరీ అయ్యింది. కరోనా తగ్గిపోయిందన్న భావనతో కోవిడ్‌ నిబంధనలను పాటించకపోవడం వల్లే పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందని వైద్య నిపుణులు అంటున్నారు. జనం గుంపులు గుంపులుగా తిరగడం మొదలుపెట్టారు. సామూహికంగా ఉత్సవాలు చేసుకుంటున్నారు. మాస్కులు పెట్టుకోవడం మానేశారు. అందుకే కరోనా మళ్లీ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. కేరళ, మిజోరం, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానాలలో పాజిటివిటీ రేటు పైపైకి వెళుతుండటం కలవరం కలిగిస్తోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను కేంద్రం అలెర్ట్ చేసింది. జూన్‌ నెలలో కరోనా ఫోర్త్‌ వేవ్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయని కొంతమంది పరిశోధకులు అంటున్నారు. ఫోర్త్‌ వేవ్‌ ఎలా ఉండబోతున్నదో ఇప్పుడు చెప్పడం కష్టం కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండటం మేలని సూచిస్తున్నారు. కోవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సలహా ఇస్తున్నారు. రెండు వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయంటే అప్రమత్తతతో వ్యవహరించాల్సిన సమయం వచ్చేసిందన్నట్టే! కరోనా నుంచి కోలుకున్నవారిలో చాలా మంది ఇంకా సఫర్‌ అవుతూనే ఉన్నారు. 30 శాతం మందిలో లాంగ్‌ కోవిడ్‌ లక్షణాలు కనిపిస్తున్నాయట. అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాసన లేకపోవడం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. ఇప్పటి వరకు మన దేశంలో నాలుగున్నర కోట్ల మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. అయిదున్నర లక్షల మంది కరోనా కాటుకు బలయ్యారు. కోవిడ్‌ నుంచి కోలుకున్న ప్రతీ అయిదుగురిలో ఒకరు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.