Corona Effect: దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా పంజా.. ప్రజలను మరింత పేదరికంలోకి నెట్టేయనున్న మహమ్మారి..!
Corona Effect: కరోనా మహమ్మారి ప్రజల ఆరోగ్యాలనే కాకుండా వారి ఆర్థిక పరిస్థుతులను సైతం క్షీణింపజేస్తోంది. మొదటి వేవ్ అప్పుడు ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో...
Corona Effect: కరోనా మహమ్మారి ప్రజల ఆరోగ్యాలనే కాకుండా వారి ఆర్థిక పరిస్థుతులను సైతం క్షీణింపజేస్తోంది. మొదటి వేవ్ అప్పుడు ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో ఆర్థిక లావాదేవీలు పూర్తిగా స్థంభించిపోయాయి. దీంతో ఎంతో మంది ఉపాధిని కోల్పోయారు. చాలా మంది పేదరికంలోకి వెళ్లి పోయారు. అమెరికాకు చెందిన ఓ రీసర్చ్ సెంటర్ నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైన వివరాల ప్రకారం.. దేశంలో పేదరికం రెట్టింపు అయినట్లు తేలింది. లాక్‌డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా ఉన్న చాలా మంది ఆదాయాలు పడిపోయాయని, గతేడాది చాలా మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు తేలింది. గతేడాది విజృంభించిన కరోనా తొలి వేవ్.. దేశ జీడీపీని భారీగా తగ్గించింది. రోజుకు రూ. 150 కంటే తక్కువ ఆదాయం వచ్చే వారి సంఖ్య.. 6 కోట్ల నుంచి ఏకంగా 13.4 కోట్లకు చేరింది. ఈ లెక్కన చూస్తే గతేడాది భారత్‌లో ఏకంగా 7.5 కోట్ల మంది పేదరికంలోకి జారుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కరోనా సెకండ్ దేశాన్ని ఓ ఊపు ఊపేస్తోంది. ఈసారి ఆర్థిక వ్యవస్థపై ఊహించిన దానికంటే ఎక్కువ దుష్ప్రభావం ఉంటుందని అధ్యయనాల్లో వెల్లడైంది. మరీ ముఖ్యంగా చిన్న సంస్థలపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుందని తేలింది. మొదట్లో సెకండ్ వేవ్ కేవలం కొద్ది సమయం వరకే ప్రభావం చూపుతుందని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడ్డారు. కానీ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తుండడంతో ఆర్థిక వ్యవస్థలు మరింత క్షీణించే అవకాశాలున్నట్లు అభిప్రాయపడుతున్నారు. గురువారం ఒక్క రోజు దేశంలో 3 లక్షలకుపైగా కేసులు నమోదు కావడం 2000కు పైగా మరణాలు సంభవించడం పరిస్థితికి అద్దం పడుతోంది. మహారాష్ట్ర, ఢిల్లీలో ఇప్పటికే ఆర్థిక కార్యకలాపాలు స్థంభించాయి. ప్రభుత్వాలు విధిస్తోన్న ఈ నిబంధనలతో చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. సెకండ్ వేవ్ కారణంగా ఏవియేషన్, టూరిజం, రిటైల్, వినోదం, రెస్టారెంట్ వంటి రంగాలు మళ్లీ 2020 నాటి పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉందని భయాందోళనలు చెందుతున్నట్లు తెలుస్తోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కాకపోయినా.. మే నెల వరకు వైరస్ కట్టడి కాకపోయినా.. వ్యాపార కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయని.. ఇవన్నీ భారీగా ఉద్యోగాలు కోల్పోవడం, ఆదాయాలు పడిపోవడానికి దారి తీస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా భారతీయులను మరింత పేదరికంలోకి నెట్టేసే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.
కోవిడ్ ఎఫెక్ట్, ఇండియా నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా ఆంక్షలు ? పీఎం స్కాట్ మారిసన్