లాక్‌డౌన్ 4.0 పొడిగింపుపై కేంద్రహోంశాఖ క్లారిటీ..!

లాక్‌డౌన్ 4.0 మరో మూడు రోజుల్లో ముగియనుండటంతో లాక్‌డౌన్ 5.0 ఉంటుందా.? లేదా ? అనే దానిపై దేశవ్యాప్తంగా జోరుగా చర్చ నడుస్తోంది. మరోవైపు దేశంలో కరోనావైరస్‌ కేసుల సంఖ్య 1.5 లక్షల మార్కు దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం కేవలం 14 రోజుల్లోనే కేసులు రెట్టింపు అయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మాత్రం..

లాక్‌డౌన్ 4.0 పొడిగింపుపై కేంద్రహోంశాఖ క్లారిటీ..!
Follow us

|

Updated on: May 28, 2020 | 11:44 AM

దేశంలో కరోనా వేగం వేరుగా ఉంది. 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మహమ్మారి విస్తరించింది. మొత్తం కేసుల్లో 87శాతం కేసులు 10 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. మరో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 9 శాతానికి పైగా నమోదవ్వగా మిగిలిన 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 0.47శాతం కేసులు వెలుగు చూశాయి. 2.64 శాతం మంది బాధితులను పలు రాష్ట్రాలు వెనక్కి పంపడంతో వారిని ప్రస్తుతానికి ఏ రాష్ట్రాల జాబితాలో చేర్చలేదు. ఇదిలా ఉండగా లాక్‌డౌన్ 4.0 మరో మూడు రోజుల్లో ముగియనుండటంతో లాక్‌డౌన్ 5.0 ఉంటుందా.? లేదా ? అనే దానిపై దేశవ్యాప్తంగా జోరుగా చర్చ నడుస్తోంది. లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం మరో రెండు వారాలు పొడిగించనుందని మీడియాలో వార్తలొస్తుండగా.. కేంద్ర హోంశాఖ మాత్రం ఈ వార్తలను కొట్టివేసింది. దీంతో లాక్‌డౌన్ పొడిగింపుపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 31న మోదీ నిర్వహించనున్న మన్‌ కీ బాత్ కార్యక్రమంలో దీనిపై క్లారిటీ రానుందని సమాచారం.

దేశంలో కరోనావైరస్‌ కేసుల సంఖ్య 1.5 లక్షల మార్కు దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం కేవలం 14 రోజుల్లోనే కేసులు రెట్టింపు అయ్యాయి. 4,337 మరణాలు కాగా, 16 రోజుల్లో రెట్టింపు అయ్యాయి. భారత్‌లో కరోనా కేసులు పెరిగిపోవడంతో ఆందోళన కల్గిస్తోంది. వైద్య సౌకర్యాలు లేమితోపాటు వ్యవస్థలో లోపాలు కూడా కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు. రెండు మాసాల పాటు లాక్‌డౌన్‌ కొనసాగినా, కరోనావైరస్‌ నియంత్రణ లోకి రాకపోవడం మరింత ఆందోళన కల్గిస్తోంది. దేశంలో నమోదవుతున్న కోవిడ్‌-19 కేసుల్లో 70శాతం కేవలం 11 నగరాల్లోనే నమోదవుతున్నట్లు అధికారవర్గాలు గుర్తించాయి. ఇందులో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, అహ్మదా బాద్‌, కోల్‌కతా మెట్రో నగరాలు కాగా, పుణే, థానె, జైపూర్‌, సూరత్‌, ఇండోర్‌ నగరాలూ ఉన్నాయి.

దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 6,387 కరోనా కేసులు నమోదుకాగా, 170 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,51,767. మృతుల సంఖ్య 4,337కి చేరింది. 64,425 మంది కరోనా బాధితులు వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 83,004 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. మహారాష్ట్రలో అత్యధికంగా 2,091 కొత్త కోవిడ్‌-19 కేసులు నమోదు కాగా, 97 మంది మరణించారు. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 54,758కి చేరింది. 1,168 మంది కోవిడ్‌-19 బాధితులు డిశ్చార్జ్‌ అయ్యారు.