కరోనా..లాక్ డౌన్ ఎఫెక్ట్.. అంతరిక్ష కార్యక్రమాల నిర్వహణలో జాప్యం.. ఇస్రో చీఫ్ కె.శివన్
కొన్ని అంతరిక్ష కార్యక్రమాలను చేపట్టడంలో జరుగుతున్న జాప్యానికి కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కారణమని ఇస్రో చీఫ్ కె.శివన్ అన్నారు. ఈ కార్యక్రమాల విషయంలో తమ సంస్థ సుమారు 500 పరిశ్రమలతో సంప్రదింపులు జరుపుతోందని...
![కరోనా..లాక్ డౌన్ ఎఫెక్ట్.. అంతరిక్ష కార్యక్రమాల నిర్వహణలో జాప్యం.. ఇస్రో చీఫ్ కె.శివన్](https://images.tv9telugu.com/wp-content/uploads/2020/05/ISRO-SHivan.jpg?w=1280)
కొన్ని అంతరిక్ష కార్యక్రమాలను చేపట్టడంలో జరుగుతున్న జాప్యానికి కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కారణమని ఇస్రో చీఫ్ కె.శివన్ అన్నారు. ఈ కార్యక్రమాల విషయంలో తమ సంస్థ సుమారు 500 పరిశ్రమలతో సంప్రదింపులు జరుపుతోందని, అయితే కరోనా, లాక్ డౌన్ వల్ల త్వరగా వీటిని చేపట్టలేకపోతున్నామని ఆయన చెప్పారు. ఇస్రో కేంద్రాలు ప్రభుత్వ ఆదేశాల మేరకు పని చేస్తున్నాయని, తాము అత్యవసరమైన, క్లిష్టమైన యాక్టివిటీస్ లో చురుకుగానే ఉన్నామని తెలిపారు. మా ఇస్రో సంస్థకు సంబంధించిన పనులను దేశవ్యాప్తంగా గల 500 పరిశ్రమలు చేపట్టాయి. అయితే కొన్ని రోజుల్లోనే ఈ పనులు ఓ కొలిక్కి వస్తాయి అని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అన్ని ఇస్రో కేంద్రాల నుంచి సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రానికి వచ్ఛే వారి (సిబ్బంది) అవసరం తమకు ఎంతయినా ఉందని, అయితే అంతర్ రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు ఉన్న కారణంగా తాము వెయిట్ చేయాల్సి వస్తోందన్నారు. పైగా దేశం అసాధారణ ఆర్ధిక పరిస్థితిని ఎదుర్కొంటోందని, బడ్జెట్ కోత తప్పదని భావిస్తున్నామని శివన్ పేర్కొన్నారు.
కరోనాను ఎదుర్కొనేందుకు ఇస్రో మూడు వెంటిలేటర్ డిజైన్లను అభివృధ్ది చేసిందని చెప్పిన ఆయన.. కొన్ని సెంటర్లు ఆటోమాటిక్ హ్యాండ్ శానిటైజర్ డిస్పెన్సర్లను తయారు చేసినట్టు తెలిపారు. గగన్ యాన్ మిషన్, చంద్రయాన్-3, ఆదిత్య మిషన్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల గురించి కూడా ఆయన వివరించారు.