కరోనా ఊరటః 51 శాతం దాటిన రికవరీ రేటు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య పెరుగుతోంది. భారత్‌లోనూ రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. గడిచిన 24 గంటల్లో
ప్రపంచ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య పెరుగుతోంది. భారత్‌లోనూ రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. గడిచిన 24 గంటల్లో 7419 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది. దేశంలో ఇప్పటి వరకు 3,32,424 మంది కరోనా బారినపడ్డారని తెలిపింది. అందులో 1,69,797 మంది పూర్తిగా కోలుకున్నారని చెప్పింది. ప్రస్తుతం 1,53,106 మంది వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. దేశ వ్యాప్తంగా వైరస్ బారినపడిన వారిలో సగానికి పైగా పేషెంట్లు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, కరోనా రికవరీ రేటు 51.08 శాతానికి చేరిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కరోనాపై పోరులో భాగంగా దేశ వ్యాప్తంగా కోవిడ్ -19 టెస్టులను కేంద్రం ముమ్మరంగా చేపడుతోంది. ప్రతి రోజూ లక్షకు పైగా కరోనా టెస్టులు చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఆదివారం ఒక్కరోజే 1,15,519 శాంపిల్స్ పరీక్షించినట్లు వెల్లడించింది. కరోనా టెస్టుల కోసం దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు ప్రభుత్వ ల్యాబ్స్ 653కు, ప్రైవేటు ల్యాబ్స్ 248కి పెంచినట్లు చెప్పింది కేంద్ర ఆరోగ్య శాఖ వివరించింది. దేశంలో జూన్ 14 వరకు 57,74,133 టెస్టులు చేసినట్లు తెలిపింది.