Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC Ranker 2025 Success Story: ఇంటర్‌లో ఫెయిల్‌.. అయినా సివిల్‌ సర్వీసెస్‌లో సత్తా చాటిన తెలుగు బిడ్డ!

యూపీఎస్సీ 2024 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 26 మంది అభ్యర్ధులు ఎంపికైనారు. ఇందులో తిరుపతి జిల్లా నారాయణవనం మండలం గోవిందప్పనాయుడు కండ్రిగ గ్రామానికి చెందిన పామూరి సురేష్‌ సివిల్స్‌లో ఏకంగా 988వ ర్యాంకు సాధించారు. తన ప్రయాణంలో ఎన్నో ఒడుదుడుకులు.. అయినా వెనకడుగేయక సంకల్పంతో విజయం దక్కువరకు పరుగాపలేదు..

UPSC Ranker 2025 Success Story: ఇంటర్‌లో ఫెయిల్‌.. అయినా సివిల్‌ సర్వీసెస్‌లో సత్తా చాటిన తెలుగు బిడ్డ!
UPSC 2024 Ranker Pamuri Suresh
Srilakshmi C
|

Updated on: Apr 25, 2025 | 7:15 AM

Share

తిరుపతి, ఏప్రిల్ 25: యూపీఏఎస్సీ 2024 సివిల్స్‌ ఫలితాలు తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో మొత్తం 1009మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఐఏఎస్‌, ఐపీఎస్ వంటి ఉన్నతాధికారుల స్థానం కోసం రాసే యూపీఎస్సీ సివిల్స్ స‌ర్వీసెస్‌ ప‌రీక్ష (సీఎస్ఈ) ప‌రీక్ష యేటా లక్షలాది మంది పోటీపడుతుంటారు. కానీ విజయం మాత్రం కొందరికే వరిస్తుంది. తాజా ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 26 మంది అభ్యర్ధులు ఎంపికైనారు. ఇందులో తిరుపతి జిల్లా నారాయణవనం మండలం గోవిందప్పనాయుడు కండ్రిగ గ్రామానికి చెందిన పామూరి సురేష్‌ సివిల్స్‌లో ఏకంగా 988వ ర్యాంకు సాధించారు.

పదో తరగతి వరకు సాధారణ విద్యార్థి అయిన సురేష్‌.. ఇంటర్‌ మొదటి సంవత్సరం ఫెయిల్‌ అయ్యారు. దీంతో ఎందకు పనికిరాడని అందరూ అనుకున్నారు. కానీ సురేష్‌ మాత్రం తిరిగి నంద్యాలలో డిప్లొమా కోర్సులో చేశారు. ఆ సమయంలో స్వామి వివేకానంద, అబ్దుల్‌ కలాం పుస్తకాలు చదివి ఎంతో స్ఫూర్తి పొందారు. చదువుతోనే జీవితంలో మార్పు వస్తుందని గట్టిగా నమ్మిన సురేష్‌.. సివిల్స్‌కు ఎంపికైతే పేదల కష్టాలు తీర్చవచ్చని గ్రహించారు. డిప్లొమా తర్వాత ఈసెట్‌ రాసి రాష్ట్రస్థాయిలో ఏడో ర్యాంకు సాధించి సత్తా చాటారు. కర్నూలులో ఇంజినీరింగ్‌ పూర్తి చేశాక.. 2011లో జెన్‌కోలో ఏఈగా ఉద్యోగంలో చేరారు. 2017లో తొలిసారి సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాయగా కసీం ప్రిలిమ్స్‌ పరీక్ష కూడా గట్టెక్కలేకపోయారు. మరింత కష్టపడి చదివిన ఆయన రెండో ప్రయత్నంలో ఏకంగా ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. కానీ తుది జాబితాలో మాత్రం చోటు దక్కలేదు.

తిరిగి 2020లో సన్నద్ధమవుతుండగా కొవిడ్‌ మహమ్మారి బారిన పడటంతో వినికిడి సమస్య తలెత్తింది. ఇలా తరచూ వైఫల్యాలు వెంటాడిన మనో ధైర్యం మాత్రం కోల్పోలేదు. ‘గ్రామ చైతన్య’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి నల్లమలలో బడి మానేసిన పిల్లలను ఆ పాఠశాలలో చేర్పించి విద్యా బుద్ధులు నేర్పించారు. ఐపీఎస్‌ కావాలన్న తన లక్ష్యం వైపు అడుగులు వేస్తున్న కారణంగా వినికిడి సమస్య కారణంగా అర్హత సాధించలేకపోయారు. అప్పుడే ఐఏఎస్‌ సాధించాలని తన లక్ష్యం మరోమారు మార్చుకున్నారు. సివిల్స్‌ సన్నద్ధతకు ఇబ్బందిగా ఉందని 2020లో ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు. అప్పట్లోపూ సురేష్‌కు నెలకు ఏకంగా రూ.1.50 లక్షల జీతం వచ్చేది. సివిల్స్ సన్నద్ధతకు ఉద్యోగాన్ని వదులుకుని కొవిడ్‌ అనంతరం మూడు సార్లు యూపీఎస్సీ పరీక్ష రాశాడు. కానీ ఈసారి ప్రిలిమ్స్‌ పరీక్ష కూడా దాటలేదు. 2024లో ఏడో ప్రయత్నంలో ఏకంగా 988వ ర్యాంకు సాధించారు. వరుస వైఫల్యాలు ఎదురైనా వెరవక ముందుకు అడుగులేస్తే విజయం ఏనాటికైనా దక్కుతుందనడానికి సురేష్ గాథే ఓ ఉదాహరణ.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.