TSPSC Group 4 Rankers: టీఎస్‌పీఎస్సీ గ్రూపు-4 ఫలితాల్లో సత్తాచాటిన ఆణిముత్యాలు.. మొదటి రెండు ర్యాంకులు సాధించిన విజేతలు వీరే
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 9 గ్రూప్-4 ఫలితాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. గ్రూప్-4 కింద 8,180 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడగా.. ఈ పోస్టులకు 7,26,837 మందితో కూడిన మెరిట్ జాబితాను టీఎస్సీయస్సీ విడుదల చేసింది. ధ్రువపత్రాల వెరిఫికేషన్‌కు ఎంపికైన వారి వివరాలు త్వరలో వెల్లడిస్తామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఈ క్రమంలో అభ్యర్ధుల మార్కులు, ర్యాంకుల వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో..
హైదరాబాద్, ఫిబ్రవరి 11: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 9 గ్రూప్-4 ఫలితాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. గ్రూప్-4 కింద 8,180 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడగా.. ఈ పోస్టులకు 7,26,837 మందితో కూడిన మెరిట్ జాబితాను టీఎస్సీయస్సీ విడుదల చేసింది. ధ్రువపత్రాల వెరిఫికేషన్‌కు ఎంపికైన వారి వివరాలు త్వరలో వెల్లడిస్తామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఈ క్రమంలో అభ్యర్ధుల మార్కులు, ర్యాంకుల వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఫలితాల్లో కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్‌కు చెందిన శ్రీరాం శివకృష్ణ మొదటి ర్యాంక్ సాధించగా.. కొత్తకోటకు చెందిన సబిరెడ్డి తరుణ్‌రెడ్డి రెండో ర్యాంకు సాధించాడు.
‘గ్రూప్-1 సాధనే నా లక్ష్యం..’ ఫస్ట్ ర్యాంకర్ శ్రీరాం శివకృష్ణ
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 జనరల్ ర్యాంకు మెరిట్ జాబితాలో రాష్ట్ర స్థాయిలో కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్‌కు చెందిన శ్రీరాం శివకృష్ణ మొదటి స్థానంలో నిలిచారు. శ్రీరాం సత్యనారాయణ-వాణిశ్రీ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో శ్రీరాం శివకృష్ణ పెద్దవాడు. బాసర ట్రిపుల్ ఐటీలో ఈఈఈలో బీటెక్ పూర్తి చేసిన శ్రీరాం అనంతరం ఏడాదిపాటు ఇన్ఫోసిస్‌లో పనిచేశారు. ప్రభుత్వ కొలువు సాధించాలనే లక్ష్యంతో ఉద్యోగాన్ని వదిలేసి.. ఇంట్లో గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. గతేడాది జరిగిన గ్రూప్-1 పరీక్షలో మెయిన్స్‌కు ఎంపికయ్యారు. కానీ పరీక్ష రద్దు అయ్యింది. అయినా నిరాశ చెందకుండా ఇతర పరీక్షలపై దృష్టి సారించారు. సింగరేణిలో ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్షకు హాజరై రాష్ట్ర స్థాయిలో శ్రీరాం 12వ ర్యాంకు సాధించాడు. దీంతో కాసిపేట సింగరేణి గనిలో గత కొంత కాలంగా విధులు నిర్వహిస్తున్నాడు. ఉద్యోగం చేస్తూనే గ్రూప్-4కు సిద్ధమై పరీక్ష రాశాడు. తాజాగా విడుదలైన గ్రూప్ 4 ఫలితాల్లో మొత్తం 300 మార్కులకుగాను 220.458 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచాడు. ఇంటర్ నెట్ ద్వారా యూట్యూబ్ వంటి పలు సామాజిక మాధ్యమాల్లో అవసరమైన సమాచారాన్ని సేకరించుకుంటూ పరీక్షలకు సిద్ధమయ్యానని శ్రీరాం చెబుతున్నాడు. గ్రూప్-1 సాధించాలనేదే తన లక్ష్యమని మీడియాకు తెలిపాడు.
రెండో ర్యాంకు సాధించిన సబిరెడ్డి తరుణ్‌రెడ్డి విజయగాథ
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 ఫలితాల్లో కొత్తకోటకు చెందిన సబిరెడ్డి తరుణ్‌రెడ్డి రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంక్ సాధించాడు. మొత్తం 300 మార్కులకు గాను 219 మార్కులు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. గతేడాది ప్రకటించిన ఎస్సై ఫలితాల్లోనూ రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించి సత్తా చాటాడు. తరుణ్‌రెడ్డి తల్లిదండ్రులు నారాయణమ్మ, వెంకట్రెడ్డి. వీరి ప్రోత్సాహంతో ర్యాంకు సాధించినట్లు మీడియాకు చెప్పాడు. గ్రూపు-1 లక్ష్యంగా పరీక్షలకు సన్నద్ధమవుతున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పోలీస్ అకాడమీలో తరుణ్‌రెడ్డి ఎస్సైగా శిక్షణ పొందుతున్నాడు.
మరిన్ని విద్యా, ఉద్యోగ సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.