TS Polycet 2024 Exam Date: తెలంగాణ పాలిసెట్ దరఖాస్తు గడువు పెంపు.. కొత్త పరీక్ష తేదీ ఇదే
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష ‘పాలిసెట్-2024’ తేదీని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ, శిక్షణ మండలి ప్రకటించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 17న పాలీసెట్ పరీక్ష జరగాల్సి ఉండగా.. ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు. తాజా ప్రకటన ప్రకారం మే 24న పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ, శిక్షణ మండలి కార్యదర్శి ఏ పుల్లయ్య..
హైదరాబాద్, ఏప్రిల్ 25: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష ‘పాలిసెట్-2024’ తేదీని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ, శిక్షణ మండలి ప్రకటించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 17న పాలీసెట్ పరీక్ష జరగాల్సి ఉండగా.. ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు. తాజా ప్రకటన ప్రకారం మే 24న పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ, శిక్షణ మండలి కార్యదర్శి ఏ పుల్లయ్య వెల్లడించారు.
కాగా పాలీసెట్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఏప్రిల్ 22వ తేదీతో ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముగియగా.. దానిని ఏప్రిల్ 28వ తేదీకి పొడిగించారు. రూ.100 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 30 వరకు, రూ.300 ఆలస్య రుసుంతో మే 20 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని రాష్ట్ర సాంకేతిక విద్యాశిక్షణ మండలి సూచించింది. వచ్చే నెల 24న పరీక్షలు నిర్వహించి, అనంతరం పది రోజుల తర్వాత ఫలితాలను కూడా వెల్లడిస్తామని తెలిపింది.
కాగా ఈ ఏడాది నిర్వహిస్తోన్న తెలంగాణ పాలీసెట్ 2024 ప్రవేశ పరీక్ష ద్వారా పీవీ నరసింహరావు తెలంగాణ పశువైద్య యూనివర్సిటీలోని పశుసంవర్థన – మత్స్య పరిశ్రమకు సంబంధించిన కోర్సుల్లో, కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన యూనివర్సిటీలోని ఉద్యానవన డిప్లొమా కోర్సులు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీలోని వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ మేరకు అభ్యర్ధులు గమనించాలని బోర్డు సూచించింది. ఈ విషయాన్ని అధికారిక నోటిఫికేషన్‌లో కూడా ఇప్పటికే స్పష్టం చేసింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.