TS Police Recruitment 2022: పోలీసు ఉద్యోగాలకి గట్టి పోటీ.. ఒక్క రోజే 4.50 లక్షల దరఖాస్తులు..!
TS Police Recruitment 2022: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1, పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మే 2 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే.
TS Police Recruitment 2022: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1, పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మే 2 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రభుత్వం మొత్తం 16,614 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇందులో కానిస్టేబుల్ పోస్టులు 16,027 (సివిల్ కానిస్టేబుళ్లు 4,965, ఏఆర్ కానిస్టేబుళ్లు 4,424, టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్ కానిస్టేబుళ్లు 5,010, స్పెషల్ పోలీస్ ఫోర్స్ 390, ఫైర్ 610, డ్రైవర్స్ 100 పోస్టులున్నాయి).. ఎస్ఐ పోస్టులు 587 ఉన్నాయి. అయితే మొదట్లో దరఖాస్తులు కొద్దిగానే వచ్చాయి కానీ చివరితేదీ దగ్గరపడేకొద్దీ లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి.
శుక్రవారం ఒక్కరోజే 4.50 లక్షల దరఖాస్తులు వచ్చాయని రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. వాటిలో లక్ష వరకు మహిళా అభ్యర్థుల దరఖాస్తులున్నట్లు తెలిపింది. 6 శాతం ఓసీ, 53 శాతం బీసీ, 23 శాతం ఎస్సీ, 19 శాతం ఎస్టీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొంది. 2/3 శాతం మంది అభ్యర్థులు తెలుగు మాధ్యమంలో, 1/3 శాతం మంది అభ్యర్థులు ఆంగ్ల మాధ్యమంలో పరీక్ష రాసేందుకు ఆప్షన్ ఎంచుకున్నట్లు నియామక మండలి వెల్లడించింది. ఈ నెల 20వ తేదీన దరఖాస్తుల గడువు ముగియనుంది. దరఖాస్తుల గడువును పెంచేది లేదని పోలీసు నియామక మండలి చెప్పిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి మరో రెండేళ్ల వయోపరిమితి పెంచాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడేళ్లు వయోపరిమితి పెంచిన ప్రభుత్వం మరో 2 ఏళ్లు పెంచుతుందా లేదా తెలియడం లేదు. పోలీస్ రిక్రూట్ మెంట్ గత నోటిఫికేషన్లలో ఫైర్, జైల్‌వార్డెన్, ఎక్సైజ్, ఢిప్యూటి జైలర్ వంటి పోస్టులకి వయసు ఎక్కువగానే ఉండేది. ఇప్పుడు వాటిని కూడా తగ్గించి బోర్డు నోటిఫికేషన్ జరీ చేసింది. దీంతో నిరుద్యోగులు మరో రెండేళ్లు వయసు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి