Inter Supply Results 2025: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాల్లోనూ ఫెయిలైతే ఏం చేయాలి? ఈ డౌట్ మీకూ ఉందా..
ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లో 50.82 శాతం ఉత్తీర్ణ నమోదైంది. మొత్తం 4,13,880 మంది విద్యార్ధులు సప్లిమెంటరీ పరీక్షలు రాయగా.. ఇందులో ఫస్ట్ ఇయర్‌లో 2,49,358 మంది పరీక్షలు రాస్తే.. అందులో 1,68,079 మంది అంటే 67.4 శాతం ఉత్తీర్ణత..

హైదరాబాద్, జూన్ 16: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లో 50.82 శాతం ఉత్తీర్ణ నమోదైంది. మొత్తం 4,13,880 మంది విద్యార్ధులు సప్లిమెంటరీ పరీక్షలు రాయగా.. ఇందులో ఫస్ట్ ఇయర్‌లో 2,49,358 మంది పరీక్షలు రాస్తే.. అందులో 1,68,079 మంది అంటే 67.4 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్‌లో 1,35,107 మంది పరీక్షలు రాయగా.. వీరిలో 68,665 మంది అంటే 50.82 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. తాజా ఫలితాల్లో ఇంటర్ సెకండ్ ఇయర్‌లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా 88.64 శాతంతో అత్యధిక ఉత్తీర్ణత సాధించి తొలి స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్‌లోనూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా 83.45 శాతం ఉత్తీర్ణతతో తొలి స్థానంలో నిలిచింది.
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 ఇక్కడ చెక్ చేసుకోండి.
రేపట్నుంచి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తులు..
ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. తాజా ఫలితాల్లో విద్యార్ధులకు తమ మార్కుల విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 17 నుంచి జూన్ 23, 2025వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.100 చొప్పున విద్యార్ధులు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రీవెరిఫికేషన్‌తోపాటు స్కాన్ కాఫీ పొందుకు ఒక్కో సబ్జెక్టుకు రూ.600 చెల్లించవల్సి ఉంటుంది.
ఈ సారి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో ఉత్తీర్ణత భారీగా పెరిగినట్లు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. ఫస్టియర్, సెకండియర్ రెండింటిలోనూ ఉత్తీర్ణత శాతం పెరిగింది. ఈ సారి ఫస్టియర్లో 67.4 శాతం ఉత్తీర్ణత నమోదుకాగా.. 2024లో 63.86శాతం, 2023లో 62.58 శాతం విద్యార్థులు పాసయ్యారు. ఇక సెకండియర్‌లో ఈ సారి 50.82 శాతం పాసైతే.. 2024లో 43.77 శాతం, 2023లో 46.06 శాతం పాసైనట్లు ఇంటర్ బోర్డు తెలిపింది.
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో ఫెయిలైతే ఏం చేయాలి?
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో కూడా ఫెయిల్ అయిన విద్యార్ధులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకుని మళ్లీ మరోమారు సమాధాన పత్రాలను వెరిఫై చేయవచ్చు. ఒకవేళ ఇందులోనూ ఫెయిల్ అయితే.. నిరుత్సాహ పడకుండా వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు రాసి చక్కగా పాస్ అవ్వొచ్చు. అప్పటి వరకు ట్యూషన్ లేదా ఇంట్లోనే ప్రిపరేషన్ సాగిస్తే తప్పక పాస్ అవుతారు. ఇక ఫస్ట్ ఇయర్ విద్యార్ధులు కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినప్పటికీ.. సెకండ్ ఇయర్ కొనసాగించవచ్చు. 2026 మార్చిలో జరిగే సెకండ్ ఇయర్ పరీక్షలతోపాటు ఫస్ట్ ఇయర్ ఫెయిలైన సబ్జెక్టులకు పరీక్షలు రాసి పాస్ కావొచ్చు. ఫెయిలైనందుకు ఎవరూ అధైర్యపడవద్దు. ఎవరో ఎగతాళి చేస్తున్నారని తొందరపడి ప్రాణాలు తీసుకోవద్దు. అలాంటి వారికి సరైన బుద్ధి చెప్పాలంటే.. మీరు 2026 మార్చిలో జరిగే ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో అన్ని సబ్జెక్టులు క్లియర్ చేసి చూపించాలి. అదే నిజమైన గెలుపు..!
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




