TREIRB Results 2024: తెలంగాణ గురుకుల టీచర్ పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల.. ఒక్క క్లిక్‌తో డౌన్‌లోడ్ చేసుకోండి

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రిజర్వేషన్ల అమలుపై కోర్టులో న్యాయ వివాదం ముగిసింది. దీంతో గురుకుల నియామక ప్రక్రియకు ఉన్న అడ్డంకులన్నీ తొలగి పోయినట్లైంది. గురుకుల టీచర్‌ పోస్టులకు నిర్వహించిన పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్‌ జాబితాలను గురుకుల నియామక బోర్డు బుధవారం (ఫిబ్రవరి 7) ప్రకటించింది..

TREIRB Results 2024: తెలంగాణ గురుకుల టీచర్ పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల.. ఒక్క క్లిక్‌తో డౌన్‌లోడ్ చేసుకోండి
TREIRB Results
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 08, 2024 | 3:35 PM

హైదరాబాద్‌, ఫిబ్రవరి 8: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రిజర్వేషన్ల అమలుపై కోర్టులో న్యాయ వివాదం ముగిసింది. దీంతో గురుకుల నియామక ప్రక్రియకు ఉన్న అడ్డంకులన్నీ తొలగి పోయినట్లైంది. గురుకుల టీచర్‌ పోస్టులకు నిర్వహించిన పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్‌ జాబితాలను గురుకుల నియామక బోర్డు బుధవారం (ఫిబ్రవరి 7) ప్రకటించింది. అధికారిక వెబ్‌సైట్‌ లో అభ్యర్ధులు తమ వివరాలు నమోదు చేసి మెరిట్‌ జాబితాను చెక్‌ చేసుకోవచ్చు. కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీకిగానూ గతేడాది ఒకేసారి 9 నోటిఫికేషన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల కోసం దాదాపు 2.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

గతేడాది ఆగస్టు నెలలో నెలరోజుల పాటు ఆన్‌లైన్‌ విధానంలో రాత పరీక్షలు నిర్వహించింది. ఆ తర్వాత వెనువెంటనే ప్రాథమిక, తుది ఆన్సర్‌ ‘కీ’లను బోర్డు వెల్లడించింది. అప్పుడే ఫలితాలు వెల్లడించాల్సి ఉండగా సమాంతర రిజర్వేషన్లపై కోర్టులో న్యాయ వివాదం నమోదైంది. దీంతో కొంత కాలయాపన జరిగింది. మంగళవారంతో కోర్టు వివాదం ముగిసింది. ప్రత్యక్ష నియామకాల్లో మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్‌ పాయింట్‌ను మార్కు చేయకుండా ఓపెన్‌, రిజర్వుడు కేటగిరీల్లో 33 1/3 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని కోర్టు తీర్పు వెలువరించింది. న్యాయ వివాదం ముగియడంతో మెరిట్‌ జాబితాలను బోర్డు వెల్లడించింది. సంక్షేమ గురుకులాల సొసైటీ పరిధిలోని డిగ్రీ, జూనియర్‌ కాలేజీలు, పాఠశాలల్లో లైబ్రేరియన్లు, ఫిజికల్‌ డైరెక్టర్ల పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు 1 : 2 నిష్పత్తితో జాబితాను ప్రకటించింది.

ఈ రోజు (ఫిబ్రవ‌రి 8) పోస్టుగ్రాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ) పోస్టులకు మెరిట్‌ జాబితా వెలువడే అవకాశం ఉంది. మరోవైపు నోటిఫికేషన్‌లోని కొన్ని పోస్టులకు 9, 10వ తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తిచేయాలని బోర్డు భావిస్తోంది. డెమో తరగతులు పూర్తిచేసిన తర్వాత మాత్రమే లైబ్రేరియన్లు, ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులకు ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంటుంది. ఈ పోస్టులకు 10, 11, 12 తేదీల్లో డెమో తరగతులు పూర్తిచేయాలని బోర్డు నిర్ణయించింది. ఈ ప్రక్రియ మొత్తం 3 రోజుల్లోనే అంటే ఫిబ్రవరి 13 నాటికి పూర్తిచేసేందుకు వీలుగా 13 డెమో తరగతుల మూల్యాంకన బోర్డులను నియమించింది. అంతా సకాలంలో పూర్తైతే ఫిబ్రవరి 14న ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మెరిట్ లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.