TG CETs 2025: ఆ 7 ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు మారిన వర్సిటీలు, కన్వీనర్లు.. ఇకపై ఐసెట్ బాధ్యతలు MGUకి
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించనున్న పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతల్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. గత ఏడాది ఐసెట్ నిర్వహించిన కాకతీయ యూనివర్సిటీ అక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందడంతో ఈ మేరకు ఉన్నత విద్యా మండలి దిద్దుబాటు చర్యలకు పూనుకుంది..
హైదరాబాద్, డిసెంబర్ 18: తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతల్లో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. వివిధ ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈఏపీసెట్, పీజీఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్, ఈసెట్, పీఈసెట్.. ఈ ఏడు ప్రవేశ పరీక్షలు చాలా కీలకం. అయితే తెలంగాణ ఉన్నత విద్యామండలి వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ ప్రవేశ పరీక్షల నిర్వహణ మాధ్యతల్లో స్వల్ప మార్పులు చేసింది. ప్రతీయేట ఒక్కో యూనివర్సిటీకి ఒకట్రెండు ప్రవేశ పరీక్షల బాధ్యతలు అప్పగిస్తోన్న సంగతి తెలిసిందే. ఈసారి ఆ బాధ్యతలను చూసే 3 యూనివర్సిటీలతోపాటు ముగ్గురు కన్వీనర్లను సైతం మార్చుతూ ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి మంగళవారం ప్రకటన జారీ చేశారు.
కాకతీయ యూనివర్సిటీ (కేయూ)ని ఐసెట్ నిర్వహణ బాధ్యతల నుంచి తొలగించి ఎడ్‌సెట్‌ను అప్పగించింది. అలాగే ఐసెట్‌ను తొలిసారిగా మహాత్మాగాంధీ వర్సిటీ (ఎంజీయూ)కి కేటాయించారు. అలాగే ఇప్పటివరకు ఏ ఒక్క ప్రవేశ పరీక్షనూ నిర్వహించని పాలమూరు యూనివర్సిటీకి ఫిజికల్ ఎడ్యుకేషన్ (పీఈ) సెట్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఇక ఈ పరీక్షలన్నీ వచ్చే ఏడాది మే నెలలో జరిగే అవకాశమున్నట్లు తెలుస్తుంది. కాగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఐసెట్ నిర్వహణ బాధ్యతలు కేయూనే చూస్తోంది. ఐసెట్ 2024కు సంబంధించి ఆదాయ, వ్యయాల వివరాలు బయటకు పొక్కడంతో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ఆ బాధ్యతల నుంచి కేయూని తొలగించి తాజాగా ఎంజీయూకి అప్పగించారు. దీంతో ఆ యూనివర్సిటీ ప్రస్తుతం రిజిస్ట్రార్‌గా కొనసాగుతున్న ప్రొఫెసర్ అలువాల రవిని కన్వీనర్‌గా నియమించారు.
తెలంగాణ సెట్లు, కన్వీనర్లు వీరే..
- టీజీ ఎప్‌సెట్ 2025– ప్రొఫెసర్ బీ డీన్ కుమార్ ( జేఎన్‌టీయూ హెచ్)
- టీజీ పీజీసెట్ 2025– ప్రొఫెసర్ అరుణ కుమారి ( జేఎన్‌టీయూహెచ్)
- టీజీ ఐసెట్ 2025– ప్రొఫెసర్ అలువాల రవి (మహాత్మా గాంధీ యూనివర్సిటీ)
- టీజీ ఈసెట్ 2025– ప్రొఫెసర్ పీ చంద్రశేఖర్ (ఉస్మానియా యూనివర్సిటీ)
- టీజీ లాసెట్, టీజీ పీజీఎల్‌సెట్ 2025– ప్రొఫెసర్ బీ విజయలక్ష్మీ (ఉస్మానియా యూనివర్సిటీ)
- టీజీ ఎడ్‌సెట్ 2025– ప్రొఫెసర్ బీ వెంకట్రామ్ రెడ్డి (కాకతీయ యూనివర్సిటీ)
- టీజీ పీఈసెట్ 2025– ప్రొఫెసర్ ఎన్ఎస్ దిలీప్ (పాలమూరు యూనివర్సిటీ)