AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓరి వీడి యేషాలో.. హోంమంత్రి మనిషినని TTD సిబ్బందికే పంగనామాలు! స్కెచ్ మామూలుగా లేదుగా

తిరుమల తిరుపతి దేశస్థానానికి నిత్యం లక్షలాది మంది భక్తులు శ్రీవారి దర్శనానికి బారులు తీరి గంటల తరబడి లైన్లలో వేచి ఉండి చివారకరికి దర్శనం చేసుకుని వెళ్తుంటారు. అయితే కొందరు ప్రముఖులు మాత్రం వీఐపీ టికెట్ల ద్వారా త్వరగా దర్శనం ముగించుకుంటారు. ఓ కేటుగాడు అధికారుల కళ్లుగప్పి సాధారణ భక్తులకు వీఐపీ టికెట్లను సంతలో కూరగాయలు అమ్మినట్లు అమ్మి కటకటాల పాలయ్యాడు..

ఓరి వీడి యేషాలో.. హోంమంత్రి మనిషినని TTD సిబ్బందికే పంగనామాలు! స్కెచ్ మామూలుగా లేదుగా
Tirupati Balaji Temple
Srilakshmi C
|

Updated on: Dec 17, 2024 | 7:53 PM

Share

తిరుపతి, డిసెంబర్‌ 17: తిరుమల శ్రీవారి దర్శనానికి ఓ ప్రబుద్ధుడు ఆడిన నాటకం బాగా రక్తికట్టింది. కానీ చివరికి దొరికిపోయి కటకటాల పాలయ్యాడు. ఏకంగా హోంమంత్రి ఫొటోను ఉపయోగించి టీటీడీ అధికారులను సైతం పలుమార్లు బోల్తా కొట్టించాడు. భక్తులకు వీఐపీ పాస్‌లను సంతలో కూరగాయలు అమ్మినట్లు అమ్మి.. భక్తుల నుంచి డబ్బులు దండుకోసాగాడు. తీరా అధికారులు ఆరా తీయడంతో అసలు బండారం బయటపడింది. దీంతో టీటీడీ పోలీసులు సదరు నకిలీ వ్యక్తిని సోమవారం అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

నిందితుడిని బెంగళూరులోని యలహంకకు చెందిన మారుతీ పవార్‌గా గుర్తించారు. నిందితుడు గత కొన్ని నెలలుగా ఈ మోసానికి పాల్పడుతున్నట్లు తుమకూరు పోలీసు సూపరింటెండెంట్ కేవీ అశోక్ తెలిపారు. తిరుపతి దేవస్థానానికి వీఐపీ పాస్ గురించి ఆరా తీస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో స్పెషల్ డ్యూటీ అధికారి కె నాగన్నకు అనుమానం వచ్చింది. నిందితులు గతంలోనూ పలుమార్లు సీఎం కార్యాలయం నుంచి వీఐపీ పాస్‌లు కోరారని, అయితే ఈసారి తనకు ఫోన్ చేసి వివరణ కోరగా మోసం బయటపడిందని తెలిపారు.

నిందితులు హోంమంత్రి చిత్రాన్ని తమ వాట్సాప్ డిస్‌ప్లే ఇమేజ్‌గా పెట్టుకుని, హోంమంత్రి మనిషిగా నటిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రదించారని ఆయన తెలిపారు. ఆలయానికి వీఐపీ పాస్‌లు పొందేందుకు సీఎం కార్యాలయానికి వాట్సాప్ ద్వారా మంత్రి సంతకాలతో కూడిన నకిలీ లెటర్‌హెడ్‌లను సైతం పంపినట్లు తెలిపారు. ఇలా వచ్చిన పాస్‌లతో ఆలయానికి వచ్చే భక్తుల నుంచి నిందితులు రూ.6 వేల నుంచి రూ. పది వేల వరకు వసూలు చేశారని ఆయన తెలిపారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు వీఐపీ పాస్‌లు జారీ చేసి డబ్బు వసూలు చేస్తూ నెలల తరబడి మోసాలకు పాల్పడినట్లు తెలిపారు. టీటీడీ అధికారి నాగన్న ఫిర్యాదుతో నిందితుడు మారుతీ పవార్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాకుండా మోసం బయటపడటంతో మారుతి తనను బెదిరించాడని, ఈ విషయం బయటపెడితే చంపేస్తానని నాగన్న తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇలా చేయమని హోం శాఖ మంత్రే తనకు చెప్పాడని నోటికొచ్చిన అబద్దాలన్నీ చెప్పాడు. ఈ విషయం బయటపెట్టకుండా ఉండేందుకు తనకు రూ. 2 లక్షల లంచం ఆఫర్ చేశాడని, తన మాట వినకుంటే నాగన్నను జైలుకు పంపుతానని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు .

ఇవి కూడా చదవండి

పోలీసులు నిందితుడిని తుమకూరు JMFC కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు అతడికి ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీ విధించింది. ఈ రాకెట్ వెనుక ఎంతమంది ఉన్నారన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.