వీడెవడండీ బాబు.. జాబ్ చేయడం ఇష్టంలేక ఏకంగా చేతి వేళ్లు నరికేసుకున్నాడు! ఎక్కడంటే..
ఉద్యోగం చేయడం ఇష్టం లేదని ఎవరికీ చెప్పే ధైర్యంలేదు ఆ ఉద్యోగికి. దీంతో కష్టంగా ఇన్నాళ్లు ఎలాగోలా లాక్కొచ్చాడు. కానీ చేస్తున్న జాబ్ నుంచి తప్పించుకోలేకపోయాడు. చిన్న చిన్న ఎత్తులు సరిపోవని అనుకున్నాడో.. ఏమో.. పెద్ద ప్లానే వేశాడు. అందుకు ఏకంగా తన చేతులతో తానే చేతి వేళ్లను నరికేసుకున్నాడు. పని చేయడం ఇష్టం లేకపోతే అక్కడి నుంచి పారిపోవాలి గానీ ఇదెక్కడి అగాయిత్యం అంటూ బంధువులు లబోదిబోమంటున్నారు.
సూరత్, డిసెంబర్ 16: నేటి కాలంలో యువత ఎదుర్కోంటున్న ప్రధాన సమస్యల్లో ఒత్తిడి ఒకటి. దీని మాయలో ఎందరో యువత తొందరపాటు నిర్ణయాలు తీసుకుని జీవితానికి చరమగీతం పాడుతున్నారు. తాజాగా ఓ ఉద్యోగి ఉద్యోగంలో ఒత్తిడిని తట్టుకోలేక ఏకంగా చేతి వేళ్లను తానే నరికేసుకున్నాడు. వారం రోజుల క్రితం సూరత్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే..
గుజరాత్‌లోని సూరత్ నగరంలోని ఓ నగల దుకాణంలో మయూర్ తారాపరా (32) అనే వ్యక్తి తన బంధువులకు చెందిన డైమండ్ కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అయితే అతడు గత కొన్ని రోజులుగు వర్క్ స్ట్రెస్‌తో సతమతం అవుతున్నాడు. దీంతో తాను చేస్తున్న పని నుంచి తప్పించుకోవడానికి ఏకంగా తన ఎడమ చేతి నాలుగువేళ్లు నరికేసుకున్నాడు. దీంతో అతడు రోడ్డు పక్కన స్పృహ తప్పి పడిపోయాడు. ఇలా చేతి వేళ్లు లేకపోతే కంప్యూటర్ ఆపరేట్ చేయడానికి అతడ్ని అనర్హులుగా పరిగణిస్తారన్న ఉద్దేశ్యంతో సదరు యువకుడు ఈ ప్లాన్ వేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అతడిని హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. స్పృహలోకి వచ్చా తనపై దాడి జరిగిందని తొలుత పోలీసులను నమ్మించేయత్నం చేశాడు. దీంతో కేసు విచారణ ఓ పజిల్‌గా మారింది. క్రైమ్ బ్రాంచ్ రంగంలోకి దిగగా అసలు విషయం బయటకు వచ్చింది.
స్థానికంగా ఉండే ఓ దుకాణంలో పదునైన స్టీల్ కత్తిని కొనుగోలు చేసిన సంగతి తెలుసుకున్న పోలీసులు అతడి చెబుతున్న విషయంపై అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత తమదైన రీతిలో విచారించగా చివరికి నిజం ఒప్పుకున్నాడు. సింగన్‌పూర్‌లోని చార్ రాస్తా సమీపంలోని ఓ దుకాణంలో పదునైన కత్తి కొన్న నాలుగు రోజుల తర్వాత ఆదివారం రాత్రి అమ్రోలి రింగ్‌రోడ్డుకు వెళ్లి అక్కడ తన మోటార్‌సైకిల్‌ను పార్క్ చేశాడు. రాత్రి 10 గంటల సమయంలో నాలుగు వేళ్లను నరికేసుకున్నాడు. కత్తితోపాటు, రక్త ప్రవాహాన్ని ఆపేందుకు మోచేతి దగ్గర కట్టిన తాడు, వేళ్లను ఒక సంచిలో ఉంచి అక్కడి నుంచి విసిరేశాడు. నగల దుకాణం యజమాని తన తండ్రికి దగ్గరి స్నేహితుడు అయినందున, ఉద్యోగంలో చేరానని.. అక్కడ పనిచేయడం తనుకు ఇష్టంలేదని ఎవరికీ చెప్పే ధైర్యంలేక దీని నుంచి తప్పించుకోవడానికి చేతి వేళ్లు కోసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్టు అతడు వివరించాడు. కాగా తారాపరాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతంలో తన స్వగ్రామంలో ఉన్నప్పుడు నెలకు రూ.50 వేలు సంపాదించేవాడని పోలీసుల విచారణలో తేలింది.