Monkeypox Case: వామ్మో మహమ్మారి వచ్చేసింది.. రెండో కేసు కూడా కన్ఫార్మ్! ఈ లక్షణాలు కన్పిస్తే అలసత్వం వద్దు
విదేశాల్లో కలకలం రేపిన మంకీఫాక్స్ ఇప్పుడు దేశంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే రెండు కేసులు కన్ఫర్మ్ అయ్యాయి. దీంతో దేశంలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ కింది లక్షణాలు కన్పిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని ఆస్పత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు..
కన్నూర్, డిసెంబర్ 16: దేశంలో మళ్లీ మంకీఫాక్స్ వ్యాధి నిర్ధారణ అయింది. అబుదాబి నుంచి వచ్చిన వాయనాడ్‌కు చెందిన వ్యక్తికి ఈ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. వెంటనే అతన్ని పరియారం మెడికల్ కాలేజీలో చేర్పించారు. ఇదిలా ఉండగా తాజాగా మరో వ్యక్తికి మంకీఫాక్స్ నిర్ధారనైంది. దుబాయ్ నుంచి వచ్చిన మరో వ్యక్తిలో కూడా అదే లక్షణాలు కనిపించాయి. అతని రక్త నమూనాను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు తరలించారు.
ఎంపాక్స్ అంటే ఏమిటి?
మంకీపాక్స్ అనే ఈ వైరస్ పేరు ఎంపాక్స్ నుంచి వచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ జాత్యహంకార ఆరోపణలు, అపార్థానికి అవకాశం ఉన్నందున దాని పేరును ఇలా మార్చింది. ఎంపాక్స్ అనే వైరస్ జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధి. ఈ వ్యాధి ఎక్కువగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాలో కనిపిస్తుంది. ఎంపాక్స్ లక్షణాలు మశూచిని పోలి ఉంటాయి. ఎంపాక్స్ మొదటిసారిగా 1970లో కాంగోలోని 9 ఏళ్ల బాలుడిలో తొలిసారి కనుగొన్నారు.
వ్యాధి ఎలా సంక్రమిస్తుంది?
ఎంపాక్స్ సాధారణంగా జంతువుల రక్తం , శరీర ద్రవాల ద్వారా, ప్రత్యక్ష కంటాక్ట్ ద్వారా మానవులకు వ్యాపిస్తుంది. వివిధ రకాల కోతులు, ఉడుతలు, ఎలుకలతో సహా జంతువులలో ఎంపాక్స్ వైరస్ సంక్రమణ కనుగొనబడింది. వ్యాధి సోకిన వ్యక్తితో ముఖాముఖి మాట్లాడటం, నేరుగా చర్మాన్ని తాకడం, లైంగిక సంపర్కం, మంచం, దుస్తులను తాకడం, భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం మొదలైన వాటి ద్వారా సంక్రమణ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
లక్షణాలు
ఎంపాక్స్ ప్రారంభ లక్షణాలు జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వెన్నునొప్పి, కండరాల నొప్పి, శక్తి లేకపోవడం. జ్వరం వచ్చిన 13 రోజులకే శరీరంపై మశూచిని పోలిన పొక్కులు రావడం ప్రారంభమవుతుంది. ముఖం, చేతులపై బొబ్బలు ఎక్కువగా కనిపిస్తాయి. అవి అరచేతులు, జననేంద్రియాలు, కండ్లకలక, కార్నియాపై కూడా కనిపిస్తాయి. ఎంపాక్స్ ఇంక్యుమేషన్ పీరియడ్ ఆరు నుండి 13 రోజులు. కొన్ని సందర్భాల్లో ఇది ఐదు నుండి 21 రోజుల వరకు ఉంటుంది. ఎంపాక్స్ లక్షణాలు రెండు నుంచి నాలుగు వారాల వరకు ఉంటాయి. కానీ ఈ వ్యాధికి మరణాల రేటు సాధారణంగా తక్కువగా ఉంటుంది.
నివారణ ఎలా?
ఎంపాక్స్ సోకిన వ్యక్తులతో ప్రత్యక్షంగా సంబంధం కలిగి ఉండకూడదు. సిఫార్సు చేయబడిన అన్ని భద్రతా చర్యలను పాటించాలి. జబ్బుపడిన వ్యక్తులతో సన్నిహితంగా ఉండే వ్యక్తులు ఎంపాక్స్ వ్యాధికి త్వరగా గురవుతారు. అనుమానిత లేదా ధృవీకరించబడిన వైరస్ ఇన్‌ఫెక్షన్ ఉన్న రోగులను చూసుకునే ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, వ్మాధి సోకిన వ్యక్తి స్రావాలను నిర్వహించే వారు సంక్రమణను నివారించడానికి సూచించిన అన్ఇన ఇన్‌ఫెక్షన్ నియంత్రణ జాగ్రత్తలు తీసుకోవాలి.