TG TET 2025 Results: తెలంగాణ టెట్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే
తెలంగాణలో టెట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యాశాఖ కార్యదర్శి యోగిత ఫలితాలు విడుదల చేశారు. మొత్తం టెట్ ఫలితాల్లో 42,384 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. అంటే 31.21 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో టెట్ ఫలితాలు వాయిదే వేస్తున్నట్లు తొలుత ప్రకటించినప్పటికీ..

హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణ టెట్ ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా బుధవారం విడుదల చేశారు. తొలుత టెట్ ఫలితాలను విడుదల చేసేందుకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డొస్తుందని భావించినప్పటికీ.. ఇప్పటికే ఎగ్జామ్ పూర్తయినందున ఎలాంటి అడ్డంకులు లేవని భావించిన విద్యాశాఖ బుధవారం సాయంత్రం ఫలితాలు విడుదల చేసింది. జనవరి 2 నుంచి జనవరి 20 వరకు 20 సెషన్స్ లో జరిగిన టెట్ పరీక్షల్లో 1,35,82 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 42,384 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు.
టెట్ ఫలితాల్లో 31.21 శాతం ఉత్తీర్ణత నమోదు అయినట్లు ఫలితాల ప్రకటనలో వెల్లడించారు. పేపర్ -1 లో 69, 476 మంది పరీక్ష రాస్తే 41 ,327 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. పేపర్ 2 లో మ్యాథ్స్ అండ్ సైన్స్ లో 69,390 మంది పరీక్ష రాస్తే 23,755 మంది ఉత్తీర్ణత సాధించారు. సోషల్ స్టడీస్ పేపర్ లో 66,412 మంది ఎగ్జామ్ రాస్తే 18,629 మంది ఉత్తీర్ణత సాధించారు. పేపర్ 1 అండ్ 2 లో కలిపి 1,35,802 మంది పరీక్షలు రాస్తే 42,384 మంది ఉత్తీర్ణత సాధించారు. టెట్ ఫలితాలను స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్ సైట్ లోను అందుబాటులో ఉంచారు.
తెలంగాణ టెట్ 2025 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాగా ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహిస్తామని హామీ ఇచ్చిన రేవంత్ సర్కార్ ఆ మేరకు గతేడాది రెండు సార్లు టెట్ నిర్వహించింది. 2024 డిసెంబర్ సెషన్ కు సంబంధించిన పరీక్షలు నిర్వహించగా.. దీని ఫలితాలు ఈ రోజు వెల్లడించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.