Hyderabad: ఆడుకుంటున్న చిన్నారిని ఈడ్చుకెళ్లిన వీధికుక్కలు.. ఎక్కడోకాదు మన సిటీలోనే..! వీడియో

గతేడాది వరుస దాడులతో హడలెత్తించిన వీధికుక్కలు మళ్లీ దాడులకు తెగబడుతున్నాయి. తాజాగా ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిని రెండు వీధి కుక్కలు దారుణంగా దాడిచేసి, కాలుపట్టి ఈడ్చుకెళ్లిన ఘటన హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లోని గోల్డెన్‌ హైట్స్‌ కాలనీలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది..

Hyderabad: ఆడుకుంటున్న చిన్నారిని ఈడ్చుకెళ్లిన వీధికుక్కలు.. ఎక్కడోకాదు మన సిటీలోనే..! వీడియో
Stray Dogs Attack On 4 Year Old Girl
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 03, 2025 | 1:20 PM

హైదరాబాద్, ఫిబ్రవరి 3: ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిని రెండు వీధి కుక్కలు అత్యంత దారుణంగా దాడిచేసి, కాలుపట్టి ఈడ్చుకెళ్లిన ఘటన హైదరాబాద్‌లో శుక్రవారం (జనవరి 31) చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే..

తెలంగాణలోని హైదరాబాద్‌లో నగరంలో రాజేంద్రనగర్‌లోని గోల్డెన్‌ హైట్స్‌ కాలనీలోని ఇంటి ముందు రోడ్డుపై ఆరుబయట ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిపై ఒక్కసారిగా రెండు వీధి కుక్కలు దాడికి తెగబడ్డాయి. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదుగానీ ఆ రెండు కుక్కలు రోడ్డుపై ఉన్న చిన్నారిపై విరుచుకుపడ్డాయి. భయంతో చిన్నారి గట్టిగట్టిగా అరచినప్పటికీ అవి చిన్నారిని వదలేదు. పైగా బాలిక కాలుపట్టి రోడ్డుపై కొంత దూరం ఈడ్చుకెళ్లాయి. బాలిక అరుపులు విన్న తల్లి పరుగు పరుగున వచ్చి వీధికుక్కలను అదిలించడంతో అవి అక్కడనుంచి పారిపోయాయి. ఈ ఘటనలో చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఇందుకు సంబంధించిన వీడియో సమీపంలోని ఓ ఇంటి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

ఇవి కూడా చదవండి

సీసీటీవీ ఫుటేజీ ప్రకారం శుక్రవారం ఉదయం 7 గంటలకు ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తుంది, అదృష్టవశాత్తూ కేకలు విన్న బాలిక తల్లి వెంటనే రావడంతో ప్రమాదం తప్పింది. లేదంటే ఊహించని దారుణం జరిగేది. వీధి కుక్కల దాడిలో బాలిక కాళ్లు, నడుము, తొడలపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాధిత బాలికను చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారడంతో స్థానికులతోపాటు నెటిజన్లు మున్సిపల్‌ అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. గతేడాది కూడా ఇదే రీతిలో భారీగా వీధికుక్కల దాడులు జరిగాయి. కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఇకనైనా అధికారులు మొద్దు నిద్రమాని ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తే బాగుంటుందని హితవు పలుకుతున్నారు. అయితే ఇలాంటి సంఘటనలు ఎన్ని సార్లు సంభవించిపా, దీనిపై ఎన్ని సార్లు ఫిర్యాదులు నమోదవుతున్నా హైదరాబాద్‌ మున్సిపల్‌ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విడ్డూరంగా ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.