Hyderabad: పాతబస్తీలోని 173 ఏళ్ల మున్షీ నాన్ కూల్చివేత..! నగరవాసుల్లో గుండె చివుక్కుమంటున్న బాధ..
173 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన హైదరబాద్ పాతబస్తీలోని మున్షీ నాన్ అవుట్‌లెట్ త్వరలో కనుమరుగు కానుంది. మెట్రో విస్తరణలో భాగంగా చారిత్రాత్మకమైన నాన్ అవుట్‌లెట్ తొలగించే ప్రయత్నాలు సర్కార్ మొదలు పెట్టింది. ఈ అవుట్‌లెట్ ప్రారంభించినప్పటి నుంచి తాండూర్‌పై చేసిన రొట్టెల రుచులు ఆస్వాదిస్తున్న నగర వాసులు ఈ విషయం తెలియగానే ఒక్కసారిగా దిగాలు పడిపోతున్నారు..

హైదరాబాద్, ఫిబ్రవరి 3: హైదరాబాద్.. ప్రముఖ చారిత్రక కట్టడాలకు, ప్రసిద్ధి చెందిన ప్రాంతాలకు నిలయం. ఏళ్ల తరబడి ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు నగరంలో ఎన్నో ఇష్టమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటితో ముడివేసుకున్న ఎన్నో తీపి గుర్తులు ఉన్నాయి. అలాంటి జ్ఞాపకాలను చెరిపేస్తూ ఏవైనా అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు తట్టుకోవడం కాస్త కష్టమే. ఇదంతా ఎందుకు ఇప్పుడు చెప్పుకుంటున్నామంటే.. నగరంలో చాలా ప్రాంతాలలాగే మున్షీ నాన్ అవుట్‌లెట్ కూడా ఎంతో ప్రసిద్ధి చెందిందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు అలాంటి నగర వారసత్వానికి పెద్ద దెబ్బ తగలనుంది.
173 ఏళ్ల నాటి చరిత్ర కలిగి ఉన్న మున్షీ నాన్ అవుట్‌లెట్ హైదరాబాద్ సిటీలో చాలా ఫేమస్. ఇది పాతబస్తీలో ఉంది. కానీ రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలోకి మెట్రో రైలు రానుంది. దీంతో మెట్రో విస్తరణలో భాగంగా చారిత్రాత్మకమైన నాన్ అవుట్‌లెట్ తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ అవుట్‌లెట్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు సాంప్రదాయ పద్దతిలో తాండూర్‌పై చేసిన రొట్టెలను ఇక్కడ విక్రయిస్తుంటారు. ఇవి స్థానికంగా చాలా మందికి ఇష్టమైనవి. ఇక్కడ తయారయ్యే రొట్టెలను తినడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఎగబడి మరీ కొంటుంటారు. ఈ క్రమంలో త్వరలో ఈ ప్రాంతంలో అవుట్‌లెట్ తొలగించడమనే విషయం చాలా మందికి ఇప్పుడు మింగుడు పడడం లేదు. అయితే.. మున్షీ నాన్ అవుట్‌లెట్ యజమానులు కూడా తమ దుకాణం కోసం ప్రత్యామ్నాయంగా వేరే స్థలం కోసం చూస్తున్నట్లు తెలిసింది. కొత్త స్థలాన్ని ఎంపిక చేసుకుని అక్కడ దుకాణం తెరవాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లు మున్షీ నాన్ యజమాని అబ్దుల్ హమీద్ తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి విమానాశ్రయానికి అనుసంధానించే మెట్రో లైన్లు, పాతబస్తీ కోసం చాంద్రాయణగుట్ట నుంచి MGBS లైన్‌ను కలుపుతూ మెట్రో రైల్ రెండో దశ కారిడార్‌లకు సంబంధించి గతేడాది సెప్టెంబర్‌లో తీసుకున్న నిర్ణయాలకు ఇటీవల కార్యరూపం దాల్చేందుకు ఆమోదం లభించింది. మొత్తం 116.2 కిలోమీటర్ల మేర కొత్త కారిడార్లకు అనుమతి లభించింది. విమానాశ్రయానికి వెళ్లే మార్గం ఆరాంఘర్ మీదుగా వెళుతుంది. పాతబస్తీ కోసం మెట్రో రైలు తప్పనిసరిగా దారుల్ షిఫా-పురానీ హవేలీ ప్రాంతం గుండా వెళుతుంది. ఇదే మార్గంలో నగరంలోని ప్రసిద్ధి చెందిన ఎన్నో చారిత్రక స్మారకాలు, పేరున్న కట్టడాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ ప్రాంతంలో ఉన్న మున్షీ నాన్‌ను కూడా రోడ్డు విస్తరణ కోసం కూల్చివేయనున్నారు.
మున్షీ నాన్ అవుట్‌లెట్ యజమాని అబ్దుల్ హమీద్ దీనిపై స్పందిస్తూ.. ‘రోడ్డు విస్తరణ కోసం మా దుకాణాన్ని కూల్చివేయడానికి ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి. ఇలాంటి తరుణంలో మాతో పాటు కొంత మంది స్థానికులు కూడా ఇక్కడ మెట్రోను వ్యతిరేకిస్తున్నారు. దుకాణాన్ని కూల్చివేయాలనుకునే ప్రభుత్వ నిర్ణయం పట్ల చాలా మంది సుముఖంగా లేరు. ఓల్డ్ సిటీకి చెందిన కొందరు స్థానిక ప్రజలు, ప్రధానంగా దారుల్ షిఫా మైదానం సమీపంలోని నివాసితులు ఓల్డ్ సిటీ హైదరాబాద్ మెట్రో రైలు లైన్ విస్తరణను వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రాంతంలోని షియా ముస్లిం వర్గానికి చెందిన చారిత్రక స్మారక చిహ్నాలను తొలగింస్తే వారి మనోభావాలు దెబ్బతిని ఆందోళనలు చెలరేగే అవకాశం కూడా లేకపోలేదు. అయితే.. మేము ప్రత్యామ్నాయ స్థలం కోసం చూస్తున్నాం. కాబట్టి తొందరలోనే ఆ పనులన్నీ పూర్తయి దుకాణాన్ని వేరే చోటికి మార్చే అవకాశం ఉందని అన్నారు.
మున్షీ నాన్‌కు ఇంత గొప్ప చరిత్ర ఉందా?
మున్షీ నాన్ 1851లో హమీద్ పూర్వీకులు స్థాపించారు. అప్పటి నుంచి ఈ దుకాణం ఎన్నో ఏళ్లుగా ఇదే ప్రదేశంలో ఉంది. హైదరాబాద్ నాల్గవ నిజాం (నాసిర్-ఉస్-దౌలా) కార్యాలయంలో మున్షీ లేదా (గుమస్తా)గా పని చేసిన మహమ్మద్ హుస్సేన్ మున్షీ నాన్ దీనిని ప్రారంభించాడు. అతను ఇక్కడ తయారుచేసే నాన్ కోసం ఢిల్లీకి వెళ్లి వీటి తయారీ విధానం నేర్చుకున్నాడు. ఆ తర్వాత 1851లో సొంతంగా తయారుచేసి విక్రయాలు ప్రారంభించాడు. అలా 173 ఏళ్లుగా ఇక్కడ నాన్ విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి. పైగా ఎంతో మందికి ఇష్టమైన అవుట్‌లెట్‌గా పేరు తెచ్చుకుంది. ఎంతో మంది ఇక్కడ తయారయ్యే నాన్‌లను ఇష్టంగా తింటారు.
దీని యజమాని అబ్దుల్ హమీద్ కొన్నాళ్ల క్రితం నాన్‌ను తయారు చేయడానికి ఆధునిక యంత్రాలు ఉపయోగించాలని ప్రయత్నించాడు. అయితే, ఎంత ప్రయత్నించినప్పటికీ ముందు నుంచి వారు తయారుచేస్తున్న ఆ రుచిని, నాణ్యతను మళ్లీ అదేవిధంగా చేయలేకపోయారు. ఈ యంత్రాలు సాంప్రదాయ పద్దతికి సరిపోలేదు. నిజానికి, మున్షీ నాన్ వద్ద ఉన్న రొట్టె తాండూర్‌పై పిండిని అతికించడం ద్వారా తయారు చేస్తారు. అందుకే ఆధునిక యంత్రాలతో కాకుండా ముందు నుంచి అవలంభిస్తున్న పద్ధతినే ప్రస్తుతం ఈ దుకాణ యజమానులు కొనసాగిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.