SSC Pre-Final Exam Timings Changed: పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. ప్రీ-ఫైనల్ పరీక్షా సమయాల్లో కీలక మార్పు!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదోతరగతి ప్రీ-ఫైనల్ పరీక్షలు మార్చి 6 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన జారీ చేసింది. ప్రీ ఫైనల్ పరీక్షల సమయాల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. రంజాన్ పండగ సందర్భంగా ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ పరీక్ష సమయాల్లో కీలక మార్పులు చేసింది..

హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదోతరగతి ప్రీ-ఫైనల్ పరీక్షలు మార్చి 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే రంజాన్ పండగ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ పరీక్ష సమయాల్లో కీలక మార్పులు చేసింది. సాధారణంగా పరీక్షలను మధ్యాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు నిర్వహిస్తారు. అయితే రంజాన్ కారణంగా పరీక్ష సమయాన్ని గంట ముందుకు జరిపారు. దీంతో పదో తరగతి ప్రీ-ఫైనల్ పరీక్షలు మధ్యాహ్నం 12.15 గంటల నుంచి మధ్యాహ్నం 3.15 గంటల వరకు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది.
భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం పరీక్షలను గంటన్నర వ్యవధిలోనే నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రారంభమై 1.45 గంటలకే ముగుస్తాయన్నమాట. పరీక్ష సమాయాల్లో మార్పు కారణంగా మధ్యాహ్నం 12.15 గంటలలోపే పదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందిస్తారు.
కాగా పదో తరగతి ప్రీ-ఫైనల్ పరీక్షలు మార్చి 6వ తేదీ నుంచి మార్చి 15వ తేదీ వరకు జరగనున్న సంగతి తెలిసిందే. పదో తరగతి ప్రీ-ఫైనల్ పరీక్షల ఎగ్జామ్ షెడ్యూల్ ప్రకారం మార్చి 6వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్, మార్చి 7 తేదీన సెకండ్ లాంగ్వేజ్, మార్చి 10 తేదీన ఇంగ్లీష్, మార్చి 11 తేదీన గణితం, మార్చి 12 తేదీన భౌతిక శాస్త్రం, మార్చి 13 తేదీన జీవ శాస్త్రం, మార్చి 15 తేదీన సోషల్ స్టడీస్ పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను కూడా విద్యాశాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక ఈ పరీక్షలు ముగిసిన వారం రోజుల్లోనే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. అంటే మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.