TG PGECET 2025 Exams: నేటి నుంచి పీజీఈసెట్ ఆన్‌లైన్ రాత పరీక్షలు షురూ.. ఈసారి భారీగా పోటెత్తిన బీటెక్ బాబులు!
రాష్ట్రంలో పీజీ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష (పీజీఈసెట్ 2025)కు ఈసారి దరఖాస్తులు భారీగా పెరిగాయి. గడచిన నాలుగేళ్లతో పోల్చుకుంటే ఈసారి అత్యధిక దరఖాస్తులు వచ్చినట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. గతేడాది 22,712 మంది దరఖాస్తు చేసుకోగా.. ఈ సారి అదనంగా 2,622 దరఖాస్తులు పెరిగి ఏకంగా..

హైదరాబాద్, జూన్ 16: తెలంగాణ రాష్ట్రంలో పీజీ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష (పీజీఈసెట్ 2025)కు ఈసారి దరఖాస్తులు భారీగా పెరిగాయి. గడచిన నాలుగేళ్లతో పోల్చుకుంటే ఈసారి అత్యధిక దరఖాస్తులు వచ్చినట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. గతేడాది 22,712 మంది దరఖాస్తు చేసుకోగా.. ఈ సారి అదనంగా 2,622 దరఖాస్తులు పెరిగి మొత్తం 25,334కు చేరాయి. అంటే గతేడాదితో పోల్చితే 13.20 శాతం దరఖాస్తులు పెరిగాయి. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎంటెక్, ఎంఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి పీజీఈసెట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా వచ్చిన దరఖాస్తుల్లో బీఫార్మసీకి చెందిన దరఖాస్తులు ఎనిమిది వేల వరకు ఉండగా… మిగిలిన దరఖాస్తులన్నీ బీటెక్ అభ్యర్థులవే. పెరిగిన దరఖాస్తులు కూడా ఇంజినీరింగ్‌కు సంబంధించినవే అని అధికారులు చెబుతున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు ప్రాంగణ నియామకాలు తగ్గిపోవడం, అమెరికాలో చదివేందుకు ఆంక్షలు అడ్డుగా ఉండటంతో అత్యధిక మంది బీటెక్ విద్యార్ధులు ఎంటెక్ చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాగా తెలంగాణ పీజీఈసెట్ పరీక్షలు జూన్ 16 నుంచి అంటే సోమవారం నుంచి జూన్ 19వ తేదీ వరకు పలు పరీక్ష కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్ విధానంలో జరగనున్నాయి. అనంతరం ఫలితాలు కూడా త్వరలోనే విడుదల చేయనున్నారు.
పీజీఈసెట్‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలు, అఫిలియేటెడ్ ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కాలేజీల్లో.. ఏరోస్పేస్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, బయో-టెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్, ఫుడ్ టెక్నాలజీ, మెటలర్జికల్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్, నానో టెక్నాలజీ, జియో-ఇంజినీరింగ్ అండ్ జియో-ఇన్ఫర్మాటిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్, ఫార్మసీ, టెక్స్‌టైల్ టెక్నాలజీ.. మొత్తం 19 విభాగాల్లో ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్, గ్రాడ్యుయేట్ లెవెల్ ఫార్మ్ డి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
రేపట్నుంచే తెలంగాణ ఈసెట్ 2025 కౌన్సెలింగ్
తెలంగాణ ఈసెట్ మొదటి విడత కౌన్సెలింగ్‌ను రేపట్నుంచి అంటే జూన్ 17 నుంచి 21 వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఉన్నత విద్యామండలి షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 14వ తేదీలోగా స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో చేపట్టనున్న కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని ఈ సందర్భంగా టీజీఈసెట్-2025 కన్వీనర్ వెల్లడించారు. కౌన్సెలింగ్ అనంతరం జూన్ 25లోగా తొలి విడత సీట్లు కేటాయిస్తామని తెలిపారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




