Sanskrit as Inter 2nd Language: ఇంటర్‌లో ద్వితీయ భాషగా సంస్కృతం.. ఇంటర్ బోర్డు నిర్ణయంపై మండిపడుతున్న జనాలు
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సంస్కృతాన్ని రెండవ భాషగా ప్రవేశపెట్టాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి (BIE) జారీ చేసిన సర్క్యులర్ తీవ్ర వ్యతిరేకతను రేకెత్తించింది. యాభై శాతం మంది విద్యార్థులు తెలుగు కాకుండా ఇతర భాషలు చదువుతున్నారు. 90 శాతం ప్రైవేట్ కళాశాలలు తెలుగును ఎంపికగా అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

హైదరాబాద్, ఏప్రిల్ 15: వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీల్లో సంస్కృతం సబ్జెక్టును ద్వితీయ భాషగా ప్రవేశపెట్టనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు తాజాగా వెల్లడించింది. దీంతో ఇంటర్ బోర్డు నిర్ణయం వివాదాస్పదంగా మారింది. పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తుంది. బోర్డు నిర్ణయాన్ని పలు వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇంటర్ బోర్డు నిర్ణయం తెలుగుభాషకు గొడ్డలిపెట్టులాంటిదని పలువురు భాషావేత్తలతోపాటు జనాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మాతృభాష అయిన తెలుగుకు తీరనిద్రోహం చేయడమేనని హెచ్చరిస్తున్నాయి. ఈ అంశంపై మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కూడా స్పందించారు.
సంస్కృత భాషను ద్వితీయభాషగా అమలు చేయాలన్న నిర్ణయంపై వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. మార్కుల కోసమే ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రం పునరాలోచించాలని ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. మాతృభాషను విద్యార్ధులకు దూరం చేయడం మంచిదికాదని, మాతృభాషకు మరింత చేరువ చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం సంస్కరణలు తీసుకురావాలని ఆయన సూచించారు. అయితే ఇంటర్మీడియట్ విద్యలో సంస్కృతం ద్వితీయ భాషగా చాలాకాలంగా అమలవుతుంది. దాదాపు అన్ని కార్పొరేట్ కాలేజీలు ద్వితీయభాషగా సంస్కృతాన్నే బోధిస్తున్నాయి కూడా. కానీ కేవలం ప్రభుత్వ కాలేజీల్లో మాత్రమే అత్యధికులు తెలుగు సబ్జెక్టు తీసుకుంటున్నారు. పదో తరగతి వరకు తెలుగులో చదివిన విద్యార్థులు ఇంటర్‌కు వచ్చేసరికి సంస్కృతాన్ని తీసుకుంటున్నారు.
విద్యార్ధులు మాత్రం పేరుకు సంస్కృతం తీసుకున్నప్పటికీ, పరీక్షలను మాత్రం కొందరు తెలుగు, మరికొందరు ఇంగ్లిష్‌లోనే రాస్తున్నారు. అందుకు కారణం సంస్కృతంలో 100కు 99, 98 మార్కులేస్తున్న ఉదంతాలే. దీంతో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కూడా సంస్కృతాన్ని ప్రవేశపెడితే విద్యార్ధులకు అధిక మార్కులు వస్తాయన్న వాదనతో ఇంటర్ బోర్డు ఏకీభవిస్తుంది. మార్కుల యావలో అంతా సంస్కృతం తీసుకుంటే తెలుగుకు ప్రమాదం పొంచి ఉందని, తెలుగు కనుమరుగు అవుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్‌లో ద్వితీయ భాషగా సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను పునఃపరిశీలించాలని, మాతృభాష అయిన తెలుగును రక్షించుకోవాలని అంటున్నారు. తల్లిదండ్రులు, అధ్యాపక సంఘాల అభిపాయాలు తీసుకోకుండా సంస్కృతాన్ని ప్రవేశపెట్టడం సరికాదని ఇంటర్ బోర్డుకు సూచిస్తున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.