Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mass Copying in MBBS Exams 2025: అడ్డగోలుగా ఎంబీబీఎస్‌ విద్యార్ధుల మాస్‌ కాపియింగ్.. అధికారులు నిద్రపోతున్నారా?

మెడికల్ విద్యార్ధులను తనిఖీ చేసి పరీక్షా కేంద్రంలోకి పంపాల్సి అధికారులు వారితో కుమ్మక్కై.. భారీ మొత్తంలో నగదు తీసుకుని పరీక్షల్లో దగ్గరుండి స్లిప్పులు అందించే స్థితికి దిగజారారు.. ఇద్దరు విద్యార్ధులు ఏకంగా నోట్‌బుక్, సెల్‌ఫోన్‌ తీసుకెళ్లి పరీక్షల్లో కాపీ కొట్టడం నిర్లక్ష్యానికి పరాకాష్ట. పైగా పరీక్ష సమయంలో విద్యార్థులు కాపీ కొడుతుంటే చూసీ చూడనట్లు..

Mass Copying in MBBS Exams 2025: అడ్డగోలుగా ఎంబీబీఎస్‌ విద్యార్ధుల మాస్‌ కాపియింగ్.. అధికారులు నిద్రపోతున్నారా?
Mass Copying in MBBS Exams
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 15, 2025 | 8:23 AM

విజయవాడ, ఏప్రిల్ 15:  కష్టపడకుండానే పరీక్షల్లో పాసై పోవడానికి మెడికల్ విద్యార్ధులు మాస్‌ కాపీ కొడుతూ పట్టుబడ్డారు. విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో ఈ షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. ఈ కాలేజీలో పలువురు విద్యార్ధులు మాస్‌-కాపీయింగ్‌కు పాల్పడుతూ గత బుధవారం (ఏప్రిల్ 9) పట్టుబడ్డారు. కళాశాలలో పనిచేసే సిబ్బందితో విద్యార్థులు కుమ్మక్కై కాపీ కొట్టేందుకు యత్నించారు. మొత్తం ఐదుగురు విద్యార్ధులు అడ్డంగా పట్టుబడ్డారు. ఇందులో తొలుత ఇద్దరు విద్యార్ధులు పట్టుబడగా.. ఆ తరువాత పరీక్షల విధుల్లో పాల్గొంటున్న ఐదుగురు సిబ్బందిని మార్చారు. అయినప్పటికీ మరో ఇద్దరు విద్యార్థులు అదే తరహాలో కాపీ కొడుతూ పట్టుబడ్డారు. వీరిలో ఓ విద్యార్థి నోట్‌బుక్ చూసి పరీక్ష రాసేందుకు యత్నించగా, మరో విద్యార్థి ఏకంగా సెల్‌ఫోన్‌తో పట్టుబడటం విశేషం.

విద్యార్ధులను తనిఖీ చేసి పరీక్షా కేంద్రంలోకి పంపాల్సి ఉండగా.. ఇద్దరు విద్యార్ధులు నోట్‌బుక్, సెల్‌ఫోన్‌ను లోపలికి తీసుకెళ్లడం వెనుక సిబ్బంది హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా పరీక్ష సమయంలో తనిఖీల బృందం.. విద్యార్థుల వద్ద, తరగతి గదుల వద్ద చెక్‌ చేయగా అధిక సంఖ్యలో స్లిప్పులు లభ్యమైనాయి. వీటిల్లో అత్యధికం ఆ రోజు పరీక్ష పేపర్‌లోని ప్రశ్నలకు జవాబులే కావడం గమనార్హం. వర్సిటీ నుంచి ఆన్‌లైన్‌లో వచ్చిన ప్రశ్నపత్రంలో ఉన్న రెండు, ఐదు, పది మార్కుల ప్రశ్నల జవాబులు రాసి ఉన్న స్లిప్పులు విద్యార్థుల వద్ద దొరికాయి. ఇంత పెద్ద మొత్తంలో మెడికల్ కాలేజీల్లో కాపీ కొడుతూ విద్యార్ధులు పట్టుబడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.

గతంలోనూ ఇదే తంతు.. తీరు మార్చుకోని సిద్ధార్థ మెడికల్ కాలేజీ..!

గతంలోనూ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఈ మేరకు అడ్డదారులు తొక్కిన పలువురు విద్యార్ధులు పట్టుబడ్డారు. దీంతో గత రెండేళ్ల నుంచి ఈ కేంద్రంలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడం లేదు. మళ్లీ ఇప్పుడు పరీక్షలు నిర్వహించగా.. తీరు మార్చుకోని కాలేజీ సిబ్బంది ఇదే విధమైన తప్పిదాలకు పాల్పడుతున్నారు. తాజాగా విజయవాడ చుట్టుపక్కల ఉన్న మూడు ప్రైవేట్‌ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్‌లో ఫెయిల్‌ అయిన వారికి ఇక్కడ పరీక్షలు నిర్వహించగా.. కొందరు విద్యార్థులు ఎగ్జామినేషన్‌ విభాగంలో విధులు నిర్వహించే వారితో చేతులు కలిపారు. దీంతో పరీక్ష కేంద్రంలోకి స్లిప్పులు తీసుకొచ్చి కాపీ కొడుతున్నా ఇన్విజిలేటర్లు, పర్యవేక్షణ అధికారులు, పరిశీలకులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. సిబ్బందిలో కొందరు స్వయంగా స్లిప్పులను చేరవేయడం విడ్డూరంగా మారింది. ఓ విద్యార్థి రహస్యంగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్టీఆర్‌ ఆరోగ్య యూనివర్సిటీ రిజిస్ట్రార్, సీఓఈలు గత బుధవారం సడెన్‌గా తనిఖీలు చేయగా ఇక్కడి భాగోతం బయటపడింది.

ఇవి కూడా చదవండి

సాధారణంగా MBBS పరీక్షలకు ఎండీ పూర్తిచేసిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఇన్విజిలేటర్లుగా ఉండాలి. అందుకు విరుద్ధంగా నాన్‌-ఎంబీబీఎస్‌ ఫ్యాకల్టీకి ఇన్విజిలేషన్‌ బాధ్యతలు అప్పగించారు. జూనియర్, సీనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగులను ఎగ్జామినేషన్‌ విభాగం నుంచి అకౌంట్స్, ఎస్టాబ్లిష్‌మెంట్‌ సెక్షన్లకు పంపినా కాపీయింగ్‌కు మాత్రం అడ్డుకట్ట పడలేదు. విద్యార్థులు పరీక్షలు రాసే గదులు బహుళ అంతస్తుల భవనంలో ఉండడంతో ప్రతి గదికి తిరిగి తనిఖీ చేసేందుకు ఎక్కువ సమయం పట్టింది. ఈ వెసులు బాటునుకూడా అనుకూలంగా మార్చుకున్న సిబ్బంది ముందే విద్యార్ధులను అప్రమత్తం చేయడంతో అప్పటికే తమ వద్ద ఉన్న స్లిప్‌లను దొరక్కుండా జాగ్రత్తపడ్డారు.

ఆ కాలేజీ విద్యార్ధుల సమాధాన పత్రాలు మూల్యాంకనం చేస్తారా?

ఇంత పెద్ద మొత్తంలో అక్రమాలకు పాల్పడిన సిద్ధార్ధ మెడికల్‌ కాలేజీ సిబ్బంది వద్ద భారీ మొత్తంలో నగదు చేతులు మారినట్లు తెలుస్తోంది. పరీక్షల విధులు సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత కాలేజీ ప్రిన్సిపల్‌తోపాటు మిగిలిన చీఫ్‌ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్లు, విశ్వవిద్యాలయ పరిశీలకులు పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలి. కానీ నిబంధనలు తుంగలో తొక్కి మాస్‌ కాపియింగ్‌కు పాల్పడం పలు అనుమానాలకు తావిస్తుంది. అయితే తాజా ఘటన నేపథ్యంలో ఇక్కడ పరీక్షలు రాసిన విద్యార్ధుల సమాధాన పత్రాలు మూల్యాంకనం చేస్తారా? లేదంటే రద్దు చేసి.. మళ్లీ పరీక్షలు నిర్వహిస్తారా? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఏప్రిల్‌ 21 వరకు జరిగే ఈ పరీక్షల్లో రాష్ట్రంలోని 10 మెడికల్‌ కాలేజీల్లో పరీక్షలు సజావుగా జరుగుతాయో.. లేదోనన్న సందేహం వ్యక్తమవుతోంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.