Telangana: ఇక కొలువుల జాతర మొదలు – తెలంగాణ లో భారీగా ఉద్యోగాలు
తెలంగాణలో నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఉద్యోగ నియామక ప్రక్రియలు స్పీడందుకోనున్నాయి. ఒకదాని వెంట మరొకటి నోటిఫికేషన్లు ఇచ్చే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెలాఖరులో రెండు కీలక నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. పూర్తి డీటేల్స్ ఈ కథనంలో తెలుసుకుందాం పదండి.

తెలంగాణలో నిరుద్యోగ యువత ఎదురు చూస్తున్న ఉద్యోగ ప్రక్రియలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. గత ఏడాది నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని కేంద్రంగా చేసుకుని నిలిపివేసిన ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇప్పుడు ఒకదాని వెంట ఒకటి వెలువడనున్నాయి. గతంలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌ను రీషెడ్యూల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం ముఖ్యమంత్రితో పాటు మంత్రుల బృందం ప్రత్యేకంగా సమావేశమై స్పష్టమైన కార్యాచరణ రూపొందించనుంది.
ఎస్సీ వర్గీకరణ చట్టంతో ఆగిన ప్రక్రియ
తెలంగాణ ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి ముందుగానే ప్రణాళిక రూపొందించింది. మొత్తం 20 నోటిఫికేషన్లను జారీ చేసి, విభిన్న శాఖల్లో నియామకాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఆ సమయంలో షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు రావడంతో కొత్త నోటిఫికేషన్లను నిలిపివేసింది. ఫలితంగా సెప్టెంబర్ 2024 నుంచి నియామక ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది.
ఇప్పుడు క్లారిటీ… మరింత స్పీడుగా నియామకాలు!
ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చట్టంపై స్పష్టతకు రావడంతో, ఆ నిర్ణయాన్ని కేంద్రంగా చేసుకుని రోస్టర్‌ను ఫిక్స్ చేసి, నియామక ప్రక్రియను మళ్లీ ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యంగా గడచిన ఏడాది కాలంలో అనేక శాఖల్లో ఉద్యోగులు రిటైర్ అవడంతో ఖాళీలు మరింతగా పెరిగాయి. ఈ పెరిగిన ఖాళీలను పరిగణనలోకి తీసుకుని అప్‌డేటెడ్ జాబ్ క్యాలెండర్‌ను రూపొందించనున్నారు.
ఈ నెలాఖరులో రెండు కీలక నోటిఫికేషన్లు
ఈ నెలాఖరులోగా తొలి విడతగా రెండు పెద్ద నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉంది. మహిళా, శిశు సంక్షేమ శాఖలో 14,236 అంగన్‌వాడీ ఉద్యోగాలు, హెల్త్ డిపార్టుమెంట్‌లో 4 వేలకు పైగా పోస్టుల కోసం నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్టీసీలో మూడు వేలకుపైగా పోస్టులకు ఇప్పటికే అనుమతి లభించిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఈ మూడు విభాగాలనూ మొదటి విడతలో పూర్తి చేసి యువతకు కొలువులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది.
గ్రూప్, పోలీస్, గురుకుల ఉద్యోగాలు తర్వాతే
ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఏప్రిల్‌లో పోలీసు విభాగంలో నియామక ప్రక్రియ మొదలవ్వాలి. మేలో గ్రూప్-2 నోటిఫికేషన్, జూలైలో గ్రూప్-3 నోటిఫికేషన్ రావాల్సి ఉంది. అలాగే ఫిబ్రవరిలో షెడ్యూల్ చేసిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా వాయిదా పడింది. ఇవన్నీ ఎస్సీ వర్గీకరణ కారణంగా ఆలస్యమయ్యాయి. ఇప్పుడు వీటిని మళ్లీ షెడ్యూల్ చేయనున్నారు. అలాగే గురుకుల, సింగరేణి కాలరీస్, ఇంజినీరింగ్ విభాగాల్లో నియామకాలు కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది
ఎప్పుడు ఏ పరీక్ష? స్పష్టత ఇవ్వనున్న ప్రభుత్వం
ప్రతీ పరీక్ష నిర్వహణకు అటు అఖిల భారత పరీక్షల షెడ్యూల్, ఇటు రాష్ట్రంలోని ఇతర పరీక్షల సమయాన్ని పరిగణనలోకి తీసుకుని షెడ్యూల్ ఖరారు చేయాలి. అందుకే మంత్రుల బృందం ఈ విషయంపై ప్రత్యేకంగా సమీక్షించి స్పష్టత ఇవ్వనుంది. ఎప్పుడు ఏ నోటిఫికేషన్ విడుదల చేయాలి? ఏ పరీక్ష ఎప్పుడు నిర్వహించాలి? అన్న దానిపై త్వరలోనే ప్రభుత్వ నిర్ణయం వెలువడనుంది
అర్హులందరికీ అవకాశాలు… రిజర్వేషన్ల ప్రకారం నియామకాలు
ఈసారి విడుదలయ్యే నోటిఫికేషన్లలో ఎస్సీ వర్గీకరణ చట్టానికి అనుగుణంగా రిజర్వేషన్‌ను అమలు చేయనున్నారు. కొత్తగా రూపొందించబోయే రోస్టర్ ప్రకారం ప్రతి విభాగానికి న్యాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వెనకబడిన తరగతులకు పెద్ద మొత్తంలో అవకాశాలు దక్కనున్నాయి.
నిరుద్యోగులకు ఊరటనిచ్చే శుభవార్త
కొనసాగుతున్న నిరుద్యోగ సమస్యల మధ్య, ఈ ప్రకటనలు రాష్ట్ర యువతకు శుభవార్తగా మారనున్నాయి. నెలల తరబడి ఎదురు చూస్తున్న యువతకు త్వరలోనే కొత్త ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ నియామక ప్రక్రియలు తుది దశకు చేరుకున్న వేళ, కొలువుల జాతర మొదలైపోయిందనే సంకేతాలు ప్రభుత్వవర్గాల నుంచి స్పష్టంగా వెలువడుతున్నాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.